నీరజ్ చోప్రాకు అలవోకగా బంగారు పతకం!
బల్లెంవీరుడు నీరజ్ చోప్రా స్వదేశీ గడ్డపై మూడేళ్ల తరువాత తొలి బంగారు పతకం సాధించాడు. 2024 -ఫెడరేషన్ కప్ లో తిరుగులేని విజేతగా నిలిచాడు.
బల్లెంవీరుడు నీరజ్ చోప్రా స్వదేశీ గడ్డపై మూడేళ్ల తరువాత తొలి బంగారు పతకం సాధించాడు. 2024 -ఫెడరేషన్ కప్ లో తిరుగులేని విజేతగా నిలిచాడు.
ప్రపంచాన్నే జయించినోడికి దేశాన్ని జయించడం ఓ లెక్కా అన్నట్లుగా ఉంది మన బల్లెం వీరుడు, ప్రపంచ, ఒలింపిక్ క్రీడల విజేత నీరజ్ చోప్రా పరిస్థితి.
2024- పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహాలలో భాగంగా భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీల బరిలో నీరజ్ నిలవడం ద్వారా..ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
2021 తరువాత స్వదేశంలో...
టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన తరువాత నుంచి నీరజ్ చోప్రా విదేశీ టోర్నీలకు మాత్రమే పరిమితమయ్యాడు. స్వదేశీ టోర్నీలకు దూరంగా ఉంటూ వచ్చాడు.
చివరిసారిగా 2021 ఫెడరేషనకప్ టోర్నీలో పాల్గొన్ననీరజ్ ఆ తర్వాత మూడేళ్ల విరామం తరువాత ప్రస్తుత 2024- ఫెడరేషనకప్ టోర్నీ బరిలో నిలిచాడు.
కేవలం భారత్ ప్రత్యర్థులతో మాత్రమే తలపడిన నీరజ్ మొదటి మూడు ప్రయత్నాలలో సత్తా చాటుకోలేకపోయాడు. మొదటి మూడు రౌండ్లలో మరో భారత అథ్లెట్ డీపీ మను 82.06 మీటర్లతో అగ్రస్థానంలో కొనసాగాడు.
అయితే..నీరజ్ చోప్రా తన నాలుగో ప్రయత్నంలో 82.27మీటర్ల రికార్డుతో అగ్రస్థానానికి దూసుకుపోడమే కాదు..బంగారు పతకం సైతం కైవసం చేసుకోగలిగాడు. 82.06 మీటర్ల రికార్డుతో మను రజత, 75.49 మీటర్లతో ఉత్తమ్ బాలా సాహెబ్ పాటిల్ కాంస్య పతక విజేతలుగా నిలిచారు.
2021 ఫెడరేషన్ కప్ టోర్నీలో 87.80 మీటర్ల రికార్డుతో స్వర్ణ పతకం సాధించిన నీరజ్..2024 టోర్నీలో మాత్రం 82.27 మీటర్ల రికార్డుతో బంగారు పతకం దక్కించుకోడం విశేషం.
90 మీటర్ల రికార్డే లక్ష్యంగా...
ప్రస్తుత ఏడాదిలోనే 90 మీటర్ల రికార్డు సాధించడం తన లక్ష్యమని నీరజ్ ప్రకటించాడు. సొంత గడ్డపై మూడేళ్ల తరువాత ఫెడరేషన్ కప్ టోర్నీలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నీరజ్ ప్రకటించాడు.
గతవారమే దోహా వేదికగా జరిగిన డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీలో 88.36 మీటర్ల రికార్డుతో రజత పతకం సాధించిన నీరజ్..పారిస్ ఒలింపిక్స్ లో సైతం బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.
2018 ఆసియాక్రీడల్లోనే 88.06 మీటర్ల దూరం విసిరిన తనను 90 మీటర్ల లక్ష్యం ఎప్పుడు సాధిస్తావని అభిమానులు అడుగుతున్నారని, ఈ ఏడాదే 90 మీటర్ల లక్ష్యం చేరుకోడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.
ఫిట్ నెస్ ను కాపాడుకొంటూ..నిరంతర సాధనతో తన సన్నాహాలు సాగుతున్నాయని, పారిస్ ఒలింపిక్స్ లో గట్టి పోటీ ఉంటుందని, గత ఒలింపిక్స్ లో సాధించిన బంగారు పతకాన్ని ప్రస్తుత ఒలింపిక్స్ లో సైతం నిలుపుకోడమే తనముందున్న లక్ష్యమని చెప్పాడు.
పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరుగనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందానికి నీరజ్ నాయకత్వం వహించనున్నాడు.