ప్రేక్షకాదరణలో కబడ్డీలీగ్ సరికొత్త రికార్డు!

భారత, విశ్వక్రీడాభిమానులను గత తొమ్మిది సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ప్రో-కబడ్డీ లీగ్ కొత్తపుంతలు తొక్కుతోంది.

Advertisement
Update:2024-02-08 18:38 IST

భారత, విశ్వక్రీడాభిమానులను గత తొమ్మిది సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ప్రో-కబడ్డీ లీగ్ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రస్తుత 10వ సీజన్లో టీవీ వీక్షకాదరణలో సరికొత్త రికార్డు నమోదయ్యింది.

భారతగడ్డపై అత్యధిక జనాదరణ పొందుతున్న రెండో అతిపెద్ద లీగ్.. ప్రీమియర్ కబడ్డీ 10వ సీజన్ పోటీలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. దేశంలోని 12 నగరాలు వేదికలుగా 12 జట్లతో జరిగిన మొదటి 90 మ్యాచ్ లకు రికార్డుస్థాయిలో వీక్షకాదరణ దక్కింది. గత తొమ్మిది సీజన్లను మించి ప్రస్తుత 10వ సీజన్ టీవీ ప్రత్యక్షప్రసార రేటింగ్ పెరిగింది.

స్టార్ నెట్ వర్క్ వెల్లడించిన వివరాల ప్రకారం వీక్షకుల సంఖ్య 226 మిలియన్లకు చేరింది. గత తొమ్మిదిసీజన్లలో వీక్షకుల సగటు సంఖ్య పలుమార్లు 200 మిలియన్లను తాకింది.

మొదటి 90 మ్యాచ్ లను టీవీ ప్రసారాల ద్వారా 226 మిలియన్ల మంది వీక్షించారు. గతంతో పోల్చుకొంటే 17 శాతం వీక్షకులు అదనంగా పెరిగినట్లు స్టార్ నెట్ వర్క్ నిర్వాహకులు తెలిపారు.

38 కోట్ల నిముషాల ప్రసారం...

ప్రస్తుత 2024 సీజన్లో కబడ్డీ మ్యాచ్ ల ప్రత్యక్షప్రసార సమయం 38 కోట్ల నిముషాలకు చేరిందని, గత సీజన్ కంటే 15 శాతం అదనమని వివరించింది. కబడ్డీ లీగ్ టీవీఆర్ రేటింగ్ 22 శాతం అదనం కావడం పట్ల నిర్వాహక సంఘం సంతృప్తి ప్రకటించింది.

భారతగడ్డపై అత్యధిక జనాదరణ, వీక్షకాదరణ పొందుతున్న ఐపీఎల్ తర్వాతి స్థానాన్ని ప్రో-కబడ్డీ లీగ్ ఆక్రమించింది. ప్రస్తుత 10వ సీజన్లో మనిందర్ సింగ్, అర్జున్ దేశ్వాల్, మహ్మద్ రెజా, అషు మాలిక్ లాంటి ఆటగాళ్లు తమ వీరోచిత ఆటతీరుతో ప్రేక్షకులను కట్టి పడేస్తున్నారు. స్టేడియాలకు వచ్చే క్రీడాభిమానులతో పాటు..టీవీ లను అంటిపెట్టుకొనే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

హైదరాబాద్ అంచె పోటీలకు మరింత ఆదరణ?

ఫిబ్రవరి 26 నుంచి హైదరాబాద్ గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా వారం రోజులపాటు జరిగే ప్లే-ఆఫ్ రౌండ్ మ్యాచ్ లతో పాటు సెమీఫైనల్స్ , ఫైనల్స్ కు సైతం

టీవీ రేటింగ్ లో పెరిగిపోడం ఖాయమని కబడ్డీ లీగ్ నిర్వాహకులు అంచనావేస్తున్నారు.

మార్చి 1న జరిగే ఫైనల్స్ తో 2024 సీజన్ ప్రో-కబడ్డీ లీగ్ కు తెరపడనుంది. ప్లే-ఆఫ్ రౌండ్లో మొత్తం 9జట్లు తలపడనున్నాయి.

లీగ్ టేబుల్ మొదటి 2 జట్లకు సెమీస్ బెర్త్ లు..

మొత్తం 12 జట్ల లీగ్ దశలో మొదటి రెండుస్థానాలలో నిలిచిన రెండుజట్లు నేరుగా సెమీఫైనల్స్ కు చేరుకొంటాయి. 3, 4, 5,6 స్థానాలలో నిలిచిన జట్ల నడుమ మిగిలిన రెండు సెమీస్ బెర్త్ ల కోసం ఎలిమినేటర్ రౌండ్ పోటీలు నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 27న జరిగే ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ తో హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 28న రెండు సెమీఫైనల్స్ రౌండ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు.

మార్చి 1న చాంపియన్ జట్టు ఏదో నిర్ణయించే ఫైనల్స్ జరుగుతుంది.

ఎలిమినేటర్ -1 పోరులో 3వ స్థానంలో నిలిచినజట్టుతో 6వ స్థానం సాధించిన జట్టు, ఎలిమినేటర్ -2 ఫైట్ లో 4, 5 స్థానాలలో నిలిచిన జట్లు తలపడనున్నాయి.

ఎలిమినేటర్ -1 విజేతగా నిలిచినజట్టు తొలిసెమీఫైనల్లో టేబుల్ టాపర్ జట్టుతోను, ఎలిమినేటర్ -2 రౌండ్ మ్యాచ్ విజేతతో లీగ్ రన్నరప్ జట్టు రెండో సెమీఫైనల్లో ఢీ కొంటాయి.

10వ సీజన్ లీగ్ లో తలపడుతున్న మొత్తం 12 జట్లలో జైపూర్ పింక్ పాంథర్స్, యూ-ముంబా, పూణేరీ పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్, గుజరాత్ జెయింట్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, తమిళ్ తలైవాస్, యూపీ యోధాస్, తెలుగు టైటాన్స్ ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News