భారత్ ను నిండాముంచిన ఐపీఎల్!

భారత క్రికెటర్లు ఐపీఎల్ లో హీరోలు, ఐసీసీ టోర్నీల ఫైనల్స్ లో జీరోలని మరోసారి తేలిపోయింది.

Advertisement
Update:2023-06-12 14:30 IST

భారత్ ను నిండాముంచిన ఐపీఎల్!

భారత క్రికెటర్లు ఐపీఎల్ లో హీరోలు, ఐసీసీ టోర్నీల ఫైనల్స్ లో జీరోలని మరోసారి తేలిపోయింది. ఐసీసీ ప్రపంచ టెస్టులీగ్ ఫైనల్లో వరుసగా రెండోసారి భారత్ కు వైఫల్యమే ఎదురయ్యింది....

రెండుపడవల మీద కాళ్లువేసినవారు గమ్యం చేరలేరని చెప్పటానికి భారత క్రికెట్ ను మించిన నిదర్శనం మరొకటి ఉండదు. జేబులు నింపే ఐపీఎల్ కు ఇస్తున్న ప్రాధాన్యం... గొప్పగౌరవాన్ని, ట్రోఫీలను సంపాదించిపెట్టే ఐసీసీ ప్రపంచ టోర్నీలకు భారత క్రికెట్ బోర్డు ఏమాత్రం ఇవ్వడం లేదన్న విమర్శలు రానురాను పెరిగిపోతున్నాయి.

పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీలేని భారత్...

ప్రపంచ క్రికెట్ కు చిరునామాగా నిలిచిన భారత్ పరిస్థితి పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లుగా తయారయ్యింది. ఐసీసీకి వివిధ రూపాలలో లభించే వేలకోట్ల రూపాయల ఆదాయంలో 80 శాతం భారత్ నుంచే సమకూరుతోంది. అయితే..ఐసీసీ నిర్వహించే ప్రపంచ ( వన్డే, టీ-20, టెస్టు లీగ్, మినీ ప్రపంచకప్)టోర్నీలలో మాత్రం..

భారత్ దక్కే టైటిల్స్ నామమాత్రంగానే ఉన్నాయి.

2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ మరో ఐసీసీ ప్రపంచ టోర్నీ నెగ్గలేదంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. 1983 వన్డే ప్రపంచకప్ లో కపిల్ దేవ్, 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలలో మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్ కు ట్రోఫీలు అందించారు. ఆ తర్వాత జరిగిన వన్డే, టీ-20, టెస్టులీగ్ టోర్నీలలో భారత్ విపలమవుతూనే వస్తోంది.

ఐపీఎల్ తోనే సకల అరిష్టాలు...

దేశంలోని ప్రయివేటు పార్టీ( ఫ్రాంచైజీల)ల వ్యాపారంగా సాగుతున్న ఐపీఎల్ కోసం భారత క్రికెట్ బోర్డు, క్రికెటర్లు దేశఖ్యాతిని పణంగా పెడుతూ వస్తున్నారు. కోట్ల రూపాయల వర్షం కురిపించే ఐపీఎల్ కు ఇస్తున్న ప్రాధాన్యం..లక్షల రూపాయలు మాత్రమే మ్యాచ్ ఫీజుగా అందించే ఐసీసీ మ్యాచ్ లు, ట్రోఫీలకు ఏమాత్రం ఇవ్వడం లేదు.

ఐపీఎల్ కోసం తమ సర్వశక్తులూ ధారపోస్తున్న స్టార్ ప్లేయర్లు..భారతజట్టు కోసం మాత్రం మొక్కుబడిగానే ఆడుతున్నారు.యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా, స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. భారతజట్టు కీలక మ్యాచ్ లు ఆడే సమయంలో తురుపుముక్కల్లాంటి ఆటగాళ్లు అందుబాటులో ఉండకుండా పోడం భారత క్రికెట్ కు శాపంగా మారింది.

మూడువారాలకు బదులు..7 రోజులే!

ఐసీసీ ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్ మ్యాచ్ కు సన్నద్దం కావాలంటే ఏ జట్టుకైనా కనీసం మూడువారాల సమయం కావాలి. పైగా..ఫైనల్ ఆడటానికి ముందు రెండు ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడే వెసలుబాటు సైతం ఉండితీరాలి. అయితే..రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టుకు అవేమీ లేకుండా పోయాయి.

ఏడువారాలపాటు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన భారతజట్టు సభ్యులంతా..కనీస విశ్రాంతి లేకుండా కొద్దిరోజుల వ్యవధిలోని ఇంగ్లండ్ కు బయలుదేరాల్సి వచ్చింది.

