టాక్సీ డ్రైవర్ కూతురికి ఐపీఎల్ కాంట్రాక్టు!

భారత క్రికెట్ బోర్డు గత 15 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ దిగువ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో ప్లేయర్ల తలరాతను మార్చి వేస్తోంది.

Advertisement
Update:2023-12-11 18:00 IST

భారత క్రికెట్ బోర్డు గత 15 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ దిగువ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో ప్లేయర్ల తలరాతను మార్చి వేస్తోంది.

మహిళా ఐపీఎల్ లో సైతం అదే పరంపర కొనసాగుతోంది....

ముంబై వేదికగా కొద్దిగంటల క్రితమే ముగిసిన మహిళా ఐపీఎల్ రెండో సీజన్ వేలం భారత దేశవాళీ క్రికెటర్ల పాలిట వరంగా మారింది. ప్రధానంగా బడుగు వర్గాలు, దిగువమధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన మహిళా క్రికెటర్లు వేలం ద్వారా తమకు దక్కిన కాంట్రాక్టుతో ఆర్థికంగా బలపడనున్నారు.

కొందరికే మాత్రమే ఐపీఎల్ చాన్స్.....

2024 మహిళా ఐపీఎల్ కోసం నిర్వహించిన మినీవేలంలో తమిళనాడులోని ఓ ట్యాక్సీ డ్రైవర్ కుమార్తె ముంబై ఫ్రాంచైజీ కాంట్రాక్టును దక్కించుకోడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మొత్తం ఐదు ఫ్రాంచైజీలకు చెందిన యాజమాన్యాల బృందాలు తమజట్టు అవసరాలకు తగిన ప్లేయర్ల కోసం వేలం బరిలో నిలిచారు. కేవలం 30 ఖాళీల భర్తీ కోసమే నిర్వహించిన ఈ వేలంలో 104 మంది భారత ప్లేయర్లతో సహా 165 మంది పాల్గొన్నారు.

61 మంది విదేశీ క్రికెటర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన 15 మంది ప్లేయర్లతో పాటు..అంతర్జాతీయ మ్యాచ్ ల అనుభవం ఏమాత్రం లేని 56 మంది అన్ కాప్డ్ ప్లేయర్లను జాబితాలో ఉంచారు.

మొత్తం 165 మంది నుంచి 30 మందికి మాత్రమే అవకాశం ఉండడంతో..మిగిలిన 135 మంది కాంట్రాక్టు దక్కించుకోడంలో విఫలమయ్యారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ల

కోటాలో తమిళనాడుకు చెందిన ఆల్ రౌండర్ కీర్తన బాలకృష్ణన్ సైతం తొలిసారిగా ఐపీఎల్ కాంట్రాక్టు దక్కించుకోగలిగింది.

తమిళనాడు తొలి యువతి కీర్తన....

ఐపీఎల్ వేలంలో లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ కీర్తన బాలకృష్ణన్ ను ముంబై ఫ్రాంచైజీ 10 లక్షల రూపాయల కనీస వేలం ధరకు సొంతం చేసుకొంది. చెన్నై నగరంలోని ఓ ట్యాక్సీ డ్రైవర్ కుటుంబం నుంచి క్రికెట్లోకి అడుగు పెట్టిన కీర్తనకు ఐపీఎల్ కాంట్రాక్టు దక్కడంతో జీవితం ఒక్కసారిగా మారినట్లయ్యింది.

భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ తండ్రి టీఎస్ ముకుంద్ చెన్నైలోని నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లల కోసం ఉచితంగా నిర్వహిస్తున్నక్రికెట్ అకాడమీలో

శిక్షణ పొందడం ద్వారా చక్కటి ఆల్ రౌండర్ గా గుర్తింపు సంపాదించుకొంది.

నాణ్యమైన లెగ్ స్పిన్నర్ గా, లోయర్ మిడిలార్డర్ లో కీలక పరుగులు సాధించే సత్తా కలిగిన బ్యాటర్ గా కీర్తనకు మంచి రికార్డే ఉంది. తమిళనాడు తరపున దేశవాళీ క్రికెట్ పోటీలలో నిలకడగా రాణించడం ద్వారా కీర్తన ఐపీఎల్ వేలం జాబితాలో చోటు సంపాదించగలిగింది.

తన క్రికెట్ అకాడమీ ఉచితంగా అందచేసిన కిట్ బ్యాగ్ తోనే నెట్టుకొంటూ వచ్చిన కీర్తన తండ్రి బాలకృష్ణన్ తన కుటుంబ పోషణ కోసం ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు.

ఇప్పుడు కీర్తన 10 లక్షల రూపాయల ఐపీఎల్ కాంట్రాక్టు సాధించడంతో బాలకృష్ణన్ కుటుంబం ఆర్థిక కష్టాలు చాలావరకూ తీరినట్లే. ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి అంతర్జాతీయ ప్లేయర్లతో కలసి ప్రాక్టీసు చేయటం, శిక్షణ పౌందటంతో పాటు మ్యాచ్ లు ఆడే అరుదైన అవకాశం కీర్తనకు దక్కింది.

ప్రస్తుత సీజన్ వేలం ద్వారా ముంబై సొంతం చేసుకొన్న ఐదుగురు ప్లేయర్లలో కీర్తనతో పాటు అమన్ దీప్ కౌర్, సంజన, ఫాతిమా జాఫర్, షబ్నం ఇస్మాయిల్ ఉన్నారు.

నాలుగుజట్లలో ఆడిన అనుభవం...

23 సంవత్సరాల కీర్తనకు తమిళనాడు మహిళలు, ఇండియన్ గ్రీన్, సౌత్ జోన్ మహిళల, ఆరెంజ్ డ్రాగన్ జట్లలో సభ్యురాలిగా ఆడిన అనుభవం ఉంది.

2021 -22 సీజన్ ఫ్రేయర్ కప్ టోర్నీలో కీర్తన మొత్తం 102 పరుగులు సాధించింది. 34 సగటుతో 86 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేసింది. బౌలర్ గా 4 వికెట్లు సైతం పడగొట్టింది. తమిళనాడు మహిళా వన్డే టోర్నీలో మూడుసార్లు మూడు వికెట్ల చొప్పున పడగొట్టగలిగింది.

అంతర్జాతీయ స్ట్రార్ ప్లేయర్లు హర్మన్ ప్రీత్, ఇస్సీ వాంగ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కీవెర్, అమెలియా కెర్ లతో కలసి ఆడే అరుదైన అవకాశాన్ని ముంబై జట్టులో చేరడం ద్వారా కీర్తన దక్కించుకోగలిగింది.

అందివచ్చిన ఈ అవకాశాన్ని కీర్తన పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగితే వచ్చే సీజన్ వేలం ద్వారా రెట్టింపు మొత్తం కాంట్రాక్టుగా పొందే అవకాశం లేకపోలేదు

Tags:    
Advertisement

Similar News