పోలార్డ్..ఇక డబుల్ రోల్!
కరీబియన్ దిగ్గజం, ఐపీఎల్ లో ముంబై ఆల్ టైమ్ గ్రేట్ ఆల్ రౌండర్ కీరాన్ పోలార్డ్ వచ్చే సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ తరపున డబుల్ రోల్ పోషించనున్నాడు.
కరీబియన్ దిగ్గజం, ఐపీఎల్ లో ముంబై ఆల్ టైమ్ గ్రేట్ ఆల్ రౌండర్ కీరాన్ పోలార్డ్ వచ్చే సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ తరపున డబుల్ రోల్ పోషించనున్నాడు.
ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ ముంబై ఫ్రాంచైజీతోనే తన అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించాడు...
టీ-20 లీగ్ ల బాహుబలి, ముంబై ఇండియన్స్ మహా ఆల్ రౌండర్ కీరాన్ పోలార్డ్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే..2023 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ లో బ్యాటింగ్ కోచ్ గా సేవలు అందించనున్నాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు తరపున ఎమిరేట్స్ లీగ్ లో ఆల్ రౌండర్ గా పాల్గోనున్నాడు.
2010 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కీలక సభ్యుడిగా ఉన్న పోలార్డ్ ఆల్ రౌండ్ ప్రతిభ కారణంగానే ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలువగలిగింది.
10వేల పరుగులు- 300 వికెట్లు
టీ-20 లీగ్ క్రికెట్ చరిత్రలోనే కీరాన్ పోలార్డ్ కు గొప్ప ఆల్ రౌండర్ గా, ఆల్ టైమ్ గ్రేట్ గా పేరుంది. బ్యాటర్ గా 10వేల పరుగులు, బౌలర్ గా 300 వికెట్లు పడగొట్టిన ఒకే ఒక్క ఆల్ రౌండర్ పోలార్డ్ మాత్రమే.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ దేశాల టీ-20 లీగ్ ల్లో పాల్గొంటూ 530కి పైగా మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ ఘనత పోలార్డ్ కు మాత్రమే సొంతం. ముంబైజట్టు కష్టాలలో ఉన్న ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఆల్ రౌండ్ ప్రతిభతో పలుమార్లు ఆదుకొన్నాడు. ముంబై రికార్డుస్థాయిలో ఐపీఎల్ టైటిల్స్ నెగ్గడం వెనుక పోలార్డ్ శ్రమ, అంకితభావం దాగున్నాయి.
ఐపీఎల్ కు అల్విదా...
2010 నుంచి 2022 సీజన్ వరకూ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ వచ్చిన పోలార్డ్ మొత్తం 189 మ్యాచ్ లు ఆడి 171 ఇన్నింగ్స్ లో 16 హాఫ్ సెంచరీలతో 3వేల 412 పరుగులతో 28.67 సగటు, 147.32 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. 218 ఫోర్లు, 223 బౌండ్రీలు సాధించాడు. బౌలర్ గా 69 వికెట్లు పడగొట్టాడు.
2018లో 5 కోట్ల 40 లక్షల రూపాయలు అందుకొన్న పోలార్డ్ 2022 సీజన్లో 6 కోట్ల రూపాయలు పారితోషికంగా పొందాడు.
ముంబై తరపున 5 ఐపీఎల్ టైటిల్స్, 2 చాంపియన్స్ లీగ్ ట్రోఫీలు సాధించాడు.
ముంబై తరపున 13 సీజన్లుగా ఆడుతూ వచ్చిన తాను ఐపీఎల్ నుంచి రిటైరైనట్లు ప్రకటించాడు. అయితే ఎమిరేట్స్ టీ-20 లీగ్ లో మాత్రం ముంబై ఎమిరేట్స్ కు ఆల్ రౌండర్ గా సేవలు అందిస్తానని ప్రకటించాడు.
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ గా...
ఐపీఎల్ లో గత 13 సీజన్లుగా ముంబై ఇండియన్స్ కుటుంబంలో ఓ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చిన తనపట్ల ఎంతో ప్రేమ, ఆదరాభిమానాలను చూపిన అంబానీ కుటుంబసభ్యులకు పోలార్డ్ ధన్యవాదాలు తెలిపాడు.
ముంబై నుంచి తప్పుకొన్నతనకు వేరే జట్టులో సభ్యుడిగా ఆడే ఆలోచన , కోరిక లేవని, ముంబై ఇండియన్స్ తో తన అనుబంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. బ్యాటింగ్ కోచ్ గా ముంబై ఫ్రాంచైజీతో తనను కొనసాగమని నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ కోరినట్లు చెప్పాడు.
మరోవైపు ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ ను నీతా అంబానీ ప్రశంసలతో ముంచెత్తారు. ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతంగా నిలవడం వెనుక పోలార్డ్ పాత్ర ఎంతో ఉందని, పోలార్డ్ సేవలు నిరుపమానమని ప్రశంసించారు. పోలార్డ్ కు క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ, అంకితభావం తమకు కలకాలం గుర్తుండిపోతాయని చెప్పారు.