'ఆంధ్రా వండర్' కి ప్రపంచ కాంస్యపతకం!

తెలుగు రాష్ట్ర్రాల మెరుపుతీగ జ్యోతి ఎర్రాజీ ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో భారత్ కు తొలి హర్డిల్స్ పతకం అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Advertisement
Update:2023-08-05 16:20 IST

తెలుగు రాష్ట్ర్రాల మెరుపుతీగ జ్యోతి ఎర్రాజీ ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో భారత్ కు తొలి హర్డిల్స్ పతకం అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

చైనాలోని చెంగ్డు వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ మహిళల 100 మీటర్ల హర్డల్స్ లో పతకం సాధించిన భారత తొలి అథ్లెట్ గా విశాఖ వండర్, తెలుగు రాష్ట్ర్రాలమెరుపు తీగ జ్యోతి ఎర్రాజీ నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాల క్రీడాకారులు పురుషుల, మహిళల విభాగాలలో పోటీపడుతున్నారు. పోటీలు ముగియటానికి మరో రెండురోజులు మాత్రమే మిగిలిఉన్నాయి.

భారత్ 11 స్వర్ణ, 5 రజత, 9 కాంస్యాలతో సహా మొత్తం 25 పతకాలతో పతకాల పట్టిక నాలుగోస్థానంలో కొనసాగుతోంది.

జ్యోతి సరికొత్త జాతీయ రికార్డు...

విశాఖకు చెందిన 23 సంవత్సరాల జ్యోతి ఎర్రాజీ గత రెండేళ్లుగా జాతీయ, ఆసియాస్థాయి పోటీల హర్డల్స్, పరుగు అంశాలలో తన రికార్డులు తానే మెరుగుపరచుకొంటూ దూసుకుపోతోంది.

ఇటీవలే బ్యాంకాక్ వేదికగా ముగిసిన ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో సైతం జ్యోతి 100 హర్డిల్స్ లో బంగారు, 200 పరుగులో వెండి పతకాలు సాధించింది.

అంతటితో ఆగకుండా..చెంగ్డు వేదికగా జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో సైతం భారత్ కు ప్రాతినిథ్యం వహించింది.

హోరాహోరీగా సాగిన 100 మీటర్ల హర్డిల్స్ రేస్ లో జ్యోతి 12.78 సెకన్లలో గమ్యం చేరి తనపేరుతోనే ఉన్న 12.82 సెకన్ల రికార్డును తెరమరుగు చేసింది. స్లొవాకియా రన్నర్ విక్టోరియా ఫాస్టర్ 12.72 సెకన్ల టైమింగ్ తో స్వర్ణ, చైనా రన్నర్ యానీ యు 12.76 సెకన్ల టైమింగ్ తో రజత పతకాలు దక్కించుకోగా..12.78 సెకన్ల రికార్డుతో జ్యోతి కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల మహిళల హర్డిల్స్ రేస్ లో దేశానికి పతకం తెచ్చిన తొలి మహిళా అథ్లెట్ గా జ్యోతి రికార్డు నెలకొల్పింది.

మహిళల 200 మీటర్ల రేస్ లో అమ్లాన్ కు కాంస్యం..

మహిళల 200మీటర్ల పరుగులో భారత్ కు చెందిన అమ్లాన్ బోర్గెయిన్ 20.55 సెకన్ల టైమింగ్ తో కాంస్య పతకం సాధించింది. 2019 ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో

100 మీటర్ల పరుగులో ద్యుతి చంద్ బంగారు పతకం సాధించిన తరువాత భారత మహిళలు సాధించిన పతకాలు జ్యోతి, అమ్లాన్ తెచ్చినవే కావడం విశేషం.

శుక్రవారం నాటి పోటీలలో భారత్ 4 పతకాలు సాధించడం ద్వారా పతకాల పట్టిక 4వ స్థానానికి చేరుకోగలిగింది.

ఆతిథ్య చైనా, కొరియా, జపాన్ అత్యధిక పతకాలతో పతకాల పట్టిక మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నాయి.

2013లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పురుషుల షాట్ పుట్ లో ఇంద్రజీత్ సింగ్ రజత పతకం సాధించిన భారత అథ్లెట్ గా నిలిచాడు. 2015లో కొరియాలోని గాంగ్జు వేదికగా ముగిసిన గేమ్స్ లో ఇంద్రజీత్ బంగారు పతకంతో సంచలనం సృష్టిస్తే..చైనీస్ తైపీ వేదికగా జరిగిన 2017 గేమ్స్ 10వేల మీటర్ల పరుగులో సంజీవనీ జాదవ్ రజత, 2019లో ఇటలీలోని నేపిల్స్ లో జరిగిన క్రీడల మహిళల 100 మీటర్ల రేస్ లో ద్యుతి చంద్ స్వర్ణ పతకాలు సాధించిన అథ్లెట్లుగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News