మురళీ శ్రీశంకర్ సిల్వర్ జంప్.. కామన్వెల్త్ గేమ్స్ హాకీలో హోరు..బాక్సింగ్‌లో జోరు!

బ్యాడ్మింటన్ వ్యక్తిగత పోటీల పురుషుల, మహిళల సింగిల్స్ లో భారత పతకాల వేటను పీవీ సింధు, కిడాంబీ శ్రీకాంత్, లక్ష్యసేన్ మొదలుపెట్టారు. పురుషుల హాకీ ఆఖరి లీగ్ పోటీలో నెగ్గడం ద్వారా భారత్ గ్రూప్ టాపర్ గా నిలిచింది.

Advertisement
Update:2022-08-05 12:43 IST

బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్‌కు తొలి రజతం దక్కింది. బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలో ఆరుగురు భారత బాక్సర్లు సెమీస్ చేరుకోడం ద్వారా పతకాలు ఖాయం చేశారు.బ్యాడ్మింటన్ వ్యక్తిగత పోటీల పురుషుల, మహిళల సింగిల్స్ లో భారత పతకాల వేటను పీవీ సింధు, కిడాంబీ శ్రీకాంత్, లక్ష్యసేన్ మొదలుపెట్టారు. పురుషుల హాకీ ఆఖరిలీగ్ పోటీలో నెగ్గడం ద్వారా భారత్ గ్రూప్ టాపర్ గా నిలిచింది. కామన్వెల్త్ గేమ్స్ కు అనుబంధంగా నిర్వహిస్తున్న పారా (బధిరులు, దివ్యాంగులు) క్రీడల్లో సైతం భారత అథ్లెట్ల బంగారు పతకాల వేటకు తెరలేచింది. పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ బంగారు పతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచాడు.

మురళీ శ్రీశంకర్‌కు రజతం..

పురుషుల లాంగ్ జంప్ లో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ 8.08 మీటర్ల రికార్డుతో రజత పతకం సాధించాడు. శ్రీశంకర్ తన ఐదవ ప్రయత్నంలో 8.08 మీటర్ల దూరం దూకడం ద్వారా సంచలనం సృష్టించాడు. బహమాస్ కు చెందిన లాక్విన్ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా..దక్షిణాఫ్రికా అథ్లెట్ జోవాన్ వాన్ వూరేన్ కాంస్య పతకంతో సరిపెట్టుకొన్నాడు. ఇదే విభాగంలో పోటీకి దిగిన మరో భారత అథ్లెట్ మహ్మద్ అనీస్ యాహ్యా 7.97 మీటర్ల రికార్డుతో 5వ స్థానంలో నిలిచాడు.

1978 కామన్వెల్త్ గేమ్స్ పురుషుల లాంగ్ జంప్ లో సురేశ్ బాబు కాంస్య పతకం సాధించిన తరువాత మరో భారత అథ్లెట్ పతకం నెగ్గడం ఇదే కావడం విశేషం. భారత మహిళా లాంగ్ జంపర్లలో 2002 ప్రపంచ పోటీలలో అంజూబాబీ జార్జి, 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో ప్రజూష మలైక్కల్ రజత పతకాలు సాధించిన అథ్లెట్లుగా నిలిచారు.

బాక్సింగ్ సెమీస్ రోహిత్, పంగల్, సాగర్....

బాక్సింగ్ పురుషుల విభాగంలో రోహిత్ టోకాస్, సాగర్ అహ్లావత్, అమిత్ పంగల్, హుసాముద్దీన్, మహిళల విభాగంలో జాస్మిన్, నిఖత్ జరీన్‌ తమతమ విభాగాలలో మెడల్ రౌండ్ కు అర్హత సాధించారు. పురుషుల 67 కిలోల విభాగంలో రోహిత్ టోకాస్ 5-0 పాయింట్లతో జేవియర్ మటోఫా పై అలవోక విజయం సాధించాడు. 92 కిలోల విభాగంలో షెల్స్ కు చెందిన కెడ్డీ ఇవాన్స్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో సాగర్ అహ్లావత్ విజేతగా నిలిచాడు. 48 కిలోల విభాగంలో స్కాట్లాండ్ కు చెందిన లెనాన్ ములిగాన్ ను అమిత్ పంగల్ చిత్తు చేశాడు.

మహిళల 60 కిలోల విభాగంలో న్యూజిలాండ్ కు చెందిన ట్రాయ్ గార్టన్ ను 4-1తో జాస్మిన్ అధిగమించింది. 50 కిలలో విభాగంలో నిఖత్ జరీన్ సైతం అలవోకగా సెమీస్ చేరడం ద్వారా పతకం రౌండ్ చేరగలిగింది. 48 కిలోల తరగతిలో నీతూ గంగాస్ సైతం సెమీస్ కు అర్హత సంపాదించింది. బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ మొత్తం 7 పతకాలు నెగ్గే అవకాశం ఉంది.

సింధు, శ్రీకాంత్ తొలి విజయాలు..

బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ విభాగంలో రజత పతకంతో సరిపెట్టుకొన్న భారత క్రీడాకారులు...వ్యక్తిగత విభాగంలో పతకాల వేటకు తెరతీశారు. మహిళల సింగిల్స్ లో స్టార్ ప్లేయర్ పీవీ సింధు తొలివిజయంతో ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలిరౌండ్లో మాల్దీవ్స్ కు చెందిన నభా అబ్దుల్ రజాక్ ను సింధు వరుస గేమ్‌లలో చిత్తు చేసింది. కేవలం 21 నిముషాలలోనే నెగ్గిన సింధు...బంగారు పతకానికి గురిపెట్టింది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఉగాండా ఆటగాడు డేనియల్‌ను భారత స్టార్ షట్లర్ కిడాంబీ శ్రీకాంత్ కంగు తినిపించాడు. శ్రీకాంత్ 21-9, 21-9తో విజయం సాధించాడు. మరో తొలిరౌండ్ పోరులో లక్ష్యసేన్ 21-4, 21-5తో సెయింట్ హెలెనా ఆటగాడు వెర్నాన్ స్మీద్ ను చిత్తు చేయడం ద్వారా ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకొన్నాడు.

హాకీ లీగ్ టాపర్ భారత్...

పురుషుల హాకీ గ్రూప్ లీగ్‌లో భారత్ మూడో విజయంతో అజేయంగా నిలిచింది. బర్మింగ్ హామ్ యూనివర్శిటీ హాకీ గ్రౌండ్స్ వేదికగా జరిగిన గ్రూపు నాలుగో రౌండ్ పోటీలో భారత్ 4-1 గోల్స్ తేడాతో వేల్స్ పై విజేతగా నిలిచింది. గ్రూప్- బీ ప్రారంభ పోరులో ఘనాను 11-0తోనూ, ఇంగ్లండ్ తో పోటీని 4-4తో డ్రాగాను, కెనడాను 8-0 గోల్స్ తో చిత్తు చేసిన భారత్ ..మొత్తం నాలుగు రౌండ్లలో 7 పాయింట్లు సాధించడం ద్వారా గ్రూపు టాపర్ గా సెమీస్ లో అడుగుపెట్టింది.

7వ స్థానంలోనే భారత్..

కామన్వెల్త్ గేమ్స్ 7వ రోజు పోటీలు ముగిసే సమయానికి భారత్ పతకాల పట్టిక 7వ స్థానంలో నిలిచింది. 6 స్వర్ణ, 7 రజత, 7 కాంస్యాలతో సహా మొత్తం 20 పతకాలతో 7వ స్థానానికి పరిమితమైంది.

Tags:    
Advertisement

Similar News