భారత జూనియర్లకు ఆసియా హాకీ టైటిల్!

2023 ఆసియా జూనియర్ బాలుర హాకీ టైటిల్ ను భారత్ నాలుగోసారి గెలుచుకొంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 2-1తో అధిగమించింది.

Advertisement
Update:2023-06-02 13:45 IST

భారత జూనియర్లకు ఆసియా హాకీ టైటిల్!

2023 ఆసియా జూనియర్ బాలుర హాకీ టైటిల్ ను భారత్ నాలుగోసారి గెలుచుకొంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 2-1తో అధిగమించింది.

ఆసియా హాకీ పురుషుల సీనియర్, జూనియర్ విభాగాలలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. 2023 జూనియర్ ఆసియాకప్ ను మూడుసార్లు విన్నర్ భారత్ నాలుగోసారి గెలుచుకొంది.

ఒమన్ లోని సలాలా వేదికగా జరిగిన ఆసియా జూనియర్ హాకీటోర్నీలో భారత కుర్రాళ్లు తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా ట్రోఫీని కైవసం చేసుకొన్నారు.

హోరాహోరీగా ఫైనల్ పోరు...

లీగ్ దశ నుంచి నిలకడగా రాణిస్తూ అత్యధిక విజయాలు సాధించినజట్లుగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. హాట్ ఫేవరెట్ భారత్ ఆట మొదటి 20 నిముషాలలోనే రెండు కీలక గోల్స్ సాధించడం ద్వారా పైచేయి సాధించింది.

ఆట మొదటి క్వార్టర్ 13వ నిముషంలోనే భారత్ కు అంగద్ బీర్ సింగ్ తొలిగోలుతో 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 7 నిముషాల వ్యవధిలోనే అరాయ్ జీత్ సింగ్ హుండాల్ భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

ఆ తర్వాత నుంచి భారత్ ఆధిక్యాన్ని కాపాడుకోటానికి..ప్రత్యర్థి పాకిస్థాన్ గోల్స్ కోసం దూకుడు పెంచటానికీ ప్రాధాన్యమిచ్చాయి. భారత్ స్కోరును సమం చేయటానికి పాక్ ఆటగాళ్లు చేసిన పలు ప్రయత్నాలను భారత గోల్ కీపర్ శశికుమార్ సమర్థవంతంగా తిప్పికొట్టాడు.

రౌండ్ రాబిన్ లీగ్ దశలో భారత్ తో జరిగిన పోటీని పాకిస్థాన్ 1-1తో డ్రాగా ముగించినా..టైటిల్ సమరంలో మాత్రం సఫలం కాలేకపోయింది. ఆట 38వ నిముషంలో బషారత్ అలీ సాధించిన ఫీల్డ్ గోల్ తో పాక్ జట్టు భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగినా..విజేతగా మాత్రం నిలువలేకపోయింది.

2015 తర్వాత విజేతగా భారత్...

ఆసియా జూనియర్ హాకీ టోర్నీ చరిత్రలో భారత్ కు గతంలో మూడుసార్లు ( 2004, 2008, 2015 ) టైటిల్ నెగ్గిన ఘనత ఉంది. చివరిసారిగా 2015లో ట్రోఫీ అందుకొన్న భారత్..నాలుగో టైటిల్ విజయం కోసం ఎనిమిది సంవత్సరాలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. పాకిస్థాన్ జట్టు సైతం 1988, 1992, 1996 టోర్నీలలో ఆసియా చాంపియన్ గా నిలిచింది.

సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 9-1 గోల్స్ తో చిత్తుచేసిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో భారత్ రాణించింది, పూర్తిస్థాయిలో రాణించడం ద్వారా పాకిస్థాన్ పై పైచేయి సాధించగలిగింది.

రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో తాము ఫైనల్లో ఆడినట్లు భారత కెప్టెన్ ఉత్తమ్ సింగ్ విజయానంతరం ప్రకటించాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉత్తమ్ సింగ్ కే దక్కింది.

భారత కుర్రాళ్లకు 2 లక్షల నజరానా...

ఆసియాకప్ అందుకోడం ద్వారా..మలేసియా వేదికగా జరిగే జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీలో పాల్గొనటానికి అర్హత సాధించిన భారతజట్టు సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి ఇవ్వనున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది. జట్టు సహాయక సిబ్బందికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వనున్నారు.

మలేసియాలోని జోహార్ బాహ్రూ వేదికగా త్వరలో జరుగనున్న ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.

భారతజట్టు ఆసియా చాంపియన్ గా నిలవడం పట్ల హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కే, సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ అభిమానులతో కిటకిటలాడిన సలాలా స్టేడియంలో ఆడటం తమను తీవ్రఒత్తిడికి గురి చేసినట్లు భారత కెప్టెన్ తెలిపాడు. అయినా..ఒత్తిడిని అధిగమించి విజేతగా నిలవడం గర్వకారణమని తెలిపాడు.

Tags:    
Advertisement

Similar News