ఇటు మను, అటు లక్ష్య...భారత్ ను ఊరిస్తున్న పతకాలు!

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ను మరో రెండు పతకాలు ఊరిస్తున్నాయి.షూటింగ్ , బ్యాడ్మింటన్, హాకీ అంశాలలో భారత్ అనూహ్య ఫలితాలు సాధించింది.

Advertisement
Update: 2024-08-03 10:16 GMT

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ను మరో రెండు పతకాలు ఊరిస్తున్నాయి.షూటింగ్ , బ్యాడ్మింటన్, హాకీ అంశాలలో భారత్ అనూహ్య ఫలితాలు సాధించింది.

2024 ఒలింపిక్స్ 8వ రోజు పోటీలు భారత్ కు అనుకోని ఫలితాలను ఇచ్చాయి. మహిళల పిస్టల్ షూటింగ్ 25మీటర్ల ఫైనల్స్ కు ' బ్రాంజ్ క్వీన్' మను బాకర్ చేరుకోగా...

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీస్ చేరిన భారత తొలి ఆటగాడిగా లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. ఇక..పురుషుల హాకీలో పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాపై గత 52 సంవత్సరాలలో భారత్ తొలిసారిగా విజయం సాధించడం ద్వారా గ్రూపులీగ్ పోటీలను ముగిచింది.

విలువిద్య మిక్సిడ్ టీమ్ కాంస్య పతకం పోరులో భారతజోడీ ధీరజ్ బొమ్మదేవర- అంకిత భక్త్ జోడీ విఫలమై 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

లక్ష్యసేన్ సరికొత్త చరిత్ర....

ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ చేరిన భారత తొలి ఆటగాడిగా 22 సంవత్సరాల లక్ష్యసేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీ ఆటగాడు చో టిన్ చెన్ ను లక్ష్య మూడుగేమ్ ల పోరులో అధిగమించాడు.

నువ్వానేనా అన్నట్లుగాసాగిన పోరులో లక్ష్య 19-21, 21-15, 21-12తో విజేతగా నిలిచాడు. గతంలో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ వరకూ..

పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ మాత్రమే రాగలిగారు. అయితే ..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో లక్ష్యసేన్ మరో అడుగు ముందుకు వేసి సెమీస్ వరకూ రాగలిగాడు.

రెండు రకాల పతకాల అవకాశం...

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీఫైనల్లో డెన్మార్క్ కు చెందిన దిగ్గజ ఆటగాడు విక్టర్ యాక్సెల్ సన్ తో లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఒకవేళ లక్ష్య సెమీస్ లో నెగ్గితే రజత పతకం ఖాయం చేసుకోడం ద్వారా బంగారు పతకం సాధించే అవకాశం దక్కించుకోగలుగుతాడు. అదే..సెమీస్ లో ఓడితే కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం ఉంటుంది.

అపారఅనుభవం కలిగిన 30 ఏళ్ల యాక్సెల్ సన్ తో 22 సంవత్సరాల లక్ష్యసేన్ తలపడటం అంటే..బ్యాడ్మింటన్ శిఖరాన్ని ఓ పసికూన ఢీ కొనడం లాంటిదే.

టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన యాక్సెల్ సన్..రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించాడు. 2017, 2022 సీజన్లలో ప్రపంచ టైటిల్స్ సాధించడంతో పాటు..డెన్మార్క్ కు థామస్ కప్ ను సైతం అందించగలిగాడు. 2021 డిసెంబర్ నుంచి 2024 జూన్ వరకూ ప్రపంచ బ్యాడ్మింటన్ టాప్ ర్యాంకర్ గా కూడా ఉన్నాడు.

మరోవైపు లక్ష్యసేన్ కు 2021 సీజన్లో ప్రపంచ బ్యాడ్మింటన్ కాంస్య పతకం సాధించడంతో పాటు..థామస్ కప్ నెగ్గిన అనుభవం ఉంది.

ఇప్పటి వరకూ యాక్సెల్ సన్ తో తలపడిన ఏడుకు ఏడుసార్లు పరాజయం పొందిన లక్ష్యసేన్ కు ఒక్కసారి మాత్రమే నెగ్గిన రికార్డు ఉంది.

హాకీ క్వార్టర్స్ లో ఇంగ్లండ్ తో భారత్ ఢీ..

పురుషుల హాకీలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత భారత్ క్వార్టర్ ఫైనల్స్ లో గ్రేట్ బ్రిటన్ తో తలపడనుంది. పూల్ -బీ ఆఖరి రౌండ్ పోటీలో భారత్ 3-2 గోల్స్ తేడాతో గత క్రీడల రజత విజేత ఆస్ట్ర్రేలియాపై సంచలన విజయం సాధించింది. ఆట 13, 33 నిముషాలలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ సాధించిన గోల్స్ తో భారత్ గత 52 సంవత్సరాలలో ఆస్ట్ర్రేలియాపై తొలివిజయం సాధించగలిగింది.

గ్రూప్ -బీ లీగ్ లో భారత్ ఐదుమ్యాచ్ లు ఆడి మూడు విజయాలు, ఓ డ్రా, ఓ పరాజయంతో బెల్జియం తరువాతిస్థానంలో నిలవడం ద్వారా నాకౌట్ క్వార్టర్ ఫైనల్స్ రౌండ్లో అడుగుపెట్టింది.

పూల్ -ఏలో మూడోస్థానంలో నిలిచిన గ్రేట్ బ్రిటన్ తో భారత్ క్వార్టర్ ఫైనల్లో తలపడుతుంది.

మూడో పతకానికి మను బాకర్ గురి...

మహిళల పిస్టల్ షూటింగ్ టీమ్, వ్యక్తిగత విభాగాలలో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన 22 సంవత్సరాల మను బాకర్ తన ఫేవరెట్ 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ ఫైనల్స్ కు సైతం చేరుకోగలిగింది.

క్వాలిఫైయింగ్ రౌండ్లలో రెండో అత్యుత్తమ షూటర్ రికార్డుతో మెడల్ రౌండ్ చేరింది. క్వాలిఫైయింగ్ రౌండ్ ప్రిసిషన్ విభాగంలో మను 100కి 100 పాయింట్లు సాధించడం విశేషం.

ఇక..8వ రోజుల పోటీల తరువాత పతకాల పట్టిక అగ్రస్థానంలో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతోంది.

13 స్వర్ణాలతో సహా చైనా మొత్తం 31 పతకాలతో అగ్రభాగాన నిలిచింది. ఆతిథ్య ఫ్రాన్స్, ఆస్ట్ర్రేలియా, గ్రేట్ బ్రిటన్, అమెరికా మొదటి ఐదుస్థానాలలో ఉన్నాయి.

భారత్ మొత్తం 3 కాంస్యపతకాలతో పట్టిక 47వ స్థానానికి పడిపోయింది.

Tags:    
Advertisement

Similar News