హైదరాబాద్ లో నేటినుంచే ఐపీఎల్ సందడి!
ఐపీఎల్ -16వ సీజన్ లో సన్ రైజర్స్ జట్టు హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ఈరోజు తొలిమ్యాచ్ జరుగనుంది.
ఐపీఎల్ -16వ సీజన్ లో సన్ రైజర్స్ జట్టు హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ఈరోజు తొలిమ్యాచ్ జరుగనుంది. పవర్ ఫుల్ రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ సవాలు విసురుతోంది.....
హైదరాబాద్ గడ్డపై సుదీర్ఘవిరామం తర్వాత ఐపీఎల్ సంరంభం ఈరోజు ప్రారంభం కానుంది. ప్రస్తుత 16వ సీజన్లో హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ జట్టుకు ఉప్పల్ రాజీవ్ స్టేడియం హోంగ్రౌండ్ గా ఉంది.
ప్రస్తుత సీజన్లో మొత్తం 7 రౌండ్ల మ్యాచ్ లకు రాజీవ్ స్టేడియం వేదిక కానుంది.
రైజర్స్ కు రాయల్స్ గండం!
ప్రస్తుత ఐపీఎల్ లో అత్యంత బలహీనంగా కనిపిస్తున్న హైదరాబాద్ సన్ రైజర్స్ తన తొలిరౌండ్ పోరులో గత సీజన్ రన్నరప్ పవర్ ఫుల్ రాజస్థాన్ రాయల్స్ తో సమరానికి సిద్ధమయ్యింది.
కెప్టెన్ ఎడెన్ మర్కరమ్ అందుబాటులో లేకపోడంతో సన్ రైజర్స్ జట్టు వెటరన్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాయకత్వంలో పోటీకి దిగుతోంది. భువనేశ్వర్ కుమార్ కు ఇప్పటి వరకూ 7 మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది.
వికెట్ కీపర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, అన్మోల్ ప్రీత్ సింగ్, అకిల్ హుస్సేన్,క్లాసెన్, రాహుల్ త్రిపాఠీల పైనే బ్యాటింగ్ లో ఆధారపడి ఉంది.
ఇక బౌలింగ్ లో మాత్రం సన్ రైజర్స్ అత్యంత సమతూకంతో కనిపిస్తోంది.
స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అదిల్ రషీద్, మయాంక్ మార్కండె, పేస్ త్రయం భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్సన్, ఉమ్రాన్ మాలిక్ లతో కూడిన బౌలింగ్ ఎటాక్ ప్రత్యర్థికి సవాలు విసురుతోంది.
రాయల్స్ కు ఆల్ రౌండర్ పవర్..
మరోవైపు..గతేడాది ఫైనలిస్ట్, సూపర్ హిట్టర్ సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ అత్యంత సమతూకంతో కనిపిస్తోంది.
పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన బౌలింగ్ తో ఉరకలేస్తోంది.
సూపర్ డూపర్ ఓపెనర్ జోస్ బట్లర్, స్పిన్ జాదూ జోడీ రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ లతో పాటు ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెకోయ్, నవదీప్ సైనీ, ఆడం జంపా, జో రూట్, దేవదత్ పడిక్కల్, హెట్ మేయర్ లతో రాయల్స్ భీకరంగా కనిపిస్తోంది.
మధ్యాహ్నం 3-30నుంచి మ్యాచ్...
మూడేళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సీజన్ తొలి ఐపీఎల్ మ్యాచ్ కోసం నిర్వాహక సంఘం విస్త్త్రుత ఏర్పాట్లు చేసింది. స్టేడియం కెపాసిటీ 55వేలు కాగా..
35వేల టికెట్లు విక్రయానికి ఉంచారు.
రాచకొండ పోలీసులు ఈ సీజన్లో జరిగే ఏడుమ్యాచ్ లకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
1500 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. స్టేడియం లోపల, వెలుపల మొత్తం 340 సీపీ కెమెరాలను అమర్చారు. జాయింట్ కమాండ్, కంట్రోల్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు.
ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే యువతులు, మహిళలు ఈవ్ టీజింగ్‌కు గురి కాకుండా చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. షీ టీమ్స్ కూడా నిఘా పెట్టనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 3-30 గంటలకు డే- మ్యాచ్ గా జరిగే ఈ పోరు ప్రారంభానికి మూడు గంటల కంటే ముందు స్టేడియం గేట్లను తెరుస్తారు.. నైట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు మాత్రం సాయంత్రం 4:30 గంటలకు స్టేడియం తెరవనున్నారు.
స్టేడియంలోకి అనుమతి లేని వస్తువులు..
ల్యాప్‌టాప్స్, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, మ్యాచ్ బాక్స్, లైటర్స్, పదునైన ఆయుధాలు, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యూలర్స్, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్స్, పర్‌ఫ్యూమ్స్, బ్యాగ్స్, తినుబండారాలను స్టేడియం లోపలికి అనుమతించ బోమని పోలీసుఅధికారులు ప్రకటించారు.
పవర్ ఫుల్ రాజస్థాన్ రాయల్స్, అంతంత మాత్రం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందా? లేక హోరాహోరీగా సాగుతుందా?..లేక సంచలనమే నమోదవుతుందో తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.