ధోనీ 200, జడేజా 200, బట్లర్ 3000..రికార్డులే రికార్డులు!
చెన్నై సూపర్ కింగ్స్ హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం రికార్డుల మోతతో దద్దరిల్లింది. కెప్టెన్ ధోనీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డులు నమోదు చేశారు
చెన్నై సూపర్ కింగ్స్ హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం రికార్డుల మోతతో దద్దరిల్లింది. కెప్టెన్ ధోనీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డులు నమోదు చేశారు....
ఐపీఎల్ లో నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం పలు అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్, ఆతిథ్య సూపర్ కింగ్స్ జట్ల నడుమ ప్రస్తుత సీజన్ 17వ మ్యాచ్ గా సాగిన ఈ పోరు ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కెప్టెన్ గా 200 వ మ్యాచ్ ఆడుతున్న ధోనీకి చెన్నై ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాసన్ ఓ జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు.
ధోనీ అరుదైన ఘనత...
2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు మరో పేరుగా నిలిచిన మహేంద్రసింగ్ ధోనీ గత 16 సంవత్సరాలుగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ను నాలుగుసార్లు విజేతగా నిలపడంతో పాటు రెండో అత్యంత విజయవంతమైనజట్టుగా తీర్చి దిద్దాడు.
ప్రస్తుత సీజన్ మూడోరౌండ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడడం ద్వారా 40 సంవత్సరాల ధోనీ కెప్టెన్ గా 200 మ్యాచ్ ల రికార్డును పూర్తి చేయగలిగాడు.
అధికారుల నిర్వాకంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని రెండు సీజన్లపాటు సస్పెన్ష్ కు గురైన చెన్నై ఫ్రాంచైజీకి కెప్టెన్ గా ధోనీ నాలుగు టైటిల్స్ అందించాడు.
2010, 2011, 2018, 2021 సీజన్లలో సూపర్ కింగ్స్ ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ తో ముగిసిన ప్రస్తుత పోటీ వరకూ చెన్నై సూపర్ కింగ్స్ కు ధోనీ 200 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించాడు. 120 విజయాలు, 80 పరాజయాల రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ధోనీ కెప్టెన్ గా, మిడిలార్డర్ బ్యాటర్ గా, అత్యుత్తమ ఫినిషర్ గా 5వేలకు పైగా పరుగులు సాధించాడు. ధోనీ బ్యాటింగ్ సగటు 39.09గా ఉంది. స్ట్రయిక్ రేటు 135. ఐపీఎల్‌లో ధోనీ మొత్తం 24 అర్థశతకాలు బాదాడు.
ధోనీ 2008 తొలి సీజన్ నుంచి ప్రస్తుత 16వ సీజన్ వరకు ఐపీఎల్‌లో 214 మ్యాచ్‌ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. దాంట్లో 125 మ్యాచుల్లో విజయాలు, 88 మ్యాచుల్లో పరాజయాలు చవిచూశాడు. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు. కెప్టెన్ గా ధోనీ విజయశాతం 58.96గా ఉంది. రైజింగ్ పూణె సూపర్‌గెయింట్ జట్టుకు కూడా ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. రెండుసీజన్లపాటు ఆ జట్టు ధోనీ నాయకత్వంలో 14 మ్యాచ్‌లు ఆడింది.
200 టీ-20 వికెట్ల జడేజా...
భారత్ కమ్ చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఆల్ రౌండర్, లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా..ప్రస్తుత ఈ మ్యాచ్ ద్వారా 200 టీ-20 వికెట్ల మైలురాయిని చేరాడు.
చెపాక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ టాపార్డర్ ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ వికెట్లు తీయడం ద్వారా 200 వికెట్ల రికార్డును అందుకొన్నాడు.
