ఐపీఎల్ -16లో సీన్ రివర్స్!
ఐపీఎల్ -16 డబుల్ రౌండ్ రాబిన్ లీగ్..రెండో అంచె పోటీలలో పరిస్థితి తారుమారయ్యింది. వివిధజట్లకు సొంతగ్రౌండ్లో పరాజయాల పరంపర ప్రారంభమయ్యింది.
ఐపీఎల్ -16 డబుల్ రౌండ్ రాబిన్ లీగ్..రెండో అంచె పోటీలలో పరిస్థితి తారుమారయ్యింది. వివిధజట్లకు సొంతగ్రౌండ్లో పరాజయాల పరంపర ప్రారంభమయ్యింది...
దేశంలోని పలు నగరాలు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ -16 వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.10 జట్లతో 70 మ్యాచ్ లుగా జరుగుతున్న ఈ లీగ్ రెండోదశ పోటీలలో వివిధ జట్ల పరిస్థితి ఇంట గెలుపు, బయట ఓటమి అన్నట్లుగా తయారయ్యింది.
రాయల్ చాలెంజర్స్ హోం గ్రౌండ్ బెంగళూరులో లక్నో సూపర్ జెయింట్స్ నెగ్గితే...సూపర్ జెయింట్స్ హోంగ్రౌండ్ లక్నోలో రాయల్ చాలెంజర్స్ విజేతగా నిలిచింది.
ముంబై ఇండియన్స్ ను ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్ కంగు తినిపిస్త్తే..పంజాబ్ వేదికగా జరిగిన రెండో అంచెపోరులో ముంబై నెగ్గటం ద్వారా బదులు తీర్చుకొంది.
అంతేకాదు..నైట్ రైడర్స్ హోంగ్రౌండ్ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తే..నైట్ రైడర్స్ హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 5 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
హోంగ్రౌండ్లో సన్ రైజర్స్ డౌన్....
హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగిన 10వ రౌండ్ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ 5 పరుగుల తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ ను ఓడించడం ద్వారా దెబ్బకు దెబ్బతో బదులుతీర్చుకోగలిగింది.
ఈ కీలక పోరులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది.కెప్టెన్ నితీశ్ రాణా, నయా హిట్టర్ రింకూ సింగ్, ఆల్ రౌండర్ యాండ్రీ రసెల్, ఓపెనర్ జేసన్ రాయ్ రెండంకెల స్కోర్లు సాధించడం ద్వారా తమజట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించగలిగారు.
కెప్టెన్ నితీశ్ రాణా (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, ఒక సిక్సర్), రస్సెల్ (24; ఒక ఫోర్, రెండు సిక్సర్లు), జాసన్ రాయ్ (20) పరుగులు సాధించగా..ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (0), ఇంపాక్ట్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (7) విఫలమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లలో మీడియం పేసర్లు మార్కో జాన్సెన్, నటరాజన్ చెరో రెండు వికెట్లు, మర్కరం, భువనేశ్వర్, మార్కండే తలో వికెట్ పడగొట్టారు.
చేజింగ్ లో రైజర్స్ బోల్తా...
మ్యాచ్ నెగ్గాలంటే 172 పరుగులు చేయాల్సిన హైదరాబాద్ సన్ రైజర్స్ ..సొంతగ్రౌండ్లో దారుణంగా విఫలమయ్యింది.20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్ మయాంక్ అగర్వాల్(18) జోరుగానే తన ఇన్నింగ్స్ ప్రారంభించినా..త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అభిషేక్ శర్మ(9) రస్సెల్‌కు చిక్కాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి 20 పరుగుల స్కోరుకే రస్సెల్ ఓవర్లలోదొరికిపోయాడు. గత మ్యాచ్లో కోల్‌కతాపై సెంచరీ బాదిన హ్యారీ బ్రూక్ డకౌట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ మర్కరం (41 ) హెన్రిచ్ క్లాసెన్(34) ఐదో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యంతో పరిస్థితి చక్కదిద్దటానికి ప్రయత్నించారు.
30 బంతుల్లో 38 పరుగులు....
ఆఖరి ఐదు ఓవర్లలో 38 పరుగులు చేయాల్సిన సన్ రైజర్స్ ను కోల్ కతా బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఆఖరి 6 బంతుల్లో 9 పరుగుల లక్ష్యాన్ని సైతం సన్ రైజర్స్ బ్యాటర్లు సాధించలేకపోయారు. కేవలం మూడు పరుగులు మాత్రమే రాబట్టగలిగారు.
కెప్టెన్ మర్కరం 4 బౌండ్రీలతో 41 పరుగులు, క్లాసెన్ 20 బంతుల్లో 3 సిక్సర్లు, ఓ బౌండ్రీతో దూకుడుగా ఆడినా ప్రయోజనం లేకపోయింది.
కోల్‌కతా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
చేజింగ్ లో సన్ రైజర్స్ వెలవెల...
ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ 9 రౌండ్ల మ్యాచ్ ల్లో 5సార్లు చేజింగ్ కు దిగిన ఒక్కసారి మాత్రమే సఫలం కాగలిగింది. మిగిలిన నాలుగుసార్లు చేజింగ్ పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది.
2020 సీజన్ నుంచి కోల్ కతా ప్రత్యర్థిగా ఎనిమిదిసార్లు చేజింగ్ కు దిగిన సన్ రైజర్స్ 2 విజయాలు, 6 పరాజయాల రికార్డుతో నిలిచింది.
ఈరోజు జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగే మరో కీలక సమరంలో గతేడాది ఫైనలిస్టులు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7-30కి ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.