భారత 'బాహుబలి'కి బంగారు పతకం!
బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. పైసా వసూల్ అనుకొనేలా రాణించాడు.
బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. పైసా వసూల్ అనుకొనేలా రాణించాడు.
జావలిన్ త్రో ( బల్లెంవిసురుడు)లో భారత బాహుబలి నీరజ్ చోప్రా..త్వరలో ప్రారంభంకానున్న పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహాలను జోరుగా మొదలుపెట్టాడు. ఇప్పటికే ఒలింపిక్స్, ప్రపంచ పోటీలలో బంగారు పతకాలు సాధించిన నీరజ్ వరుసగా రెండో ఒలింపిక్స్ స్వర్ణానికి గురిపెట్టాడు.
నీరజ్ పైసా వసూల్.....
పారిస్ వేదికగా జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే 2024 ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా ఖచ్చితంగా బంగారు పతకం సాధించే అవకాశం ఉండడంతో..భారత క్రీడామంత్రిత్వశాఖ పూర్తిస్థాయిలో అండగా నిలిచింది.
విదేశాలలో నీరజ్ శిక్షణ కోసం ఇప్పటికే 48 లక్షల రూపాయలకు పైగా వ్యయం చేసింది. అయితే..నీరజ్ మాత్రం తనపైన భారత ప్రభుత్వం పెడుతున్న ప్రతిరూపాయికి న్యాయం చేసేలా రాణిస్తూ..పైసా వసూల్ అనుకొనేలా చేశాడు.
ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు రెండు ప్రధాన టోర్నీలలో ఒకటైన పావోనూర్మీ గేమ్స్..పురుషుల జావలిన్ త్రోలో నీరజ్ అలవోకగా బంగారు పతకం సాధించాడు.
85.97 మీటర్ల రికార్డుతో స్వర్ణం...
అంతర్జాతీయ అథ్లెటిక్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పావో నూర్మీ గేమ్స్ ను ఫిన్లాండ్ లోని తురుకు వేదికగా ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుత 2024 పావో నూర్మీ గేమ్స్ లో సైతం..పురుషుల జావలిన్ త్రో విభాగంలో పలువురు ప్రముఖ అథ్లెట్లు పాల్గొన్నారు. అయితే..నీరజ్ చోప్రా 85.97 మీటర్ల రికార్డుతో అగ్రస్థానంలో నిలవడం ద్వారా స్వర్ణవిజేతగా నిలిచాడు. 90 మీటర్ల లక్ష్యాన్ని మాత్రం చేరుకోడంలో విఫలమయ్యాడు.
మొత్తం ఆరు త్రోలలో నీరజ్ 83.62 మీటర్లు, 83.45 మీటర్ల దూరం బల్లెం విసిరిన నీరజ్ తన 5వ ప్రయత్నంలో 85.97మీటర్ల లక్ష్యాన్ని సాధించడం ద్వారా విజేతగా నిలిచాడు. తన ఐదవ త్రోలో ఫౌల్ చేసిన నీరజ్ తీవ్రనిరాశకు గురయ్యాడు.
ఇదే విభాగంలో పోటీకి దిగిన ప్రపంచ మాజీ చాంపియన్ యాండర్సన్ పీటర్స్ 82. 58 మీటర్ల రికార్డుతో నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
నీరజ్ తో తలపడిన ఇతర అథ్లెట్లలో కీరానెన్ 84.19, హిలాండర్ 82. 96, పీటర్స్ 82.58, మార్ డారే 82.19, వాల్కాట్ 81.93, డెనింగ్ 79. 84, ఎటెలాటాలో 77.69మీటర్ల రికార్డు మాత్రమే నమోదు చేయగలిగారు. నీరజ్ చోప్రా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయినా స్వర్ణ విజేతగా నిలవడం విశేషం.
విదేశాలలో 176 రోజులపాటు శిక్షణ..
ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించాలన్న లక్ష్యంతో..యూరోప్ వాతావరణానికి అలవాటు పడటానికి వీలుగా నీరజ్ చోప్రా 176 రోజులపాటు విదేశీ గడ్డపైనే తన శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగించాడు.
గత ఒలింపిక్స్ లో స్వర్ణ విజేత నీరజ్ చోప్రా కోసం 'టాప్స్ ' పథకంలో భాగంగా భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ 48 లక్షల 76వేల రూపాయలు ఖర్చు చేసింది.
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలలో భాగంగా 176 రోజులపాటు దక్షిణాఫ్రికా, ఫిన్ లాండ్, జర్మనీ, టర్కీ దేశాలలో నీరజ్ శిక్షణ పొందాడు. 2023 డిసెంబర్ నుంచి 2024 మే వరకూ కేవలం నీరజ్ కోసమే భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. నీరజ్ సైతం తనపైన ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతిరూపాయికి న్యాయం చేసేలా సాధన చేస్తూ..ఒలింపిక్స్ కు సిద్ధమయ్యాడు.
డైమండ్ లీగ్ వైపు నీరజ్ చూపు...
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు జరిగే చివరి అంతర్జాతీయ టోర్నీడైమండ్ లీగ్ పారిస్ వేదికగానే జరుగనుంది. డైమండ్ లీగ్ లో సైతం బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా నీరజ్ తన సాధన కొనసాగిస్తున్నాడు.
డైమండ్ లీగ్ లో సైతం బంగారు పతకం గెలుచుకోడం ద్వారా..పారిస్ ఒలింపిక్స్ రేస్ లో అడుగుపెట్టాలని నీరజ్ నిర్ణయించాడు. 2024 ఒలింపిక్స్ లో భారత్ ఖచ్చితంగా సాధించే పతకం ఏదైనా ఉంటే..అది నీరజ్ చోప్రా సాధించే బంగారు పతకమే అనడంలో ఆశ్చర్యంలేదు.