జాతీయక్రీడల్లో ..తెలుగు రాష్ట్ర్రాలు దొందూదొందే!

36వ జాతీయ క్రీడల పతకాల పట్టికలో తెలుగురాష్ట్ర్రాలు వెలవెలబోయాయి. దారుణంగా విఫలమై దొందూదొందే అనిపించుకొన్నాయి.

Advertisement
Update:2022-10-13 13:43 IST

36వ జాతీయ క్రీడల పతకాల పట్టికలో తెలుగురాష్ట్ర్రాలు వెలవెలబోయాయి. దారుణంగా విఫలమై దొందూదొందే అనిపించుకొన్నాయి. తెలంగాణా 15వ స్థానం సాధిస్తే..గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ 21వ స్థానానికి దిగజారిపోయింది.

ఏడేళ్ల విరామం తర్వాత జరిగిన 36వ జాతీయక్రీడలు గుజరాత్ లోని సూరత్ వేదికగా గతరాత్రి అట్టహాసంగా ముగిశాయి. ఇండియన్ ఒలింపిక్స్ గా పేరుపొందిన ఈ క్రీడాసంరంభంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ వరుసగా నాలుగోసారి ఓవరాల్ విజేతగా నిలిస్తే...అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్ర్రంగా మహారాష్ట్ర్ర నిలిచింది.

గత క్రీడల వరకూ పతకాల పట్టికలో పర్వాలేదనిపించుకొన్న తెలుగు రాష్ట్ర్రాలు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత క్రీడల పతకాల పట్టికలో మరింతగా దిగజారిపోయాయి.

అత్యుత్తమ అథ్లెట్లుగా సజన్, హషికా...

మొత్తం 61 స్వర్ణాలతో సహా 128 పతకాలతో భారత రక్షణదళాల క్రీడాబృందం వరుసగా నాలుగోసారి ఓవరాల్ చాంపియన్ గా అవతరించింది.

అత్యధికంగా 140 పతకాలు సాధించడం ద్వారా మహారాష్ట్ర్ర రెండు, హర్యానా (116) మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. కర్నాటక, తమిళనాడు,కేరళ, మధ్యప్రదేశ్,

ఉత్తరప్రదేశ్, మణిపూర్, పంజాబ్ , ఢిల్లీ పతకాల పట్టిక మొదటి పదిస్థానాలలో నిలిచాయి.

పురుషుల విభాగంలో ఐదు బంగారు పతకాలతో సహా మొత్తం ఎనిమిది పతకాలు సాధించిన కర్నాటక అథ్లెట్ సజన్ ప్రకాశ్ అత్యుత్తమ అథ్లెట్ అవార్డు గెలుచుకొన్నాడు. మహిళల విభాగంలో ఆరు బంగారు, ఓ కాంస్యంతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించిన కేరళ అథ్లెట్ హషిక రామచంద్ర బెస్ట్ అథ్లెట్ అవార్డు కైవసం చేసుకొంది.

అట్టహాసంగా ముగింపు వేడుకలు...

గుజరాతీ గడ్డపై తొలిసారి జరిగిన జాతీయ క్రీడల ముగింపు ఉత్సవాలు సూరత్‌లో అట్టహాసంగా జరిగాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే లేజర్‌ లైట్ల వెలుతురులో అభిమానుల కేరింతల నడుమ సాంస్కృతిక కార్యక్రమాలు కన్నులపండుగగా జరిగాయి. ముగింపు కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్కర్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2023లో జాతీయ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న గోవాకు భారత ఒలింపిక్‌ సంఘ(ఐవోఏ) ప్రతినిధులు జెండా అందజేశారు.

టాప్-10లో చోటు లేని తెలుగు రాష్ట్ర్రాలు

పలు సరికొత్త రికార్డులతో ముగిసిన జాతీయ క్రీడల పతకాల పట్టికలో తెలుగు రాష్ట్ర్రాలు వెలవెలబోయాయి. గత క్రీడల్లో సాధించిన స్థానాలను సైతం నిలుపుకోడంలో విఫలమయ్యాయి. చివరకు పేరుగొప్ప, ఊరుదిబ్బ అన్నట్లుగా మిగిలాయి.

2002 జాతీయక్రీడలు నిర్వహించిన సమయంలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రికార్డుస్థాయిలో 94 బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్ గా నిలిచింది. అయితే..కేరళ వేదికగా ముగిసిన 2015 జాతీయ క్రీడల పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలోనూ, తెలంగాణా 33 పతకాలతో 12వ స్థానంలోనూ నిలవడం విశేషం.

15వ స్థానంలో తెలంగాణా

దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్ర్రాలలో ఒకటైన తెలంగాణా పతకాల పట్టిక 15వ స్థానంలో నిలిచింది. తెలంగాణా అథ్లెట్లు సాధించినమొత్తం 23 పతకాలలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి.

