ఐపీఎల్ -16 మొదటివారంలో రికార్డుల మోత!
ఐపీఎల్ 2023 సీజన్ మొదటివారం రోజుల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా జరిగిన మొత్తం తొమ్మిది మ్యాచ్ ల్లో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి.
ఐపీఎల్ 16వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటివారం రోజుల పోటీలు రికార్డుల మోతతో ముగిశాయి.
ఐపీఎల్ 2023 సీజన్ మొదటివారం రోజుల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా జరిగిన మొత్తం తొమ్మిది మ్యాచ్ ల్లో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రితురాజ్ గయక్వాడ్ బ్యాటింగ్ లో, లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ బౌలింగ్ లో, కోల్ కతా నైట్ రైడర్స్ అత్యధిక పరుగుల విజయంలోనూ, కేవలం 20 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించడంలో కోల్ కతా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ రికార్డులు నెలకొల్పారు.
శార్దూల్ ఠాకూర్ సునామీ హాఫ్ సెంచరీ...
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ నుంచి..కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా
బెంగళూరు రాయల్ చాలెంజర్స్- కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ముగిసిన 9వ మ్యాచ్ వరకూ పరుగుల హోరు, రికార్డుల జోరుగా సాగింది.
కోల్ కతా అతిపెద్ద విజయం...
మొదటివారం రోజుల పోటీలలో అతిపెద్ద విజయం నమోదు చేసిన జట్టుగా కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండోరౌండ్ పోరులో కోల్ కతా 81 పరుగులతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తు చేసింది.
అంతేకాదు..కోల్ కతా ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 44 బంతుల్లో 57 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో హాఫ్ సెంచరీ సాధించిన తొలి అఫ్గన్ బ్యాటర్ గా నిలిచాడు.
అంతేకాదు..కోల్ కతా పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరియర్ లోనే తొలి హాఫ్ సెంచరీ నమోదు చేయడం ద్వారా జంట రికార్డులు నెలకొల్పాడు.
20 బంతుల్లోనే అర్థశతకం బాదడం ద్వారా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ హీరో జోస్ బట్లర్ రికార్డును సమం చేశాడు.
శార్దూల్ 23 బంతుల్లోనే 3 సిక్సర్లు, 9 బౌండ్రీలతో 68 పరుగులు సాధించడంతో పాటు..అత్యుత్తమంగా 234. 48 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ లో ఇప్పటి వరకూ శార్ధూల్ దే అత్యధిక స్ట్ర్రయిక్ రేట్ కావడం విశేషం.
ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాశ్ శర్మ హిట్...
కోల్ కతా ఇంపాక్ట్ ప్లేయర్ గా బెంగళూరుపై బౌలింగ్ కు దిగిన మిస్టరీ స్పిన్నర్, 19 సంవత్సరాల సుయాశ్ శర్మ 33 పరుగులకే 3 వికెట్లు పడగొట్టడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగి కోల్ కతా విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
కోల్ కతా మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 15 పరుగులకే 4 వికెట్లు పడగొట్టడం ద్వారా తన కెరియర్ లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డు సాధించాడు.
సూపర్ ఓపెనర్ రితురాజ్ గయక్వాడ్...
ప్రస్తుత సీజన్ మొదటి తొమ్మిదిమ్యాచ్ ల్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రితురాజ్ గయక్వాడ్ టాపర్ గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్,
లోక్నో సూపర్ జెయింట్స్ జట్లపై హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా రితురాజ్ విజయవంతమైన ఓపెనర్ గా, అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు.
రితురాజ్ 7 బౌండ్రీలు, 13 సిక్సర్లతో సహా 149 పరుగులు సాధించాడు. అత్యుత్తమంగా 149 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో ముందు నిలిచాడు.
బౌలింగ్ లో మార్క్ వుడ్ టాప్....
మొదటి తొమ్మిదిరౌండ్ల మ్యాచ్ ల్లో అత్య్తుత్తమ బౌలర్ గా లక్నో సూపర్ జెయింట్స్ మెరుపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ నిలిచాడు. రెండుమ్యాచ్ ల్లో మార్క్ వుడ్ 8 వికెట్లు పడగొట్టాడు. తొలిరౌండ్ మ్యాచ్ లో 14 పరుగులకే 5 వికెట్లు సాధించడం ద్వారా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేయగలిగాడు.
రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ రెండుమ్యాచ్ ల్లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు సాధించిన భారత తొలిబౌలర్ గా నిలిచాడు.
చాహల్ తన కెరియర్ లో 122 మ్యాచ్ లు ఆడి 170 వికెట్లు పడగొట్టడం ద్వారా డ్వయన్ బ్రావో తర్వాతి స్థానంలో నిలిచాడు. అంతేకాదు..టీ-20 ఫార్మాట్లో 300 వికెట్ల మైలురాయిని సైతం చేరుకోగలిగాడు.
రోహిత్, శిఖర్, విరాట్ రికార్డులు...
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ లో ముంబైకి నాయకత్వం వహించడం ద్వారా..రోహిత్ శర్మ 200 టీ-20 మ్యాచ్ ల్లో నాయకత్వం వహించిన కెప్టెన్ గా నిలిచాడు.
బెంగళూరు మాజీ కెప్టెన్ కమ్ ఓపెనర్ విరాట్ కొహ్లీ..ముంబై ఇండియన్స్ పై అజేయ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీ-20ల్లో 50 అర్థశతకాలు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ భారీహాఫ్ సెంచరీ సాధించడం ద్వారా..ఐపీఎల్ లో అత్యధిక అర్థశతకాలు బాదిన భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.
అంతేకాదు..రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థిగా 23 ఇన్నింగ్స్ లో 7 హాఫ్ సెంచరీలతో 662 పరుగులు సాధించడం విశేషం.
అశ్విన్ ..వన్ టు టెన్ రికార్డు...
ఐపీఎల్ చరిత్రలో బ్యాటింగ్ ఆర్డర్లోని అన్నిస్థానాలలోనూ బ్యాటర్ గా దిగిన ఏకైక ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో అశ్విన్ ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
అశ్విన్ తన ఐపీఎల్ కెరియర్ లో ఒకసారి ఓపెనర్ గా, నాలుగుసార్లు వన్ డౌన్ బ్యాటర్ గా, ఒకసారి రెండోడౌన్ లోనూ, రెండుసార్లు 5వ నంబర్ స్థానంలోనూ, ఆరుసార్లు 6వ డౌన్, 16సార్లు 7వ డౌన్, 32 సార్లు 8వ డౌన్, 11సార్లు 9వ డౌన్ , 10సార్లు 10వ డౌన్ లోనూ బ్యాటింగ్ కు దిగిన ఘనత అశ్విన్ కు ఉంది.
మొత్తం 70 మ్యాచ్ ల ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి తొమ్మిది మ్యాచ్ ల్లోనే ఇన్ని రికార్డులు నమోదైతే..మిగిలిన 61 మ్యాచ్ ల్లో మరెన్ని సరికొత్త రికార్డులు వచ్చి చేరుతాయో మరి.