అయ్యారే!...ఐపీఎల్ ఫైనల్స్ లో కోల్ కతా !
రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-17వ సీజన్ ఫైనల్స్ కు అలవోకగా చేరుకొంది. క్వాలిఫైయర్ -1 పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్లతో చిత్తు చేసింది.
రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-17వ సీజన్ ఫైనల్స్ కు అలవోకగా చేరుకొంది. క్వాలిఫైయర్ -1 పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్లతో చిత్తు చేసింది.
ఐపీఎల్ -2024 సీజన్లో మాజీ చాంపియన్, రెండుసార్లు విన్నర్ కోల్ కతా నైట్ రైడర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 14 మ్యాచ్ ల లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన కోల్ కతా..
తొలి క్వాలిఫైయర్ పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ ను చిత్తు చేయడం ద్వారా నాలుగోసారి టైటిల్ రౌండ్లో అడుగుపెట్టింది.
హైదరాబాద్ కు స్టార్క్ తీన్మార్ దెబ్బ....
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా..ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సన్ రైజర్స్ కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ద్వారా పెద్దపొరపాటే చేసింది.
ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ,నితీష్ రెడ్డి పవర్ ప్లే ఓవర్లు ముగియకముందే అవుట్ కావడంతో హైదరాబాద్ మరి కోలుకోలేకపోయింది. కోల్ కతా స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ స్థాయికి తగ్గట్టుగా బౌల్ చేసి మూడు కీలక వికెట్లతో తనజట్టుకు అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.
ఒకదశలో 126 పరుగులకే 9 వికెట్లు నష్టపోయిన సన్ రైజర్స్ ను రాహుల్ త్రిపాఠీ, కెప్టెన్ కమిన్స్ 30 పరుగులు సాధించడం ద్వారా ఆదుకోడమే కాదు..పరువు దక్కించారు. రాహుల్ 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ 32, సమద్ 16, కమిన్స్ 30 పరుగులు చేయటంతో 159 పరుగుల స్కోరు నమోదు చేయగలిగింది.
కోల్ కతా బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్, హర్షిత్, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.
అయ్యర్ల జోరుకు రైజర్స్ బేజారు....
మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 160 పరుగుల స్కోరు మాత్రమే చేయాల్సిన కోల్ కతాకు...ఓపెనింగ్ జోడీ సునీల్ నరైన్- రహ్మానుల్లా 44 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.
సునీల్ 21, రహ్మానుల్లా 23 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతో వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చారు. మూడో వికెట్ కు 97 పరుగుల అజేయ భాగస్వామ్యంతో తమ జట్టుకు 8 వికెట్ల విజయం ఖాయం చేశారు.
వెంకేటేశ్ అయ్యర్ 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 58 పరుగులతో అజేయంగా నిలిచారు.
దీంతో కోల్ కతా కేవలం 13.4 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని పూర్తి చేయగలిగింది.మరో 38 బంతులు మిగిలిఉండగానే కోల్ కతా విజయాన్ని సొంతం చేసుకొంది.
సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్, నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు. 8 వికెట్ల ఈ విజయంతో కోల్ కతా గత 17 సీజన్లలో నాలుగోసారి ఫైనల్ బెర్త్ సాధించగలిగింది. కోల్ కతా విజయంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈనెల 24న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్స్ లో క్వాలిఫైయర్ -2లో విజేతగా నిలిచిన జట్టుతో కోల్ కతా తలపడనుంది.
శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు...
ఐపీఎల్ లో రెండు వేర్వేరు జట్లను ఫైనల్స్ చేర్చిన కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2020 సీజన్ ఫైనల్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కెప్టెన్ గా ఫైనల్స్ చేర్చిన శ్రేయస్...కేవలం 4 సంవత్సరాల విరామంలోనే కోల్ కతా జట్టును సైతం టైటిల్ రౌండ్ కు చేర్చగలిగాడు.
ఐపీఎల్ చరిత్రలో తన జట్టును రెండుసార్లు ఫైనల్స్ చేర్చిన నాలుగో కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ధోనీ, రోహిత్ శర్మ, గౌతం గంభీర్ లకు సైతం తమ జట్లను రెండుసార్లు ఫైనల్స్ చేరిన నాయకులుగా రికార్డు ఉంది.
రోహిత్, గంభీర్ ఒకే ఫ్రాంచైజీ జట్టును రెండుసార్లు ఫైనల్స్ చేర్చితే..ధోనీ, శ్రేయస్ రెండు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్స్ చేర్చడం విశేషం.
అంతేకాదు..క్వాలిఫైయర్ రౌండ్లో హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో కెప్టెన్ గా కూడా నిలిచాడు. ఇంతకుముందే రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, డేవిడ్ వార్నర్ ఇదే రికార్డును సాధించగా..వారిసరసన శ్రేయస్ వచ్చి నిలిచాడు.
మూడోస్థానంలో కోల్ కతా...
ఐపీఎల్ ఫైనల్స్ అత్యధికసార్లు చేరినజట్టు రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరుతో ఉంది. ఐదుసార్లు విజేత చెన్నైకి 10సార్లు ఐపీఎల్ టైటిల్ రౌండ్ చేరిన తిరుగులేని రికార్డు ఉంది. అ తరువాత ముంబై ఇండియన్స్ జట్టుకు 6సార్లు ఫైనల్స్ చేరిన రికార్డు ఉంది.
కోల్ కతా నైట్ రైడర్స్ 4సార్లు ఐపీఎల్ ఫైనల్స్ చేరుకోగా..రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 3సార్లు ఫైనల్స్ చేరిన రికార్డు ఉంది.
క్వాలిఫైయర్ -1లో ఓడిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు..ఫైనల్స్ చేరటానికి మరో అవకాశం మిగిలేఉంది. బెంగళూరు- రాజస్థాన్ జట్ల ఎలిమినేటర్ రౌండ్లో నెగ్గిన జట్టుతో
మే 24న జరిగే రెండో క్వాలిఫైయర్ రౌండ్లో హైదరాబాద్ పోటీపడనుంది.
మే 26న చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ -17వ సీజన్ టైటిల్ పోరు జరుగనుంది.