పారిస్ ఒలింపిక్స్ కు నీరజ్ చోప్రా అర్హత!

ఒలింపిక్స్ చాంపియన్ నీరజ్ చోప్రా అలవోకగా పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించాడు. 2023 ప్రపంచమీట్ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించాడు.

Advertisement
Update: 2023-08-26 09:30 GMT

ఒలింపిక్స్ చాంపియన్ నీరజ్ చోప్రా అలవోకగా పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించాడు. 2023 ప్రపంచమీట్ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించాడు....

బల్లెం విసురుడులో భారత బాహుబలి, ప్రపంచ నంబర్ వన్ స్టార్ నీరజ్ చోప్రా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. హంగెరీ రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పురుషుల జావలిన్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్ లోనే అదరగొట్టాడు.

88.77 మీటర్ల త్రో తో ఒలింపిక్స్ బెర్త్...

నాలుగేళ్ల క్రితం ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ లోకి దూసుకొచ్చిన నీరజ్ చోప్రా ఆ తర్వాత నుంచి నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు.

ఒలింపిక్స్, ఆసియాక్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, డైమండ్ లీగ్ టోర్నీలలో బంగారు పతకాలు సాధించిన నీరజ్ గత ప్రపంచకప్ పోటీలలో రజత పతకంతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే..ప్రస్తుత 2023 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మాత్రం బంగారు పతకంతో పాటు ప్రపంచ టైటిల్ కూ నీరజ్ గురిపెట్టాడు.

తొలి త్రో తోనే ఫైనల్స్ కు అర్హత...

ప్రస్తుత ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ జావలిన్ త్రోలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 27 మంది పోటీపడుతున్నారు. రెండుగ్రూపులుగా వీరికి అర్హత పోటీలు నిర్వహిస్తున్నారు.

క్వాలిఫైయింగ్ దశలో ఒక్కో అథ్లెట్ కు కేవలం మూడు అవకాశాలు మాత్రమే ఇస్తారు. హాట్ ఫేవరెట్ నీరజ్ చోప్రా తన ప్రయత్నంలోనే బల్ల్లాన్ని 88.77 మీటర్ల దూరం

విసిరడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టగలిగాడు. ఒలింపిక్స్ కు అర్హతగా విధించిన 85.50 మీటర్ల లక్ష్యాన్ని అలవోకగా అధిగమించగలిగాడు.

ప్రపంచ పోటీల ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించడంతో పాటు..పారిస్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ లో సైతం పాల్గొనటానికి బెర్త్ ఖాయం చేసుకోగలిగాడు.

అమెరికాలోని యూజీన్ వేదికగా జరిగిన గత ప్రపంచ మీట్ లో 83.00 మీటర్ల దూరం మాత్రమే విసరడం ద్వారా రజత పతకంతో సరిపెట్టుకొన్న 25 సంవత్సరాల నీరజ్ చోప్రా ప్రస్తుత 2023 టోర్నీలో బంగారు పతకం సాధించి తీరాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ప్రత్యర్థుల వెలవెల...

క్వాలిఫైయింగ్ రౌండ్లలో నీరజ్ ప్రధాన ప్రత్యర్థులంతా వెలవెల పోయారు. నీరజ్ గ్రూప్- ఏ టాపర్ గా ఫైనల్స్ కు అర్హత సాధిస్తే...భారత్ కే చెందిన డీపీ మను 81.31 మీటర్ల రికార్డుతో ఫైనల్స్ బెర్త్ సంపాదించాడు.

క్వాలిఫైయింగ్ రౌండ్లలో 83 మీటర్లు దూరం విసిరిన లేదా..మొదటి 12 మంది అత్యుత్తమ అథ్లెట్లకు ఫైనల్ రౌండ్ ప్రవేశం కల్పిస్తారు. నీరజ్ తరువాత జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ అత్యుత్తమంగా 82.39 మీటర్ల రికార్డు సాధించాడు.

గత ప్రపంచ మీట్ విజేత, గ్రెనాడాకు చెందిన యాండర్సన్ పీటర్స్ 78.49 మీటర్లతో 7వ స్థానంలో నిలవడం విశేషం.

2015 ప్రపంచ మీట్ విజేత, కెన్యా అథ్లెట్ జూల్యస్ యోగో 78.42 మీటర్లు లక్ష్యం మాత్రమే సాధించగలిగాడు. ఆదివారం జరిగే గోల్డ్ మెడల్ రౌండ్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడం ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News