ఐదు ఓటముల తర్వాత ఢిల్లీ తొలిగెలుపు!

ఐపీఎల్ -2023 సీజన్ లీగ్ మొదటి ఐదుమ్యాచ్ ల్లో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ క్యాపిటల్స్ 6వ రౌండ్ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా ఊపిరిపీల్చుకొంది.

Advertisement
Update:2023-04-21 11:59 IST

ఐదు ఓటముల తర్వాత ఢిల్లీ తొలిగెలుపు!

ఐపీఎల్ -16 డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తొలివిజయం సాధించింది. లోస్కోరింగ్ సమరంలో కోల్ కతా నైట్ రైడర్స్ ను 4 వికెట్లతో అధిగమించింది..

ఐపీఎల్ -2023 సీజన్ లీగ్ మొదటి ఐదుమ్యాచ్ ల్లో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ క్యాపిటల్స్ 6వ రౌండ్ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా ఊపిరిపీల్చుకొంది.

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన లోస్కోరింగ్ పోరులో ఢిల్లీ 4 వికెట్లతో కోల్ కతాను కంగుతినిపించింది.

కోల్ కతాకు ఇశాంత్ పగ్గాలు..

ఈ కీలక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతాను ఢిల్లీ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ దెబ్బ కొట్టాడు. పవర్ ప్లే ఓవర్లలోనే కోల్ కతాకు 2 వికెట్లతో ఇశాంత్ పగ్గాలు వేశాడు.

జేసన్ రాయ్- లిట్టన్ దాస్ లతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కోల్ కతాకు ఏమాత్రం కలసి రాలేదు. ఓపెన‌ర్ లిట్ట‌న్ దాస్ (4)ను రెండో ఓవ‌ర్‌లో ముఖేశ్ కుమార్ పడగొట్టాడు. గ‌త మ్యాచ్‌లో సెంచ‌రీబాదిన వెంక‌టేశ్ అయ్యర్(0)ని ఫాస్ట్ బౌలర్ నోర్జే డ‌కౌట్ చేశాడు. ఆ త‌ర్వాత కెప్టెన్ నితీశ్‌ రానా(4)ను ఇషాంత్ శ‌ర్మ పెవీలియన్ దారి పట్టించాడు. దీంతో కోల్ కతా 32 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయి చిక్కుల్లో పడింది.

మిడిలార్డర్ బ్యాటర్లు మ‌న్‌దీప్ సింగ్(12)ను అక్ష‌ర్ ప‌టేల్ క్లీన్ బౌల్డ్ చేయగా. వీరబాదుడు రింకూ సింగ్(5), సునీల్ న‌రైన్‌(4) విఫ‌ల‌మ‌య్యారు. 70 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయిన కోల్ కతాను ఓపెనర్ జేస‌న్ రాయ్(43), ఆల్ రౌండర్ ఆండ్రూ ర‌స్సెల్(38) ఆదుకున్నారు. అయితే… కుల్దీప్ యాద‌వ్ 15వ ఓవ‌ర్‌లో వ‌రుస బంతుల్లో జేస‌న్ రాయ్(43), ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రాయ్‌(0)ను ఔట్ చేశాడు. ముఖేశ్ కుమార్ వేసిన 20వ ఓవ‌ర్‌లో ఆండ్రూ ర‌స్సెల్(38) వరుసగా మూడు సిక్సర్లు బాదడం ద్వారా తనజట్టు 19 కీలక పరుగులు అందించాడు.

ఆఖ‌రి బంతికి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ర‌నౌటయ్యాడు. దాంతో కోల్‌క‌తా 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్, ఇషాంత్ శ‌ర్మ, నోర్జే , అక్ష‌ర్ ప‌టేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఢిల్లీని గెలిపించిన కెప్టెన్ వార్నర్..

128 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఢిల్లీ సైతం పరుగుల కోసం శ్రమించాల్సి వచ్చింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి

41 బంతుల్లో 11 బౌండ్రీలతో 57 పరుగులతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ఢిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులతో తొలి విజయం సొంతం చేసుకొంది.

మరో ఓపెనర్ పృథ్వీ షా (13), మిషెల్‌ మార్ష్‌ (2), ఫిల్‌ సాల్ట్‌ (5) విఫలమయ్యారు. ఆఖర్లో మనీశ్‌ పాండే (21), అక్షర్‌ (19 నాటౌట్‌) పోరాడారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, అనుకూల్‌ రాయ్‌, నితీశ్‌ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ప్రస్తుత సీజన్లో తన తొలిమ్యాచ్ లోనే సత్తా చాటుకొన్న ఢిల్లీ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఢిల్లీ క్యాపిటల్స్ చీఫ్ కోచ్ రికీ పాంటింగ్, డైరెక్టర్ సౌరవ్ గంగూలీ..తమ జట్టు తొలిగెలుపుతో ఊపిరిపీల్చుకోగలిగారు.

Tags:    
Advertisement

Similar News