ఆటే కాదు..క్రమశిక్షణా ప్రధానమే; బీసీసీఐ
క్రికెటర్లకు ఆట, ప్రతిభ మాత్రమే ఉంటే చాలదని క్రమశిక్షణ కూడా ముఖ్యమని బీసీసీఐ స్పష్టం చేసింది.
క్రికెటర్లకు ఆట, ప్రతిభ మాత్రమే ఉంటే చాలదని క్రమశిక్షణ కూడా ముఖ్యమని బీసీసీఐ స్పష్టం చేసింది.
క్రికెట్ ఫార్మాట్ ఏదైనా భారతజట్టులో చోటు పొందాలంటే క్రికెటర్లకు ప్రతిభతో పాటు అణుకువ కూడా ఉండితీరాలని బీసీసీఐ తేల్చి చెప్పింది. క్రమశిక్షణ తప్పి ఇష్టం వచ్చినట్లు వ్యహరించేవారికి జట్టులో చోటు ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ -16లో అంచనాలకు మించి రాణించినా, క్రమశిక్షణ లేకుండా వ్యవహరించినవారిని..వెస్టిండీస్ తో జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు జట్టును ఎంపిక చేసే సమయంలో పరిగణనలోకి తీసుకోబోమని వివరించింది.
ఉత్తర భారత ఫ్రాంచైజీల ఫిర్యాదు..
ఐపీఎల్ 2023 సీజన్లో క్రమశిక్షణ తప్పిన ఉత్తర భారత ఫ్రాంచైజీ( మొహాలీ, ఢిల్లీ, లక్నో, జైపూర్ )లకు చెందిన కొందరు క్రికెటర్లు పదేపదే నియమావళిని అతిక్రమించినట్లు తమకు ఫిర్యాదులు అందాయని, క్రమశిక్షణలేని క్రికెటర్లను భరించేది, సహించేదీ లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది.
ఆటతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమేనని, అణుకువలేని ఆటగాళ్లను భారతజట్ల ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకొనే ప్రసక్తేలేదని హెచ్చరించింది.
ఎవరా నలుగురు క్రికెటర్లు?
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ -16లో పాల్గొన్న ఉత్తర భారత ఫ్రాంచైజీలకు చెందిన నలుగురు క్రికెటర్లపైన బీసీసీఐ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదులు అందాయి.
తలబిరుసుగా ప్రవర్తించడం, క్రమశిక్షణ తప్పడం, క్రికెటర్ల నియమావళిని ఖాతరు చేయకపోడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతవర్గాలు తేల్చి చెప్పాయి.
దేశవాళీ రంజీ క్రికెట్లో గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తూ 79 సగటు సాధించినా యువక్రికెటర్ సరఫ్రాజ్ ఖాన్ కు భారత టెస్టు జట్టులో చోటు దక్కడం లేదు.
సరఫ్రాజ్ ను ఎంపిక చేయకపోడం పట్ల క్రికెట్ దిగ్గజాలు, వ్యాఖ్యాతలు సునీల్ గవాస్కర్, ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్, డబ్లు వి రామన్ తప్పుపడుతున్నారు.
రంజీ క్రికెట్లో సాధించిన పరుగులను పరిగణనలోకి తీసుకోమని సెలెక్టర్లు ప్రకటించాలని, మరి రంజీమ్యాచ్ ల్లో పాల్గొనటం ఎందుకని గవాస్కర్ ప్రశ్నిస్తున్నారు.
ప్రతిభ ఉన్నా అణుకువ లేని సరఫ్రాజ్...
దేశవాళీ క్రికెట్లో గత మూడేళ్లుగా టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్న 25 సంవత్సరాల సరఫ్రాజ్ ఖాన్ లో ప్రతిభ, నిలకడగా రాణించే తత్వం ఉన్నా అణకువ లేశమైనా లేదని, క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించడం లేదని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పరోక్షంగా తెలిపారు.
సెంచరీ సాధించిన సమయంలో భారత సెలెక్టర్లను ఎద్దేవా చేసినట్లు సరఫ్రాజ్ ప్రవర్తన ఉంటోందని, భారతజట్టుకు అంతర్జాతీయమ్యాచ్ ల్లో ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లకు హుందాగా నడుచుకొనే తీరు ఉండాలని గుర్తు చేశారు.
ఆటతో పాటు క్రమశిక్షణతో నడుచుకోడం, హుందాగా ప్రవర్తించడం కూడా సరఫ్రాజ్ కు అతని శిక్షకుడు, తండ్రి నేర్పాలని సూచించారు. సరఫ్రాజ్ వయసుకు మించిన బరువుతో ఫిట్ నెస్ లేమితో ఉన్నాడని, అంతర్జాతీయస్థాయి క్రికెటర్లు ఎలా ఉండాలో..ఆ తీరుగా లేడని కూడా తెలియచెప్పారు.
ఉత్తర భారత ప్రాంచైజీకి చెందిన యాజమాన్యం తమ ఆటగాళ్లపైన బీసీసీఐకి ఫిర్యాదు చేసిందని, ఆ ఫిర్యాదులను బీసీసీఐ ఇంటిగ్రెటీ అధికారి ఒకరు పరిశీలిస్తున్నారని, దేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు సాధించిన మరో ఇద్దరు యువక్రికెటర్ల పైన సైతం ఫిర్యాదులు అందాయని బోర్డు అధికారి తెలిపారు.
వచ్చేనెలలో వెస్టిండీస్ తో జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టు ఎంపిక కోసం నిర్వహించే సెలెక్షన్ కమిటీ సమావేశంలో..క్రమశిక్షణ తప్పిన క్రికెటర్ల పేర్లను పరిశీలించేది లేదని, ఎంతగా రాణించినా..క్రమశిక్షణ ముఖ్యమని వివరించారు.
పరుగులు సాధిస్తే, వికెట్లు పడగొడితే, సెంచరీలు బాదితే భారతజట్టులో చోటు దక్కుతుందంటే పొరపాటేనని, వ్యక్తిత్వం, క్రమశిక్షణ కూడా ప్రధానమేనని చెప్పకనే చెప్పారు. అణకువ లేని ప్రతిభ, క్రమశిక్షణ లేని పాటవం ఎందుకూ కొరగావని బీసీసీఐ పెద్దలు భావించడంలో తప్పేమీలేదు.