రోహిత్ కెప్టెన్సీకి ముప్పులేనట్లే!

భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నాయకత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ జరుగుతున్న ప్రచారానికి బీసీసీఐ తెరదించింది.

Advertisement
Update:2023-01-02 11:51 IST

రోహిత్ శర్మ

భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నాయకత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ జరుగుతున్న ప్రచారానికి బీసీసీఐ తెరదించింది. వన్డేలతో పాటు టెస్టు క్రికెట్లోనూ భారత కెప్టెన్ గా రోహిత్ శర్మే ఉంటాడని బోర్డు హైపవర్ కమిటీ తేల్చిచెప్పింది....

భారత రాజకీయాలలో మాత్రమే కాదు...క్రికెట్లో సైతం రకరకాలుగా జరిగే ప్రచారానికి ఏమాత్రం కొదవలేదు. భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ విఫలమయ్యాడని, అతని కెప్టెన్సీకి రోజులు దగ్గర పడ్డాయంటూ మీడియాలో ఈ మధ్యకాలంలో జోరుగా ప్రచారం సాగింది.

అయితే...ముంబై లోని బీసీసీఐ ప్రధానకార్యాలయంలో కొత్తసంవత్సరం తొలిరోజునే జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో రోహిత్ నాయకత్వం పట్ల సంతృప్తి వ్యక్తమయ్యింది.

ఆసియాకప్, ప్రపంచకప్ టోర్నీలలో విఫలమైనా...

గత ఏడాది జరిగిన ఆసియాకప్ టీ-20, ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలలో రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత్ తన అదృష్టం పరీక్షించుకొంది. అయితే ..భారీఅంచనాలతో, హేమాహేమీ ఆటగాళ్లతో బరిలోకి దిగినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

దుబాయ్ వేదికగా జరిగిన 2022 ఆసియాకప్ టీ-20 టోర్నీలో భారత్ సూపర్-4 రౌండ్ దశకు చేరుకోలేకపోయింది. అదీ చాలదన్నట్లు...ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఘోరపరాజయం చవిచూసింది.

ఓపెనర్ గా, కెప్టెన్ గా రోహిత్ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోడంతో విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ ప్రచారం ఉవ్వెత్తున లేచింది. చివరకు ..బంగ్లాదేశ్ చేతిలో సైతం వన్డే సిరీస్ లో 1-2తో పరాజయం చవిచూడటం కూడా రోహిత్ కెప్టెన్సీకి మాయనిమచ్చలా మిగిలింది.

2022 సీజన్లో పలు రకాల కారణాలతో రోహిత్ మొత్తం 32 అంతర్జాతీయమ్యాచ్ లకు దూరమయ్యాడు. కెప్టెన్ గా అందుబాటులో ఉండాల్సిన రోహిత్ తరచూ గాయాలతో..

పలు కీలక మ్యాచ్ లు, సిరీస్ లకు దూరంగా ఉండడటం చర్చనీయాంశంగా మారింది.

గత ఏడాదికాలంలో భారతజట్లకు ఏడుగురు వేర్వేర్ క్రికెటర్లు నాయకత్వం వహించడం కూడా విమర్శలకు దారి తీసింది.

రోహిత్ వైపే మొగ్గు...

భారత్ వేదికగా త్వరలో ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ తో పాటు...ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలలో సైతం రోహిత్ శర్మే భారతజట్టుకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

ముంబైలో జరిగిన బీసీసీఐ సమావేశంలో కార్యదర్శి జే షా, బోర్డు చైర్మన్ రోజర్ బిన్నీ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఎన్ సీఏ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ లతో కూడిన హైపవర్ కమిటీ పలు అంశాల గురించి చర్చించింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు విశ్వాసం ప్రకటించింది.

జట్టు వైఫల్యానికి పలు రకాల కారణాలు దోహదం చేశాయని, కీలక ఆటగాళ్లు జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయాలతో అందుబాటులో లేకపోడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.

శ్రీలంకతో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వన్డే సిరీస్ లో మాత్రం రోహిత్, పాండ్యా కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.

కెప్టెన్ గా ఇదీ రోహిత్ రికార్డు...

భారత కెప్టెన్ గా 2021 సీజన్లో విరాట్ కొహ్లీ నుంచి జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్..2 టెస్టుల్లో రెండుకు రెండు విజయాలతో నూటికి నూరుశాతం రికార్డు సాధించాడు.

18 వన్డేల్లో 13 విజయాలతో 83 శాతానికి పైగా సక్సెస్ రేటు సాధించాడు.

51 టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 39 విజయాలు అందించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా 143 మ్యాచ్ ల్లో 79 విజయాలతో పాటు 5సార్లు ముంబైని విజేతగా నిలిపాడు.

రోహిత్ నాయకత్వంలో ద్వైపాక్షిక సిరీస్ ల్లో తిరుగులేని విజయాలు సాధించిన భారత్...ఐసీసీ, ఆసియాటోర్నీలలో చతికిల పడటం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News