రిషభ్ కు బహుముఖ గాయాలు, ఐపీఎల్ కు దూరం
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు బహుముఖ గాయాలైనట్లు చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రకటించారు.
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు బహుముఖ గాయాలైనట్లు చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రకటించారు. ఆస్ట్ర్రేలియాతో టెస్టు సిరీస్ తో పాటు 2023 ఐపీఎల్ కు పంత్ దూరం కాక తప్పదని అంటున్నారు....
డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తూ దారిలో జరిగిన ఘోరకారు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రిషభ్ కు పలు రకాల గాయాలైనట్లు చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రకటించారు. అయితే..రిషభ్ కు ప్రాణాపాయం తప్పిందని, గాయాల నుంచి తేరుకొని పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించడానికి నెలల తరబడి సమయం పట్టవచ్చునని తెలిపారు.
నుదుటి భాగం నుంచి కాలివేలి వరకూ గాయాలు...
ఢిల్లీ- డెహ్రాడూన్ జాతీయ రహదారిలో జరిగిన ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కారు..రోడ్డు డివైడర్ ను వేగంగా ఢీ కొనడంతో మంటలు చెలరేగి కారు నుజ్జునుజ్జయింది. కారు అద్దాలు పగులగొట్టి రిషభ్ పంత్ ను ఓ డ్రైవర్ ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు.
తీవ్రంగా గాయపడిన పంత్ ను రూర్కీలోని ఓ ఆస్పత్రికి తరలించి..ప్లాస్టిక్ సర్జరీతో సహా పలురకాలుగా చికిత్స అందిస్తున్నారు.
ఇదీ..రిషభ్ గాయాల చిట్టా...
రిషభ్ పంత్ నుదిటిభాగంలో తీవ్రస్థాయిలో గాయాలయ్యాయని, కుడికాలి మోకాలి భాగంలో నరం తెగిపోయిందని, కుడిచేతి మణికట్టు విరిగిందని, కాలికుడి భాగం తో పాటు వెన్నెముకకు గాయాలైనట్లు మాక్స్ ఆస్పత్రి వైద్యుల బృందం ప్రకటించింది. పంత్ గాయాలు నయం కావడానికి కనీసం 3 నుంచి 6 నెలల కాలం పడుతుందని...
క్రీడాకారుల గాయాలకు చికిత్సతో నిపుణుడు డాక్టర్ ఖమర్ అజామ్ తెలిపారు.
రిషభ్ పంత్ పూర్తిగా కోలుకొని ఫిట్ నెస్ సాధించాలంటే చాలాకాలం ఓపికగా వేచి చూడక తప్పదని వైద్యనివేదిక ద్వారా వెల్లడించారు. భారతటెస్టు జట్టులో కీలక ఆటగాడిగా, వికెట్ కీపర్ బ్యాటర్ గా ప్రధానపాత్ర పోషిస్తున్న రిషభ్ పంత్..ఆస్ట్ర్రేలియాతో జరుగనున్న నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ తో పాటు..2023 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కాక తప్పదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషభ్ తో పాటు అతని తల్లి అక్కడే ఉంటున్నారు. భారత యువక్రికెటర్లలో అత్యంత ప్రతిభావంతుడుగా పేరుపొందిన 25 సంవత్సరాల
రిషభ్ కు భారత్ తరపున 31 టెస్టులు, 27వన్డేలు, 66 టీ-20 మ్యాచ్ లు ఆడి 3వేలకు పైగా పరుగులు సాధించిన రికార్డు ఉంది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సైతం
నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో సీజన్ కు 16 కోట్ల రూపాయల చొప్పున వేతనం అందుకొంటున్నాడు. 25 సంవత్సరాల వయసుకే క్రికెటర్ గా 85 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించాడు.
అత్యంత ఖరీదైన కారులో ప్రయాణిస్తున్న కారణంగానే రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడినట్లుగా చెబుతున్నారు.