ఐపీఎల్ -16లో ఇక ప్లే-ఆఫ్ సమరం!
దేశవ్యాప్తంగా గత ఏడువారాలుగా వివిధనగరాలలో సందడి సందడి చేసిన ఐపీఎల్ -16వ సీజన్ షోలో తొలిఘట్టం లీగ్ దశ పోటీలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తెరపడింది.
దేశవ్యాప్తంగా గత ఏడువారాలుగా వివిధనగరాలలో సందడి సందడి చేసిన ఐపీఎల్ -16వ సీజన్ షోలో తొలిఘట్టం లీగ్ దశ పోటీలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తెరపడింది.
గెలుపుతో మొదలు..గెలుపుతే ముగింపు!
ఐపీఎల్ -16వ సీజన్ పోటీలను మూడేళ్ల విరామం తర్వాత ఇంటా-బయటా పద్ధతిలో నిర్వహించారు. మొత్తం 10 జట్లు, 70 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ను దేశంలోని 10 నగరాలకు చెందిన 12 వేదికల్లో నిర్వహించారు.
మార్చి 31న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన సీజన్ ప్రారంభమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను 5 వికెట్లతో ఓడించడం ద్వారా డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ వేట మొదలు పెట్టింది.
మొత్తం 14 రౌండ్లలో గుజరాత్ టైటాన్స్ 10 విజయాలు, 4 పరాజయాలతో 20 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా ప్లే-ఆఫ్ రౌండ్లో అడుగుపెట్టింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో విజేతగా నిలవడం ద్వారా లీగ్ పోటీలను టైటాన్స్ ముగించింది.
తొలిమ్యాచ్ ను, ఆఖరిమ్యాచ్ ను విజయాలతోనే ముగించడం ద్వారా..తొలి క్వాలిఫైయర్ సమరానికి గుజరాత్ టైటాన్స్ సిద్ధమయ్యింది.
ముంబై ఇండియన్స్ కు ప్లే-ఆఫ్ ఆఖరి బెర్త్..
ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూలేనంత హోరాహోరీగా సాగిన ప్రస్తుత 16వ సీజన్ లీగ్ లో మొత్తం 10 జట్లు భీకరంగా తలపడ్డాయి. కీలక సమయాలలో తడబడకుండా నిలకడగా రాణించిన నాలుగుజట్లూ ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరగలిగాయి.
గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిస్తే...చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి.
గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు సైతం ప్లే-ఆఫ్ రౌండ్ చేరడంలో విఫలమయ్యాయి.
లీగ్ తొలిదశలో జోరుమీద కనిపించిన రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నిలకడలేమికి భారీమూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.
ప్రతిభకు అదృష్టం కూడా తోడై లక్నో సూపర్ జెయింట్స్ ..లీగ్ టేబుల్ మూడో స్థానంలో నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ చేరితే...బౌలింగ్ అంతంత మాత్రంగానే ఉన్నా, బ్యాటింగ్ బలంతోనే మ్యాచ్ లు నెగ్గుతూ రావడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ ఆఖరి బెర్త్ ను ముంబై ఖాయం చేసుకోగలిగింది.
నాలుగుసార్లు 200కు పైగా లక్ష్యాలను అధిగమించిన తొలిజట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
గుజరాత్ టైటాన్స్ 20,చెన్నై సూపర్ కింగ్స్ 17 పాయింట్లు, లక్నో సూపర్ జెయింట్స్ 17 పాయింట్లు, ముంబై ఇండియన్స్ 16 పాయింట్లు సాధించడం ద్వారా మొదటి నాలుగు స్థానాలలో నిలిచాయి.
రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చెరో 14 పాయింట్లతో 5, 6 స్థానాలతో సరిపెట్టుకొన్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ 12 పాయింట్లతో 7,పంజాబ్ కింగ్స్ సైతం 12 పాయింట్లతో ఎనిమిది, 10 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ 9, హైదరాబాద్ సన్ రైజర్స్ 8 పాయింట్లతో పది స్థానాలకు పరిమితమయ్యాయి.
చెన్నై వేదికగా తొలి క్వాలిఫైయర్...
నాలుగుజట్లు..మూడుమ్యాచ్ ల ప్లే-ఆఫ్ రౌండ్ మే 23 నుంచి మే 26 వరకూ జరుగనుంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా నిలిచింది.
మే23న జరిగే ఈ పోరులో లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ తో రెండోస్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఈ పోరులో నెగ్గినజట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడినజట్టుకు ఫైనల్ చేరటానికి మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫైయర్ -2లో పోటీపడే అదనపు అవకాశం ఉంటుంది.
మే 24న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగానే జరిగే ఎలిమినేటర్ రౌండ్లో లీగ్ టేబుల్ మూడు, నాలుగుస్థానాలలో నిలిచిన లక్నో, ముంబైజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ పోరులో నెగ్గినజట్టు క్వాలిఫైయర్-2 కు చేరుకొంటే..ఓడినజట్టు టోర్నీ నుంచి నిష్క్ర్రమించాల్సి వస్తుంది.
అహ్మదాబాద్ లో క్వాలిఫైయర్-2
క్వాలిఫైయర్ -1లో ఓడిన జట్టుకు, ఎలిమినేటర్ రౌండ్లో నెగ్గిన జట్టుకు..మే 26న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జరుగుతుంది.
ఈమ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్స్ చేరితే..ఓడిన జట్టు ఇంటిదారి పట్టక తప్పదు.
మే 28న ఐపీఎల్ ఫైనల్స్...
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మే 28న సూపర్ సండే ఫైట్ గా ఐపీఎల్ -16 సీజన్ ఫైనల్స్ నిర్వహిస్తారు. క్వాలిఫైయర్ -1, క్వాలిఫైయర్ -2లో విజేతలుగా నిలిచిన జట్లు టైటిల్ సమరంలో పోటీపడతాయి.
దీంతో 7 వారాల ఐపీఎల్ 16వ సీజన్ సమరానికి తెరపడుతుంది.