ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్ లో జోకోవిచ్ సరికొత్త రికార్డు!

సెర్బియన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటను జోరుగా కొనసాగిస్తున్నాడు. వరుసగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు.

Advertisement
Update:2023-06-05 13:03 IST

ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్ లో జోకోవిచ్ సరికొత్త రికార్డు!

సెర్బియన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటను జోరుగా కొనసాగిస్తున్నాడు. వరుసగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు...

2023 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో సీడెడ్ స్టార్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు టాప్ సీడ్ కార్లోస్ అల్ కరాజ్, 3వ సీడ్ నొవాక్ జోకోవిచ్ అలవోకగా చేరుకొన్నారు.

తన కెరియర్ లో ఇప్పటికే 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ ద్వారా రికార్డుస్థాయిలో 23వ టైటిల్ కు గురిపెట్టాడు. 3వ సీడ్ హోదాలో టైటిల్ వేటకు దిగిన జోకోవిచ్ 4వ రౌండ్లో అలవోక విజయం సాధించడం ద్వారా రికార్డుస్థాయిలో 17వసారి క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించాడు.

నడాల్ ను మించిన జోకోవిచ్....

మట్టికోర్టులో మహాబలుడుగా పేరుపొందిన 14 టైటిల్స్ విన్నర్ రాఫెల్ నడాల్ గాయాలతో ప్రస్తుత సీజన్ టోర్నీకి దూరం కావడంతో జోకోవిచ్ ఫేవరెట్ స్టార్లలో ఒకడిగా టైటిల్ వేటకు దిగాడు.

పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియం కోర్టులో జరిగిన 4వ రౌండ్ పోరులో జోకోవిచ్ వరుస సెట్లలో పెరూ ఆటగాడు జువాన్ ప్యాబ్లో వరిల్లాస్ ను చిత్తు చేయటం ద్వారా వరుసగా 14వసారి, తన కెరియర్ లో 17వసారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ చేరుకోగలిగాడు.

ఈ క్రమంలో నడాల్ పేరుతో ఉన్న 16 క్వార్టర్ ఫైనల్స్ రికార్డును జోకోవిచ్ 17 క్వార్టర్ ఫైనల్స్ తో అధిగమించాడు.

ఏకపక్షంగా సాగిన 4వ రౌండ్ పోరులో జోకోవిచ్ 6-3, 6-2, 6-2తో విజేతగా నిలిచాడు. గంటా 57 నిమిషాలపాటు సాగిన పోరులో మాజీ చాంపియన్ జోకోవిచ్ ఆరు బ్రేక్ పాయింట్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాడు.

ప్రస్తుత ఈ టోర్నీలో మొదటి నాలుగు రౌండ్ల మ్యాచ్ లను ఒక్క సెట్ కూడా కోల్పోకుండా జోకోవిచ్ నెగ్గడం విశేషం. ఈ ఏడాది ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ తో తన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్యను 22కు పెంచుకొన్న జోకోవిచ్..23వ టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాడు.

సెమీఫైనల్లోచోటు కోసం జరిగే క్వార్టర్స్ సమరంలో రష్యా ఆటగాడు కారెన్ కచనోవ్ తో జోకోవిచ్ తలపడనున్నాడు. కచనోవ్ ప్రత్యర్థిగా జోకోవిచ్ కు 8-1 రికార్డు ఉంది.

36 ఏళ్ల జోకోవిచ్ కెరియర్ లో గ్రాండ్ స్లామ్ టోర్నీల క్వార్టర్ ఫైనల్స్ చేరడం ఇది 55వసారి.

అల్ కరాజ్ కు లోరెంజో పరీక్ష..

యువఆటగాడు, టాప్ సీడ్ కార్లోస్ అల్ కరాజ్ 4వ రౌండ్లో లోరెంజో ముసెట్టీని 6-3, 6-2, 6-2తో చిత్తు చేయడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.

అల్ కరాజ్ కు ఇది 11వ గ్రాండ్ స్లామ్ మ్యాచ్ గెలుపు కావడం విశేషం. అల్ కరాజ్ 42 విన్నర్లు సాధించడంతో పాటు ఏడుసార్లు ప్రత్యర్థి సెర్వ్ ను బ్రేక్ చేయగలిగాడు.

ఇప్పటికే యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన యువసంచలనం కార్లోస్ అల్ కరాజ్..ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సైతం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరిన తొలి ప్లేయర్ ఘనతను అనస్తాసియా పవుల్యుచెంకోవా దక్కించుకొంది. ప్రీ-క్వార్టర్స్ లో అనస్తాసియా 3-6, 7-6, 6-3తో 28వ సీడ్ ఎల్సీ మెర్టిన్స్ ను అధిగమించింది.

సెమీస్ లో చోటు కోసం జరిగే క్వార్టర్స్ సమరంలో కారోలినా ముచోవాతో అనస్తాసియా అమీతుమీ తేల్చుకోనుంది.

Tags:    
Advertisement

Similar News