ప్లే-ఆఫ్ రౌండ్లో చెన్నై ' సూపర్ ' రికార్డు!

మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 12వసారి ప్లే-ఆఫ్ రౌండ్ చేరి సంచలనం సృష్టించింది.

Advertisement
Update:2023-05-21 15:25 IST

ప్లే-ఆఫ్ రౌండ్లో చెన్నై ' సూపర్ ' రికార్డు!

మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 12వసారి ప్లే-ఆఫ్ రౌండ్ చేరి సంచలనం సృష్టించింది.

ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేట్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ తన రికార్డును తానే అధిగమించింది. 2023 సీజన్ లీగ్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరటం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 16వ సీజన్ లీగ్ వరకూ 14 టోర్నీలలో పాల్గొన్న చెన్నై 12సార్లు ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలి, ఒకేఒక్కజట్టుగా నిలిచింది.

ఆఖరి రౌండ్లో చెన్నై విశ్వరూపం...

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన 14వ రౌండ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విశ్వరూపం ప్రదర్శించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను 77 పరుగులతో చిత్తు చేయడం ద్వారా లీగ్ టేబుల్ రన్నరప్ గా ప్లే-ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకొంది.

ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ రికార్డుస్థాయిలో 223 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థి ఎదుట 224 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

ఓపెనర్ల బాదుడే బాదుడు...

ఈ కీలక పోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న చెన్నైకి ఓపెనింగ్ జోడీ రుతురాజ్ గయక్వాడ్- డేవన్ కాన్వే 141 పరుగుల భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.

డేవన్ కాన్వే 87 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 3 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 79 పరుగుల నాటౌట్ తో వీరవిహారం చేశారు.

యువ హిట్టర్ శివం దూబే కేవలం 9 బంతుల్లోనే 3 సిక్సర్లతో 22 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్లో ర‌వీంద్ర జ‌డేజా సైతం బ్యాటు ఝళిపించడంతో చెన్నై 3 వికెట్లకు 223 ప‌రుగుల భారీస్కోరు చేయగలిగింది.

ఐపీఎల్ చరిత్రలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న సమయంలో 22సార్లు 200కు పైగా స్కోర్లు సాధించిన తొలిజట్టుగా కూడా చెన్నై మరో సూపర్ రికార్డు నమోదు చేసింది.

ఢిల్లీ బౌలర్లల చేతన్ సకారియా, నోర్కే, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

వార్నర్ ఒంటరిపోరాటం....

మ్యాచ్ నెగ్గాలంటే 224 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన ఢిల్లీ 146 పరుగులకే పరిమితమయ్యింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక్కడే పోరాడినా..మిగిలిన బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు.

వార్నర్ 58 బంతుల్లో 5 సిక్సర్లు, 7 బౌండ్రీలతో 86 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీలతో చెలరేగిన యువ ఓపెనర్ పృధ్వీషా ను దీప‌క్ చాహర్ 5 పరుగుల స్కోరుకే పడగొట్టాడు. ర్యాలీ రూసో, సాల్ట్ సైతం ఒకరి వెనుక ఒకరుగా అవుటయ్యారు.

మరోవైపు..కెప్టెన్ వార్నర్ మాత్రం స్పిన్నర్ ర‌వీంద్ర జ‌డేజా వేసిన 13వ ఓవ‌ర్లో రెచ్చిపోయాడు. రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. య‌శ్ ధూల్(15), అక్ష‌ర్ ప‌టేల్‌(15), ల‌లిత్ యాద‌వ్(6), అమ‌న్ హ‌కీం ఖాన్(7) విఫ‌ల‌య‌మ్యారు .

చెన్నై బౌలర్లలో దీప‌క్ చాహ‌ర్ 2, ప‌థిర‌న‌, తీక్ష‌ణ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. జ‌డేజా, దేశ్‌పాండేలకు ఒక్కో వికెట్ ద‌క్కింది.

చెన్నై విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ప్లే- ఆఫ్ రౌండ్ చేరిన చెన్నై..క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఒక్క పరుగుతో నెగ్గిన లక్నో...

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మరో కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్కపరుగు తేడాతో ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ పై సంచలన విజయంతో ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలంటే నెగ్గితీరాల్సిన ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగుల స్కోరు సాధించింది.

ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ 28 పరుగులు, ప్రేరక్‌ మన్కడ్ (26), ఆయుష్‌ బదోనీ (25) పరుగులకు అవుట్ కాగా...వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ 30 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 5 సిక్సర్లు, 4 బౌండ్రీలతో 58 పరుగులు సాధించాడు. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌, శార్దూల్‌, వైభవ్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.

రింకూసింగ్ పోరాటం వృథా..

మ్యాచ్ నెగ్గాలంటే 177 పరుగులు చేయాల్సిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆఖరి 12 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన కోల్ కతా 40 పరుగుల మాత్రమే రాబట్టగలిగింది.

మ్యాచ్ ఫినిషర్, సూపర్ హిట్టర్ రింకూ సింగ్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. ఓపెనర్ జేసన్ రాయ్ 45 పరుగులతో రాణించినా..మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

లక్నో బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌, యష్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది

లక్నో మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ ల్లో 8 విజయాలతో 17 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ మూడోస్థానంలో నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ 14 రౌండ్లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 7వ స్థానానికి పరిమితమయ్యింది.

ప్లే-ఆఫ్ రౌండ్లో నాలుగోస్థానం సాధించిన జట్టుతో జరిగే ఎలిమినేటర్ రౌండ్లో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.

Tags:    
Advertisement

Similar News