రోహిత్ '200' ఆనందం ఆవిరి!
ఐపీఎల్ -16వ సీజన్ ను గొప్పగా ప్రారంభించాలనుకొన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చుక్కెదురయ్యింది. కెప్టెన్ గా 200వ టీ-20 మ్యాచ్ లో ఘోరపరాజయం ఎదుర్కొన్నాడు.
ఐపీఎల్ -16వ సీజన్ ను గొప్పగా ప్రారంభించాలనుకొన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చుక్కెదురయ్యింది. కెప్టెన్ గా 200వ టీ-20 మ్యాచ్ లో ఘోరపరాజయం ఎదుర్కొన్నాడు....
ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలోనే అత్యధికసార్లు ముంబై ఇండియన్స్ ను విజేతగా నిలిపిన తొలి కెప్టెన్ రోహిత్ శర్మ. అంతేకాదు..ధూమ్ ధామ్ టీ-20 చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాటర్ గా, కెప్టెన్ గా నిలిచిన రోహిత్ కు 2023 సీజన్ తొలిమ్యాచ్ లోనే తీవ్రనిరాశ ఎదురయ్యింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ కెప్టెన్ గా రోహిత్ కెరియర్ లో 200వ మ్యాచ్ కావడం విశేషం.
టీ-20 క్రికెట్లో భారత్ తరపున అంతర్జాతీయమ్యాచ్ లతో పాటు ఐపీఎల్ గత 15 సీజన్లతో పాటు..ప్రస్తుత సీజన్ తొలిమ్యాచ్ తో కలుపుకొని 200 మ్యాచ్ ల్లో రోహిత్ సారథ్యం వహించడం ద్వారా..ఆల్ టైమ్ గ్రేట్ ధోనీ తర్వాతి స్థానంలో నిలిచాడు.
ధోనీ తర్వాతి స్థానంలో రోహిత్..
200 టీ-20 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన భారత తొలి క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కాగా..రోహిత్ శర్మ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. ధోనీ తన కెరియర్ లో భారతజట్టుతో పాటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సైతం మొత్తం 307 మ్యాచ్ ల్లో నాయకత్వం వహించాడు.
200 మ్యాచ్ లతో ధోనీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ మొత్తం 200 మ్యాచ్ ల్లో నాయకత్వం వహించడం ద్వారా ముంబైని ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలుపగలిగాడు.
గత 16 సీజన్లుగా చెన్నై సారథ్యం వహిస్తున్న ధోనీ మాత్రం నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని సాధించి పెట్టాడు.
అయితే..అంతర్జాతీయ క్రికెట్లో 200కు పైగా టీ-20 మ్యాచ్ ల్లో కెప్టెన్లుగా వ్యవహరించిన క్రికెటర్లలో వెస్టిండీస్ కు చెందిన డారెన్ సామీ ( 208 ) ఉన్నాడు. కేవలం ఐపీఎల్ లో 143 మ్యాచ్ ల్లో ముంబైకి నాయకత్వం అందించాడు.
ఐపీఎల్ చరిత్రలో 6వేల పరుగుల మైలురాయి చేరటానికి 121 పరుగుల దూరంలో ఉన్న రోహిత్...ప్రస్తుత సీజన్ ప్రారంభమ్యాచ్ లో 10 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగుకు అవుటై తీవ్రనిరాశలో పడిపోయాడు.
ముంబై పై బెంగళూరు హ్యాట్రిక్ విజయాలు..
చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన తన తొలిరౌండ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ముంబైని చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్ లో ముంబై టాపార్డర్ దారుణంగా విఫలమైనా..హైదరాబాద్ యంగ్ గన్ తిలక్ వర్మ ఫైటింగ్ హాఫ్ సెంచరీతో 171 పరుగుల స్కోరుతో పరువు దక్కించుకోగలిగింది.
అయితే..బౌలింగ్ లో మాత్రం ముంబై ఘోరవైఫల్యం చవిచూసింది.
బెంగళూరు ఓపెనింగ్ జోడీ డూప్లెసిస్- విరాట్ కొహ్లీ చెలరేగి ఆడి 70కి పైగా స్కోర్లు సాధించడం ద్వారా..తమజట్టుకు అలవోక విజయం అందించారు. 2020 సీజన్ నుంచి
బెంగళూరుతో ఇప్పటి వరకూ ఆరుసార్లు తలపడిన ముంబైకి ఇది వరుసగా మూడో ఓటమి, ఓవరాల్ గా నాలుగో పరాజయం కావడం విశేషం.
మొత్తం మీద..200 వ మ్యాచ్ లో నాయకత్వం వహించిన రోహిత్ శర్మ ఆనందం ..బ్యాటర్ గా, కెప్టెన్ గా విఫలం కావడంతో ఒక్కసారిగా ఆవిరైపోయింది.
ఈనెల 8న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండోరౌండ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.