అర్జెంటీనా.. విశ్వవిజేత.. వరల్డ్ కప్ కోరిక తీర్చుకున్న మెస్సీ
సుదీర్ఘ ఫుట్‌బాల్ కెరీర్ సాగించిన మెస్సీ.. తన చివరి వరల్డ్ కప్ మ్యాచ్‌లో వరల్డ్ కప్ అందుకోవడం అర్జెంటీనా ఫ్యాన్స్‌కే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
- 1986 తర్వాత వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా
- భయపెట్టిన ఎంబాపే
- 97 సెకెన్ల్ వ్యవధిలో ఫ్రాన్స్ రెండు గోల్స్
- షూటౌట్‌లో చతికిల పడిన ఫ్రాన్స్
- షూటౌట్‌లో అర్జెంటీనా గోల్‌కీపర్ మార్టినెజ్ అద్భుత ప్రదర్శన
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఉండే అసలు మజా ఏమిటో ఇవ్వాళ మరోసారి రుజువైంది. ఎంత ఆధిక్యంలో ఉన్నా.. సెకెన్ల వ్యవధిలో తలరాతలు మారిపోతాయని ఫుట్‌బాల్ మరోసారి నిరూపించింది. వరల్డ్ కప్ కోరిక తీర్చుకోవడానికి ఆఖరి మ్యాచ్ ఆడుతున్న మెస్సీ ఓ వైపు.. ఫ్రాన్స్ తరపున వన్ మ్యాన్ షో చేసిన ఎంబాపే మరోవైపు. తొలి అర్థ భాగంలో అర్జెంటీనానే ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక వార్ వన్‌సైడ్ అనుకుంటున్న సమయంలో ఎంబాపే రెచ్చిపోయాడు. ఇరు జట్లు పుట్‌బాల్ అభిమానులకు అత్యంత ఉత్కంఠ రేపే మ్యాచ్‌ను చూపెట్టాడు. పెనాల్టీ షూటవుట్‌లో అర్జెంటీనా రాణించి.. విశ్వవిజేతగా నిలిచింది. 2006 తర్వాత షూటౌట్ ద్వారా ఛాంపియన్‌ను నిర్ధారించగా 1986 తర్వాత అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా రెండో సారి విశ్వవిజేతగా నిలవాలన్న ఫ్రాన్స్ కోరిక తీరలేదు.
ఫస్ట్ హాఫ్‌లో అర్జెంటీనాదే ఆధిపత్యం..
తొలి అర్థ భాగంలో అర్జెంటీనా జట్టు దూకుడుగా ఆడింది. బలమైన డిఫెన్స్ ఉన్న ఫ్రాన్స్‌పై పూర్తి ఆధిప్యం చెలాయించారు. బంతిని దాదాపు తమ నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా పలు మార్లు గోల్ పోస్టుపై దాడి చేశారు. మ్యాచ్ 21వ నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ లభించగా.. మెస్సీ దాన్ని గోల్‌గా మలిచాడు. దీంతో స్టేడియంలో అర్జెంటీనా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ తర్వాత 36వ నిమిషంలో డి మారియా అద్భుతమైన గోల్ సాధించాడు. దీంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలోకి దూసుకొని పోయింది. ఫస్ట్ హాఫ్‌లో అర్జెంటీనా పూర్తి ఆధిక్యత కనపరిచింది.
97 సెకెన్ల వ్యవధిలో ఎంబాపే రెండు గోల్స్..
రెండో అర్ధ భాగంలో ఫ్రాన్స్ ఆటగాళ్లు బద్దకాన్ని వీడారు. తమ సహజశైలిలో ఎటాకింగ్ ప్రారంభించారు. అయినా సరే ఫ్రాన్స్‌కు గోల్స్ రావడం గగనమైంది. ఆట తీరు చూస్తే ఇక అర్జెంటీనా విజేతగా నిలవడం ఖాయం అనిపించింది. అయితే 80వ నిమిషంలో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించగా.. ఎంబాపే దాన్ని గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 97 సెకన్లకు ఎంబాపే అద్భుత రీతిలో డ్రిబ్లింగ్ చేసుకుంటూ వెళ్లి గోల్ సాధించాడు. దీంతో 2-2తో స్కోర్లు సమం అయ్యాయి. అప్పటి వరకు గెలుస్తామన్న ధీమాతో ఉన్న అర్జెంటీనా ఫ్యాన్స్ ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు. నిర్ణీత 90 నిమిషాలు ముగిసే సరికి ఇరు జట్లు 2-2తో సమానంగా ఉన్నాయి.