302 మంది సభ్యుల భారీబృందంతో 26 క్రీడాంశాలలో అట్టహాసంగా పోటీకి దిగిన తెలంగాణా గత క్రీడల్లో సాధించిన 12వ స్థానాన్ని కోల్పోయి..మరో మూడుస్థానాలకు పడిపోయింది.

మొత్తం 230 అథ్లెట్లలో 104 మంది పురుషులు, 126 మంది మహిళలు ఉన్నారు. 72 మంది శిక్షకులు బృందం కూడా క్రీడల్లో పాల్గొంది. తెలంగాణా అథ్లెట్ల శిక్షణ, సన్నాహాల కోసం 61 లక్షల రూపాయలు వ్యయం చేశారు. టెన్నిస్ , స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, రోయింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్, బాక్సింగ్ అంశాలలో తెలంగాణా అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించ గలిగారు.

హుసాముద్దీన్‌కు పసిడి పతకం

తెలంగాణా బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ క్రీడల ఆఖరిరోజున పసిడి పతకంతో మెరిశాడు. పురుషుల 57కిలోల ఫైనల్‌ బౌట్‌లో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు(ఎస్‌ఎస్‌సీబీ) తరఫున బరిలోకి దిగిన హుసామ్‌ 3-1 తేడాతో సచిన్‌ సివాచ్‌(హర్యానా)పై అద్భుత విజయం సాధించాడు. ఇటీవలే బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఈ 28 ఏండ్ల యువ బాక్సర్‌ మరోమారు జాతీయస్థాయిలో సత్తాచాటి ఆకట్టుకున్నాడు.

బీచ్‌ వాలీబాల్‌లో స్వర్ణం

బీచ్‌ వాలీబాల్‌ జట్టు స్వర్ణ పతకం తెలంగాణా జట్టు కైవసం చేసుకుంది. గుజరాత్‌ వేదికగా జరుగుతున్న 36వ నేషనల్‌ గేమ్స్‌ పురుషుల బీచ్‌ వాలీబాల్‌ ఫైనల్లో తెలంగాణ 2-1 (22-24, 23-21, 15-11)తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్‌ కోల్పోయిన మన జట్టు.. ఆ తర్వాత తిరిగి పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లలో సత్తాచాటింది. మరోవైపు కనోయింగ్‌లో తెలంగాణకు ఆదివారం రెండు కాంస్య పతకాలు దక్కాయి. కనోయ్‌ స్ప్రింట్‌ పురుషుల 1000 మీటర్ల విభాగంలో రాష్ర్టానికి చెందిన అమిత్‌ కుమార్‌ సింగ్‌ (4.31 సెకన్లలో) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. సునీల్‌ సింగ్‌ (సర్వీసెస్‌), నీరజ్‌ వర్మ (మధ్యప్రదేశ్‌) వరుసగా స్వర్ణ, రజతాలు చేజిక్కించుకున్నారు. కనోయింగ్‌ సీ2 1000 పురుషుల ఈవెంట్‌లో ప్రదీప్‌ కుమార్‌, అభయ్‌ కాంస్యం గెలుచుకున్నారు.

18 నుంచి 21 స్థానానికి పడిన ఆంధ్రప్రదేశ్

దేశంలోనే జనాభాపరంగా అతిపెద్ద రాష్ట్ర్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ క్రీడాపరంగా రానురాను దిగజారిపోతూ వస్తోంది. గత ( 2015 ) జాతీయక్రీడల పతాకల పట్టిక 18వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత క్రీడల్లో 21వ స్థానానికి పడిపోయింది.

మొత్తం 170 మంది అథ్లెట్లతో ఎంపిక చేసిన క్రీడాంశాలలో మాత్రమే పాల్గొన్న ఆంధ్రప్రదేశ్...36 క్రీడాంశాలలో తన అదృష్టం పరీక్షించుకుంది. అథ్లెట్ల శిక్షణ, సన్నాహాల కోసం 23 లక్షల 91 వేల రూపాయలు ఖర్చు చేసింది.. బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, ట్రాక్ అండ్ ఫీల్డ్, బీచ్ వాలీబాల్ అంశాలలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు పర్వాలేదనిపించారు.

2 స్వర్ణ, 9 రజత, 5 కాంస్య పతకాలతో సహా ఆంధ్రప్రదేశ్ మొత్తం 16 పతకాలను సాధించింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఒరిస్సా లాంటి రాష్ట్ర్రాల ముందు ఏపీ దిగదుడుపుగా మారింది.

నిధులు ఎక్కువై తెలంగాణా, నిధుల లేమితో ఆంధప్రదేశ్ జాతీయక్రీడల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి.

Tags:    
Advertisement

Similar News