వింబుల్డన్ రాజు...అల్ కరాజ్!

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో స్పానిష్ కోడెగిత్త కార్లోస్ అల్ కరాజ్ శకం మొదలయ్యింది. గత మూడువారాలలో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గడం ద్వారా తన జైత్రయాత్ర మొదలు పెట్టాడు.

Advertisement
Update:2024-07-15 10:02 IST

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో స్పానిష్ కోడెగిత్త కార్లోస్ అల్ కరాజ్ శకం మొదలయ్యింది. గత మూడువారాలలో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గడం ద్వారా తన జైత్రయాత్ర మొదలు పెట్టాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ను గత రెండుదశాబ్దాలుగా ఏలుతూ వచ్చిన త్రిమూర్తులు రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్, నొవాక్ జోకోవిచ్ ల శకం ముగిసింది. నవతరం ఆధిపత్యానికి తెరలేచింది.

స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కొద్ది సంవత్సరాల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించగా..స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ సైతం దాదాపుగా అదే పరిస్థితికి వచ్చాడు. ప్రపంచ రెండోర్యాంకర్, 37 సంవత్సరాల నొవాక్ జోకోవిచ్ కు సైతం ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. ప్రధానంగా స్పెయిన్ యువకిశోరం 21 సంవత్సరాల కార్లోస్ అల్ కరాజ్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది.

జోకో చేజారిన జంట రికార్డులు...

వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ ను ఎనిమిదోసారి నెగ్గడం ద్వారా రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేయాలన్న 2వ సీడ్ జోకోవిచ్ లక్ష్యం నెరవేరలేదు. లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో జరిగిన 137వ వింబుల్డన్ ఫైనల్లో 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత జోకోవిచ్ దారుణంగా విఫలమయ్యాడు.

ఫైనల్లో 3వ ర్యాంక్ ప్లేయర్, తనకంటే 16 సంవత్సరాల చిన్నవాడైన కార్లోస్ అల్ కరాజ్ చేతిలో వెటరన్ జోకోవిచ్ వరుస సెట్ల పరాజయం చవిచూశాడు. స్పానిష్ యంగ్ గన్ అల్ కరాజ్ 6-2, 6-2, 7-6తో జోకోవిచ్ ను చిత్తు చేశాడు.

మొదటి రెండుసెట్లను 2-6, 2-6తో ఓడిన జోకోవిచ్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి ఆఖరిసెట్లో గట్టి పోటీ ఇచ్చాడు. టై బ్రేక్ వరకూ పోరు కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు 6-7తో సెట్ ను 0-3తో మ్యాచ్ ను చేజార్చుకొని రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

వరుసగా 6వ వింబుల్డన్, కెరియర్ లో 25వ గ్రాండ్ స్లామ్, ఫెదరర్ పేరుతో ఉన్న ఎనిమిది వింబుల్డన్ టైటిల్స్ రికార్డులను ఒక్క గెలుపుతో సాధించాలన్న జోకోను అల్ కరాజ్ వరుస సెట్ల విజయంతో దెబ్బ కొట్టాడు.

వింబుల్డన్ ఫైనల్స్ లో పదోసారి పాల్గొన్న జోకోవిచ్ ఇంత పేలవంగా ఆడటం ఇదే మొదటిసారి. తాను ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోడం తీవ్రనిరాశకు గురిచేసిందని పోటీ అనంతరం జోకోవిచ్ వాపోయాడు.

అల్ కరాజ్ ఖాతాలో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్...

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ వారసుడిగా ప్రపంచ పురుషుల టెన్నిస్ లోకి మూడేళ్లక్రితమే అడుగుపెట్టిన నయాబుల్ కార్లోస్ అల్ కరాజ్ 21 సంవత్సరాలకే మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించగలిగాడు.

గతేడాది వింబుల్డన్ టైటిల్ తో తన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వేట మొదలు పెట్టిన అల్ కరాజ్..ప్రస్తుత 2024 సీజన్లో ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ తో పాటు బ్యాక్ టు బ్యాక్ వింబుల్డన్ టైటిల్స్ సైతం సాధించడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

ఈ విజయంతో అల్ కరాజ్ కు ప్రతిష్టాత్మక వింబుల్డన్ ట్రోఫీతో పాటు 270,00000 పౌండ్ల ప్రైజ్ మనీ సైతం దక్కింది.

Tags:    
Advertisement

Similar News