ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ లో గుజరాత్ తో నేడే చెన్నై ఢీ!
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7-30కి ప్రారంభమయ్యే క్వాలిఫైయర్ -1లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఐపీఎల్ -16 సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్లో అతిపెద్ద సమరానికి చెన్నై చెపాక్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 7-30కి ప్రారంభమయ్యే ఈ పోరులో లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్, రెండోస్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి...
ఐపీఎల్ -2023లో గత ఐదువారాలుగా సాగిన 70 మ్యాచ్ ల లీగ్ దశ పోటీలు ముగియటంతో..నాలుగుజట్ల ప్లే-ఆఫ్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7-30కి ప్రారంభమయ్యే క్వాలిఫైయర్ -1లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
గెలిస్తే ఫైనల్ బెర్త్, ఓడితే మరో చాన్స్!
ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్ నిబంధనలు..లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లకు అనుకూలంగా రూపొందించారు. ఏడువారాలలో 14 రౌండ్ల మ్యాచ్ లు ఆడి, నిలకడగా రాణించిన మొదటి రెండుజట్లకూ ప్లే-ఆఫ్ రౌండ్లో ఓటమి ఎదురైనా..ఫైనల్ చేరటానికి మరో అవకాశం ఉండేలా నిబంధనలను ఏర్పాటు చేశారు.
లీగ్ దశలో 14 మ్యాచ్ ల్లో 10 విజయాలు, 20 పాయింట్లతో టాపర్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, 8 విజయాలతో 17 పాయింట్లు సాధించడం ద్వారా రెండోస్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్లు..ఫైనల్లో చోటు కోసం జరిగే క్వాలిఫైయర్ -1లో తలపడనున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ పోరులో నెగ్గినజట్టు నేరుగా టైటిల్ సమరానికి అర్హత సాధించగలుగుతుంది. ఓడినజట్టుకు ఫైనల్ చేరటానికి మరో అవకాశం ఉంటుంది.
ముంబై- లక్నోజట్ల మధ్య ఈనెల 24న జరిగే ఎలిమినేటర్ రౌండ్లో నెగ్గిన జట్టుతో...ఫైనల్లో రెండో బెర్త్ కోసం క్వాలిఫైయర్ -1లో ఓడినజట్టు పోటీపడాల్సి ఉంది.
స్ధానంబలంతో చెన్నై...ఆల్ రౌండ్ పవర్ తో గుజరాత్...
మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 12వసారి ప్లే-ఆఫ్ రౌండ్ చేరటం ద్వారా ప్రస్తుత సీజన్ లీగ్ ద్వారా ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ నెగ్గిన సూపర్ కింగ్స్...ఐదోటైటిల్ కు గురిపెట్టింది. అంతేకాదు..ప్రస్తుత చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో ఇప్పటి వరకూ మూడుసార్లు తలపడిన చెన్నైకి మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ ఓటమి ఎదురయ్యింది.
ఈ రోజు జరిగే తొలిక్వాలిఫైయర్ లో గుజరాత్ ను ఓడించితీరాలన్న పట్టుదలతో సూపర్ కింగ్స్ ఉంది. ఓపెనర్లు డేవిడ్ కాన్వే- రుతురాజ్ గయక్వాడ్, యువహిట్టర్ శివం దూబే సూపర్ ఫామ్ లో ఉండటంతో గుజరాత్ బౌలర్లకు గట్టిపోటీ తప్పదు. అంబటి రాయుడు సైతం ఈ కీలక పోరులో రాణించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
స్పిన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, మోయిన్ అలీ సైతం కీలకపాత్ర పోషించబోతున్నారు. పవర్ ప్లే-ఓవర్లలో వికెట్లు పడగొట్టడంలో స్పెషలిస్టుగా పేరుపొందిన తుషార్ దేశ్ పాండే, యార్కర్లకింగ్ మతీష పతిరన, స్పిన్నర్ మహేష్ తీక్షణ కూడా గుజరాత్ బ్యాటర్లకు సవాలు విసరనున్నారు. దీనికితోడు తెలివైన, కూల్ కూల్ కెప్టెన్ గా పేరున్న మహేంద్రసింగ్ ధోనీ తన వ్యూహాలతో టైటాన్స్ ఏ విధంగా కట్టడి చేయగలడన్నదే కీలకంకానుంది.
గుజరాత్ బ్యాటింగ్ పవర్ స్టార్ శుభ్ మన్...
మరోవైపు..గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలలో ప్రధానపాత్ర వహిస్తున్న డాషింగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కళ్లు చెదిరే ఫామ్ లో ఉన్నాడు. లీగ్ చివరి రెండు రౌండ్లలోనూ సెంచరీలు బాదిన శుభ్ మన్ ను తక్కువ స్కోరుకే అవుట్ చేయకుంటే...చెన్నైకి కష్టాలు తప్పవు. సూపర్ హిట్టర్ విజయ్ శంకర్ సైతం టైటాన్స్ బ్యాటింగ్ కు కొండంత అండగా ఉంటూ వస్తున్నాడు. మ్యాచ్ ఫినిషర్ పాత్రను డేవిడ్ మిల్లర్ నిర్వర్తించనున్నాడు.
బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది, మహ్మద్ షమీ, జోషువా లిటిల్, మోహిత్ శర్మ, స్పిన్ జోడీ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లతో భీకరంగా తయారయ్యింది.
చెన్నై 10వసారి ఐపీఎల్ ఫైనల్ చేరాలంటే...గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనడంతో పాటు..గుజరాత్ బ్యాటర్లు..ప్రధానంగా సూపర్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ను అదుపుచేసి తీరక తప్పదు.
ప్రత్యర్థివేదికల్లో జరిగిన లీగ్ 7 మ్యాచ్ ల్లో ఆరు విజయాలు సాథించిన గుజరాత్ టైటాన్స్..ప్రస్తుత సీజన్లో చెన్నై వేదికగా తొలిసారిగా కీలకమ్యాచ్ ఆడనుంది.
ఈమ్యాచ్ కు సిద్ధం చేసిన పిచ్ పైన 180 నుంచి 200 పరుగుల వరకూ స్కోరు రావచ్చని క్యూరేటర్ చెబుతున్నారు. టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచన లేకుండా..ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి.
ఈ కీలకపోరులో ఓడినా రెండుజట్లకూ ఫైనల్ చేరటానికి మరో అవకాశం ఉండటంతో..ఎలాంటి ఒత్తిడి లేకుండా క్వాలిఫైయర్ తొలిసమరంలో తలపడనున్నాయి.
చెపాక్ స్టేడియం వేదికగా తలైవా ధోనీకి ఇదే ఆఖరిమ్యాచ్ కావడంతో భారీసంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. రెండుసమానబలం కలిగిన జట్ల ఈ పోరు..ప్రస్తుత ఐపీఎల్ కే హైలైట్ మ్యాచ్ గా నిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.