మే 30న ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన భారత క్రికెటర్లు ఆ వెంటనే లండన్ కు క్యూకట్టారు.

ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్ ప్రారంభానికి ముందు భారతజట్టు సన్నద్దం కావడం కోసం కేవలం వారంరోజుల సమయం మాత్రమే దొరికింది. రెండునెలలపాటు ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ ఆడిన భారత క్రికెటర్లు ...తగిన విరామం లేకుండానే టీ-20కి భిన్నమైన సాంప్రదాయ టెస్టు క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ లోపం టెస్టు లీగ్ ఫైనల్లో భారతజట్టు సభ్యుల ఆటతీరుకు దర్పణం పట్టింది.

ఓవల్ వేదికగా జరిగిన టెస్టు లీగ్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో భారత్ పై సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. 209 పరుగుల భారీతేడాతో విజేతగా నిలిచింది.

భారత స్టార్ బ్యాటర్లలో అజింక్యా రహానే మాత్రమే 89 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రమే ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించగలిగాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ, యువఓపెనర్ శుభ్ మన్ గిల్, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా, పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ, స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ లలో కనీసం ఒక్కరూ హాఫ్ సెంచరీ మార్క్ ను చేరలేకపోయారు.

ఐపీఎల్ లో వీరవిహారం చేసిన ఫాస్ట్ బౌలర్ల జోడీ షమీ, సిరాజ్ సైతం టెస్టులీగ్ ఫైనల్లో తేలిపోయారు.

వ్యూహాత్మక తప్పిదాలు...!

ఆస్ట్ర్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థితో టైటిల్ సమరంలో తలబడుతున్న ఓ జట్టు ఎంత ఆప్రమత్తంగా ఉండాలి. అందివచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయాలలో భారత్ దారుణంగా విఫలమయ్యింది, వ్యూహాత్మక తప్పిదాలతో భారీమూల్యమే చెల్లించుకొంది.

వికెట్, వాతావరణ పరిస్థితులకు అతీతమైన బౌలర్ గా పేరున్న రవిచంద్రన్ అశ్విన్ ను పక్కనపెట్టి అదనపు పేసర్ ను తుదిజట్టులోకి తీసుకోడం ద్వారా భారత్ వ్యూహాత్మకంగా అతిపెద్ద తప్పిదమే చేసింది.

టెస్టు లీగ్ లో భాగంగా ఆడిన 13 మ్యాచ్ ల్లో 61 వికెట్లతో బౌలర్ నంబర్ వన్ గా నిలిచిన అశ్విన్ లాంటి చాంపియన్ క్రికెటర్ ను పక్కన పెట్టడంలో ఔచిత్యమేమిటో తనకు అంతు పట్టడం లేదని మాస్టర్ సచిన్ టెండుల్కర్ వాపోయాడు.

పైగా..టెస్టు లీగ్ ఫైనల్ ప్రారంభంకావటానికి వారంరోజుల ముందే..భారత తుదిజట్టులో అశ్విన్ ఉండితీరాల్సిందేనని మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి చెబుతూ వచ్చినా..టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం..శీతలవాతావరణం, పరిస్థితులు అంటూ సాకులు చెప్పి..అశ్విన్ కు తుదిజట్టులో చోటు లేకుండా చేయగలిగింది.

దీనికితోడు కీలక టాస్ నెగ్గినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

బ్యాటింగ్ లో వీరులు, శూరులు లాంటి రోహిత్, గిల్, విరాట్, పూజారా, జడేజా వెలవెలపోటం భారత్ ను కోలుకోలేని దెబ్బతీసింది. ఏదిఏమైనా..కర్ణుడు చావుకు కారణాలు కోటి అన్నట్లు...భారత వైఫల్యంలో తిలాపాపం తలాపిడికెడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

2021 టెస్టులీగ్ ఫైనల్లో విరాట్ కొహ్లీ కెప్టెన్ గా న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ కు..2023 టైటిల్ సమరంలో రోహిత్ శర్మ నాయకత్వంలో ఆస్ట్ర్రేలియా చేతిలో పరాజయం తప్పలేదు. ఐపీఎల్ కు ప్రాధాన్యమిస్తున్నంత కాలం..ఐసీసీ ప్రపంచ టోర్నీలలో భారత్ విజేతగా నిలవాలని కోరుకోడం అత్యాశేఅవుతుంది.

Tags:    
Advertisement

Similar News