ఎక్స్‌ట్రా టైంలోనూ అదే పోటీ..
90 నిమిషాల్లో ఫలితం తేలక పోవడంతో 30 నిమిషాల అదనపు సమయం లభించింది. ఆ సమయంలో కూడా ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 15 నిమిషాల తొలి అర్థ భాగంలో ఎవరికీ గోల్స్ రాలేదు. అయితే ఎక్స్‌ట్రా టైం సెకెండ్ హాఫ్ 108వ నిమిషంలో లియోనల్ మెస్సీ అద్బుతమైన గోల్ సాధించి అర్జెంటీనాకు 3-2 ఆధిక్యాన్ని అందించాడు. ఇక మ్యాచ్‌ను ముగించేద్దామని అనుకుంటున్న సమయంలో 118వ నిమిషంలో ఎంబాబే మరోసారి గోల్ కొట్టాడు. పెనాల్టీని గోల్ చేయడంలో సఫలం కావడంతో ఇరు జట్లు స్కోర్ 3-3తో సమం అయ్యాయి. ఎక్స్‌ట్రా టైం కూడా ముగిసిన తర్వాత ఇరు జట్లు సమానమైన స్కోర్ సాధించడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించారు.
పెనాల్టీ షూటౌట్ సాగింది ఇలా..
- ఎంబాపే తొలి పెనాల్టీ షాట్‌ను గోల్‌గా మలిచాడు. (0-1)
- అర్జెంటీనా తరపున తొలి పెనాల్టీని మెస్సీ సాధించడు. (1-1)
- ఫ్రాన్స్ ఆటగాడు కొట్టిన బంతిని అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ సేవ్ చేశాడు.(1-1)
- అర్జెంటీనా ఆటగాడు దైబల్లా పెనాల్టీ గోల్ సాధించాడు. (2-1)
- ఫ్రాన్స్ ఆటగాడు చౌమేనీ పెనాల్టీని మిస్ చేశాడు. (2-1)
- పరడేజ్ ఎలాంటి తప్పు చేయకుండా గోల్ కొట్టాడు. (3-1)
- ఫ్రాన్స్ ఆటగాడు కోలు మౌనీ గోల్ చేశాడు. (3-2)
- అర్జెంటీనా ఆటగాడు మాంటియెల్ గోల్ చేయడంతో పెనాల్టీని 4-2 తేడాతో గెలిచి.. అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది.
2006 తర్వాత పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించిన వరల్డ్ కప్ ఫైనల్ ఇదే.
అవార్డులు :
- యంగ్ ప్లేయర్ అవార్డు అర్జెంటీనాకు చెందిన ఎన్జో ఫెర్నాండెజ్‌కు లభించింది.
- గోల్డెన్ గ్లవ్ అవార్డు అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్‌కు దక్కింది.
- అత్యధిక గోల్స్ చేసిన ఎంబాపే (ఫ్రాన్స్) గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు.
- గోల్డెన్ బాల్ అవార్డు లియోనల్ మెస్సీకి దక్కింది. ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు గోల్డెన్ బాల్ గెలుచుకున్న ఏకైక ఆటగాడు లియోనల్ మెస్సీనే.
సుదీర్ఘ ఫుట్‌బాల్ కెరీర్ సాగించిన మెస్సీ.. తన చివరి వరల్డ్ కప్ మ్యాచ్‌లో వరల్డ్ కప్ అందుకోవడం అర్జెంటీనా ఫ్యాన్స్‌కే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మెస్సీ తన కెరీర్ చివరిలో కోపా అమెరికా కప్‌తో పాటు వరల్డ్ కప్ అందుకోవడం అతని కెరీర్‌కు ఘనమైన వీడ్కోలుగా భావించవచ్చు.