1427 రోజుల తర్వాత చెన్నైలో ఐపీఎల్ షో!
కరోనా పుణ్యమా అంటూ నాలుగేళ్ల తర్వాత... 1427 రోజుల విరామం తర్వాత జరిగిన 16వ సీజన్ తొలి హోం మ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం ఆతిథ్యమిచ్చింది.
భారత్ లోని అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో అత్యంత పురాతనమైన చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా 1427 రోజుల సుదీర్ఘవిరామం తర్వాత జరిగిన ఐపీఎల్ మ్యాచ్ రికార్డుల హోరుతో ముగిసింది......
ఐపీఎల్ చరిత్రలో నాలుగుసార్లు విజేత, అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది.
కరోనా పుణ్యమా అంటూ నాలుగేళ్ల తర్వాత... 1427 రోజుల విరామం తర్వాత జరిగిన 16వ సీజన్ తొలి హోం మ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం ఆతిథ్యమిచ్చింది.
లక్నో సూపర్ జెయింట్స్ తో ముగిసిన సీజన్ 6వ మ్యాచ్ కు భారీసంఖ్యలో విజిల్ పోడు టీమ్ అభిమానులు తరలి వచ్చారు.
చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్ అన్నీ పసుపురంగు చెన్నైటీమ్ జెర్సీలు ధరించి వచ్చిన వేలాదిమందితో కిటకటలాడి పోయింది.
పరుగుల హోరు...రికార్డుల హోరు...
2023 సీజన్ తొలిరౌండ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్..తన తొలి హోం గ్రౌండ్ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడింది.
పరుగుల వెల్లువలా, హైస్కోరింగ్ థ్రిల్లర్లా సాగిన ఈ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నైజట్టు 20 ఓవర్లలో 217 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.
ఓపెనర్లు రితురాజ్ గయక్వాడ్- డేవిడ్ కాన్వే మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.
రితురాజ్ 57, కాన్వే 47, వన్ డౌన్ శివం దూబే 27, మిడిలార్డర్ బ్యాటర్లు మోయిన్ అలీ 19, అంబటి రాయుడు రెండో సిక్సర్లు, రెండు బౌండ్రీలతో 27 నాటౌట్, కెప్టెన్
ధోనీ 3 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు సాధించడంతో చెన్నై 7 వికెట్లకు 217 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.
5వేల పరుగుల ఏకైక కీపర్ ధోనీ...
చెన్నై సూపర్ కింగ్స్ ఎవర్ గ్రీన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 400 స్ట్ర్రయిక్ రేట్ తో సాధించిన రెండు సిక్సర్లతో సహా 12 పరుగులు సాధించడం ద్వారా ఐపీఎల్ లో 5వేల పరుగులు సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు.
తన ఐపీఎల్ కెరియర్ లో 236వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ 208 ఇన్నింగ్స్ లో 5004 పరుగులు సాధించగలిగాడు.ధోనీ 135. 54 స్ట్ర్రయిక్ రేటుతో 24 హాఫ్ సెంచరీలతో 39.09 సగటు నమోదు చేశాడు.
7వ క్రికెటర్ మహీ....
ఐపీఎల్ లో 5వేలకు పైగా పరుగులు సాధించిన 7వ బ్యాటర్ గా, తొలి వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందే 5వేల పరుగులు మైలురాయి చేరిన మొనగాళ్లలో విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్ ల సరసన నిలిచాడు.
హోంగ్రౌండ్ చెన్నై చెపాక్ స్టేడియంలోనే ధోనీ ఈ రికార్డు సాధించడం విశేషం.
విరాట్ కొహ్లీ 224 మ్యాచ్ ల్లో 6వేల 706 పరుగులు, శిఖర్ ధావన్ 207 ఇన్నింగ్స్ లో 6వేల 284 పరుగులు, డేవిడ్ వార్నర్ 163 మ్యాచ్ ల్లోనే 5937 పరుగులు, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 228 ఇన్నింగ్స్ లో 5880 పరుగులు, సురేశ్ రైనా 205 ఇన్నింగ్స్ లో 5528 పరుగులు, ఏబీ డివిలియర్స్ 184 మ్యాచ్ ల్లో 5162 పరుగులు సాధించారు.
మోయిన్ స్పిన్ లో లక్నో గల్లంతు...
218 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.లక్నోబ్యాటర్లలో రాహుల్ 20, కీల్ మేయర్స్ 53, స్టోయినిస్ 21, నికోలస్ పూరన్ 32, ఆయుశ్ బదౌనీ 23, గౌతమ్ 17 పరుగులు సాధించినా ప్రయోజనం లేకపోయింది.
చెన్నై ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ తన కోటా 4 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకొన్నాడు. చెన్నై12 పరుగులతో విజేతగా నిలవడం ద్వారా ప్రస్తుత 16వ సీజన్లో తొలివిజయం నమోదు చేయగలిగింది.
మొదటి రెండురౌండ్లలో చెన్నై, లక్నో ఒక్కో గెలుపు, ఒక్కో ఓటమితో నిలిచాయి.