ముంబై మారథాన్ లో విషాదం, ఇద్దరి దుర్మరణం!
ముంబై అంతర్జాతీయ మారథాన్ పరుగులో విషాదం చోటు చేసుకొంది. ఇద్దరు రన్నర్లు మృతి చెందగా 22 మంది ఆస్పత్రి పాలయ్యారు.
ముంబై అంతర్జాతీయ మారథాన్ పరుగులో విషాదం చోటు చేసుకొంది. ఇద్దరు రన్నర్లు మృతి చెందగా 22 మంది ఆస్పత్రి పాలయ్యారు....
ప్రపంచ వ్యాప్తంగా..ప్రధానంగా అంతర్జాతీయ నగరాలలో మారథాన్ రేస్ లు నిర్వహించడం సాధారణ విషయమే. లండన్ మారథాన్, టోక్యో మారథాన్, న్యూయార్క్ మారథాన్..ఇలా ప్రపంచంలో ప్రముఖ నగరాలలో ఏటా అంతర్జాతీయ మారథాన్ పోటీలు జరగడం వేలాదిమంది పాల్గొనటం సర్వసాధారణమే.
మనదేశంలో సైతం న్యూఢిల్లీ, ముంబై మహానగరాలు అంతర్జాతీయ మారథాన్ రేస్ లకు వేదికలుగా ఉంటూ వస్తున్నాయి. అయితే..గతంలో ఎన్నడూ లేని విధంగా 2024- ముంబై అంతర్జాతీయ మారథాన్ రేస్ అత్యంత విషాదంగా ముగిసింది.
74 ఏళ్ల రన్నర్ మృతి.....
మారథాన్ రేస్ అంటే 26.2 మైళ్ళు లేదా 42.195 కిలోమీటర్ల పరుగు. రన్నర్ సత్తాకు, దమ్ము పట్టే శక్తికి పరీక్షగా నిలిచే మారథాన్ రేస్ లో పురుషులు, మహిళలు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా పాల్గొంటూ వస్తున్నారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు, వైద్యనిపుణుల పర్యవేక్షణ నడుమ అంతర్జాతీయ రేస్ లను నిర్వహించడం ఓ సాంప్రదాయంగా వస్తోంది. అయితే..భారత వాణిజ్య రాజధాని ముంబై వేదికగా నిర్వహించిన 2024-అంతర్జాతీయ మారథాన్ రేస్ మాత్రం ఇటు రన్నర్లకు, అటు నిర్వాహక సంఘానికి చేదుఅనుభవంగా మిగిలిపోయింది.
వివిధ విభాగాలలో వందలాదిమంది పాల్గొన్న ఈ రేస్ లో 74 సంవత్సరాల వయోవృద్ధరన్నర్ తో పాటు..40 సంవత్సరాల వయసున్న మరో రన్నర్ సైతం తీవ్రంగా అలసిపోయి మృతి చెందారు.
గోరేగావ్ కు చెందిన 74 సంవత్సరాల రన్నర్ రాజేంద్రబోరా, కోల్ కతాకు చెందిన 40 సంవత్సరాల సువ్రవ్ దీప్ బెనర్జీ మృతి చెందినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.
సొమ్మసిల్లి పడిపోయిన బోరా..
ముంబై మెరీన్ డ్రైవ్ లో పరుగెడుతూ...సీనియర్ సిటిజన్ విభాగంలో పోటీకి దిగిన వెటరన్ రన్నర్ రాజేంద్ర బోరా , సీనియర్ సిటిజన్ విభాగంలో పరుగెత్తిన సువ్రవ్ దీప్ బెనర్జీ సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఇద్దరూ రన్నర్లు పడిపోడంతో వైద్యసిబ్బంది హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
హాజీ అలీ జంక్షన్ సమీపంలో బెనర్జీ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి వచ్చే సమయానికే ఇద్దరు రన్నర్లు చనిపోయి ఉన్నారని మధ్య ముంబైలోని నాయర్ హాస్పటల్ ప్రతినిధి ప్రకటించారు. వయోవృద్ధుడు బోరా గుండె ఆగి మరణించారని, మరో రన్నర్ బెనర్జీ పరుగెడుతూ పక్కనే ఉన్న గోడపైకి ఒరిగి పడిపోయిన సమయంలో నదుటి భాగంతో పాటు తలకు గాయమై మరణించినట్లు వివరించారు.
22 మంది ఆస్పత్రిపాలు...
పరుగెడుతూ వివిధ ఆరోగ్యసమస్యలతో ఆగిపోయిన మరో 22 మంది రన్నర్ల కు ముంబైలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స అందించారు. 22 మందిలో 19 మందిని ప్రాధమిక చికిత్స అనంతరం ఇంటికి పంపారు. మరో ముగ్గురు రన్నర్లు చికిత్సలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
వీరిలో ఇద్దరు గుండెనొప్పితోనూ, నలుగురు స్పృహ తప్పి పడిపోడంతోనూ, మరి కొందరు కాలిగాయాలతోనూ రేస్ నుంచి తప్పుకొన్నట్లు చెప్పారు.
ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ మారథాన్ రేస్ విషాదం నడుమ ముగిసింది. ఇద్దరి రన్నర్ల ప్రాణాలను బలితీసుకొంది.
మొత్తం మీద అట్టహాసంగా నిర్వహించిన ముంబై మారథాన్ కాస్త ఇద్దరు ప్రాణాలను బలితీసుకోడం..ముంబై అంతర్జాతీయ మారథాన్ చరిత్రలో విషాధఘట్టంగా మిగిలిపోతుంది.