వెయ్యిమ్యాచ్ ల్లో 789 గోల్స్ మొనగాడు మెస్సీ!

ప్రపంచ ఫుట్ బాల్ అత్య్తుత్తమ ఆటగాళ్లలో ఒకడైన అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 2022 ఫిఫా ప్రపంచకప్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. 35 సంవత్సరాల వయసులో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

Advertisement
Update:2022-12-05 09:40 IST

వెయ్యిమ్యాచ్ ల్లో 789 గోల్స్ మొనగాడు మెస్సీ!

అర్జెంటీనా సాకర్ మాంత్రికుడు లయనల్ మెస్సీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా ఈ ఘనత సంపాదించాడు.

ప్రపంచ ఫుట్ బాల్ అత్య్తుత్తమ ఆటగాళ్లలో ఒకడైన అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 2022 ఫిఫా ప్రపంచకప్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. 35 సంవత్సరాల వయసులో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

దోహా వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫుట్ బాల్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియాతో జరిగిన పోటీ ద్వారా బరిలోకి దిగిన మెస్సీ తన కెరియర్ లో 1000వ మ్యాచ్ ఆడటం ద్వారా అరుదన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

అర్జెంటీనా జట్టులో సభ్యుడిగా మాత్రమే కాదు..లీగ్ ఫుట్ బాల్ లో వివిధ క్లబ్ లకు ప్రాతినిథ్యం వహించడం ద్వారా మెస్సీ వెయ్యిమ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలిగాడు.

1000 మ్యాచ్ లు- 789 గోల్స్...

అంతర్జాతీయ ఫుట్ బాల్ లో గత పుష్కరకాలంగా అత్యుత్తమంగా రాణిస్తూ వస్తున్న లయనల్ మెస్సీ ప్రస్తుత ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ వరకూ ఆడిన మొత్తం 1000 మ్యాచ్ ల్లో 789 గోల్స్ సాధించాడు. ఆస్ట్ర్రేలియా తో పోరులో తనజట్టు తొలిగోల్ ను మెస్సీనే సాధించడం ద్వారా ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లో గోల్స్ లేమిని పూరించుకోగలిగాడు.

తన కెరియర్ లో నాలుగో ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న మెస్సీ..మొదటి మూడు ప్రపంచకప్ టోర్నీల గ్రూపులీగ్ దశలోనే గోల్స్ నమోదు చేశాడు.

అయితే..35 సంవత్సరాల వయసులో నాకౌట్ రౌండ్లో గోల్ సాధించగలిగాడు.

నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్...

అర్జెంటీనా తరపున నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన తొలి అర్జెంటీనా ప్లేయర్ గా లయనల్ మెస్సీ ప్రస్తుత ప్రపంచకప్ ద్వారా మరో రికార్డు నెలకొల్పాడు. గ్రూపు- సీ లీగ్ లో భాగంగా..దోహాలోని లూసెల్ ఐకానిక్ స్టేడియం వేదికగా సౌదీ అరేబియాతో జరిగిన తమ ప్రారంభమ్యాచ్ లోనే గోల్ సాధించాడు.

ఆట మొదటి భాగం 10వ నిముషంలో లభించిన పెనాల్టీని మెస్సీ గోలుగా మలచడం ద్వారా..నాలుగు ( 2006, 2014, 2018, 2022 ) ప్రపంచకప్ టోర్నీలలో తన దేశం తరపున గోల్స్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్ గా అవతరించాడు.

ఇప్పటి వరకూ..మూడు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన రికార్డు మారడోనా పేరుతో ఉంది. మారడోనా 1994, 1998, 2002 టోర్నీలలో తన దేశం తరపున గోల్స్ సాధించాడు.

గాబ్రిల్ బాటిస్టుటా సైతం 1994, 1998, 2002 ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ నమోదు చేశాడు.

ఐదో ఆటగాడు లయనల్ మెస్సీ..

ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలోనే నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన ఐదవ ప్లేయర్ గా మెస్సీ రికార్డుల్లో చేరాడు. ఇంతకు ముందే ఈ ఘనత సాధించిన దిగ్గజాలలో కింగ్ పీలే, సీలెర్, మిరోస్లావ్ క్లోజ్, క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. అయితే..ఐదు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన ఏకైక, ఒకే ఒక్క ఆటగాడి రికార్డు మాత్రం పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో పేరుతో ఉంది.

2006 టోర్నీ ద్వారా ప్రపంచకప్ అరంగేట్రం చేసిన మెస్సీ, రొనాల్డో ఇద్దరూ ,,నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో ఏడు గోల్స్ చొప్పున సాధించి సమఉజ్జీలుగా నిలిచారు.

ప్రస్తుత ప్రపంచకప్ లో రొనాల్డో గోల్ చేయడంతో ఐదు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా అవతరించాడు.

Tags:    
Advertisement

Similar News