ఐపీఎల్ -16 లో పాలపొంగులా..రాజస్థాన్ రాయల్స్!
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ దశ నుంచే మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ నిష్క్ర్రమణ ఖాయమని తేలిపోయింది.
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ దశ నుంచే మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ నిష్క్ర్రమణ ఖాయమని తేలిపోయింది....
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ నుంచి గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ నిష్క్ర్రమణ ఖాయమైపోయింది. ఒక్క ఓటమితో రాయల్స్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది.
రాజస్థాన్ రాయల్స్ టైటిల్ వేట పాలపొంగులా ముగిసిపోయింది.
హోంగ్రౌండ్లో రాయల్స్ వెలవెల...
ఐపీఎల్ లో తలపడుతున్న జట్లకు హోంగ్రౌండ్లు పెట్టని కోట లాంటివి స్ధానబలంతో చెలరేగిపోయే అవకాశం ఉంటుంది. అయితే..2022 సీజన్ ఫైనలిస్ట్ రాజస్థాన్ రాయల్స్ విషయంలో అదిమాత్రం జరగడం లేదు.
ప్రస్తు సీజన్లో హోంగ్రౌండ్ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఆడిన ఎక్కువ మ్యాచ్ ల్లో రాజస్థాన్ రాయల్స్ పరాజయాలు మాత్రమే కాదు..ఘోరపరాజయాలను మూటగట్టుకొంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో అంచెపోరులో నెగ్గితీరాల్సిన రాజస్థాన్ రాయల్స్ 59 పరుగులకే కుప్పకూలి..112 పరుగుల ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది.
డూప్లెసీ- మాక్స్ వెల్ జోరు..
ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే విజయం మినహా వేరే దారిలేని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సత్తాచాటింది.రాజస్థాన్ రాయల్స్ పై అతిపెద్ద విజయంతో పుంజుకొంది.
సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు టాపార్డర్లో కెప్టెన్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ అర్ధశతకాలకు తోడు.. అనూజ్ రావత్ మెరుపు ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ఫాఫ్ డుప్లెసిస్ (44 బంతుల్లో 55; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (33 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేసుకోగా.. ఆఖర్లో అనూజ్ రావత్ (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆడం జంపా, అసిఫ్ చెరో రెండు వికెట్లు, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
పేకమేడలా కూలిన రాజస్థాన్..
మ్యాచ్ నెగ్గాలంటే 172 పరుగులు సాధించాల్సిన రాజస్థాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ టాపార్డర్ సైకిల్ స్టాండ్ లా కూలితే ..మిడిలార్డర్లో హెట్ మయర్ ఒక్కడే 35 పరుగుల స్కోరు సాధించడంతో 59 పరుగుల స్కోరైనా సాధించగలిగింది.హెట్‌మైర్ (19 బంతుల్లో 35; ఒక ఫోర్, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. యశస్వి జైస్వాల్ (0), జోస్ బట్లర్ (0), కెప్టెన్ సంజూ శాంసన్ (4), జో రూట్ (10), దేవదత్ పడిక్కల్ (4), ధ్రువ్ జురెల్ (1), అశ్విన్ (0) విఫలమయ్యారు.
బెంగళూరు బౌలర్ల లో పార్నెల్ మూడు, స్పిన్నర్ బ్రేస్ వెల్ రెండు, కర్ణ్ శర్మ రెండు, సిరాజ్, మ్యాక్స్ వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.పార్నెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది
రెండో అత్యల్పస్కోరు...
ఐపీఎల్ లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం విశేషం. ప్రస్తుత సీజన్ లీగ్ ను జోరుగా ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ టైటిల్ వేట పాలపొంగును తలపించేలా సాగింది.
ప్రస్తుత సీజన్ మొదటి 5 రౌండ్లలో 4 విజయాలతో దూసుకెళ్లిన రాజస్థాన్..ఆ తర్వాతి 8 మ్యాచ్ ల్లో 2 విజయాలు మాత్రమే సాధించగలిగింది. ధర్మశాల వేదికగా జరిగే తన ఆఖరిరౌండ్ పోరులో పంజాబ్ కింగ్స్ పై భారీవిజయం సాధించినా..ప్లే -ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించడం అసాధ్యంగా కనిపిస్తోంది.
లీగ్‌లో భాగంగా ఈ రోజు రాత్రి 7-30 గంటలకు జరిగే పోరులో గుజరాత్ టైటాన్స్‌తో హైదరాబాద్ సన్‌రైజర్స్ తలపడనుంది.
ప్రస్తుత ఐపీఎల్ లోని మొత్తం 10 జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల నిష్క్ర్రమణ పూర్తికాగా..ప్లే-ఆఫ్ రౌండ్లోని నాలుగు బెర్త్ ల కోసం మిగిలిన 8 జట్లు తలపడనున్నాయి.