తన కెరియర్ లో ఇప్పటి వరకూ 296 టీ-20 మ్యాచ్ లు ఆడిన జడేజా 30.25 సగటు, 7.54 ఎకానమీ రేటుతో 200 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 16 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు.
భారత్ తరపున 64 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడిన జడేజా 51 వికెట్లు పడగొట్టాడు. 28.49 సగటు, 7.04 ఎకానమీతో అత్యుత్తమంగా 15 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, కొచ్చీ టస్కర్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న జడేజా మొత్తం 214 మ్యాచ్ ల్లో 138 వికెట్లు సాధించాడు. 30.05 సగటు, 7.57 ఎకానమీతో అత్యుత్తమంగా 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల వరుసలో 11వ స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ ప్రస్తుత బౌలర్లలో బంగ్లా స్పిన్నర్ షకీబుల్ హసన్ ( 136 వికెట్లు), న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ ( 134 వికెట్లు ), అఫ్గన్ జాదూ స్పిన్నర్ రషీద్ ఖాన్ ( 129 వికెట్లు ), కివీ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ ( 115 వికెట్లు ), శ్రీలంక యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ ( 107 వికెట్లు ), భారత స్పిన్ జాదూ యజువేంద్ర చహాల్ (91 వికెట్లు ) మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.
అగ్రస్థానంలో డ్వయన్ బ్రావో...
ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్లలో చెన్నై మాజీ పేసర్ డ్వయన్ బ్రావో ( 183 వికెట్లు ), యజువేంద్ర చాహల్ ( 176 వికెట్లు ), లాసిత్ మలింగ ( 170 వికెట్లు ), అమిత్ మిశ్రా ( 169 వికెట్లు ), రవిచంద్రన్ అశ్విన్ ( 160 వికెట్లు) ఉన్నారు.
టీ-20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మొనగాళ్లలో డ్వయన్ బ్రావో ( 615 వికెట్లు ), రషీద్ ఖాన్ ( 536 వికెట్లు ), సునీల్ నరైన్ ( 484 వికెట్లు ), ఇమ్రాన్ తాహీర్ ( 469 వికెట్లు ), షకీబుల్ హసన్ ( 451 వికెట్లు ) ఉన్నారు.
3వేల పరుగుల జోస్ బట్లర్...
చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో ముగిసిన నాలుగోరౌండ్ పోరులో స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్..3వేల పరుగులు క్లబ్ లో చోటు సంపాదించాడు.
అతితక్కువ ఇన్నింగ్స్ లో 3వేల పరుగుల మైలురాయిని చేరిన మూడో బ్యాటర్ గా బట్లర్ రికార్డుల్లో చేరాడు. కరీబియన్ థండర్ ఓపెనర్ క్రిస్ గేల్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మొదటి రెండు స్థానాలలో కొనసాగుతున్నారు.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ కేవలం 75 ఇన్నింగ్స్ లోనే 3వేల పరుగులు సాధించాడు. కెఎల్ రాహుల్ 80 ఇన్నింగ్స్ లోనూ, జోస్ బట్లర్ 85 ఇన్నింగ్స్ లోనూ 3వేల పరుగుల రికార్డును అందుకోగలిగారు.
డేవిడ్ వార్నర్ 94 ఇన్నింగ్స్ లోనూ, ఫాఫ్ డూప్లెసీ 94 ఇన్నింగ్స్ లోనూ 3వేల పరుగులు సాధించిన ఐపీఎల్ బ్యాటర్లలో ఉన్నారు.
బట్లర్ తన 3వేల పరుగుల రికార్డును 40 సగటు, 150 స్ట్ర్రయిక్ రేట్ తో నమోదు చేశాడు. ప్రస్తుత సీజన్ మొదటి నాలుగుమ్యాచ్ ల్లోనే బట్లర్ 205 పరుగులు సాధించాడు.
మొత్తం మీద..చెపాక్ స్టేడియం మూడు అరుదైన రికార్డులకు వేదికగా నిలిచినట్లయ్యింది.