రాహుల్ హిట్...చేజింగ్ లో లక్నో ఫట్!
ఐపీఎల్ -16వ సీజన్లో సీన్ మారింది. లోస్కోరింగ్ మ్యాచ్ ల్లో చేజింగ్ కు దిగిన జట్ల పరాజయాల పరంపర ప్రారంభమయ్యింది. 136 పరుగుల స్వల్పలక్ష్యాన్ని చేధించలేక గుజరాత్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ 7 పరుగుల ఓటమి చవిచూసింది.
ఐపీఎల్ -16వ సీజన్లో సీన్ మారింది. లోస్కోరింగ్ మ్యాచ్ ల్లో చేజింగ్ కు దిగిన జట్ల పరాజయాల పరంపర ప్రారంభమయ్యింది. 136 పరుగుల స్వల్పలక్ష్యాన్ని చేధించలేక గుజరాత్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ 7 పరుగుల ఓటమి చవిచూసింది.
దేశవ్యాప్తంగా 12 వేదికల్లో జరుగుతున్న ఐపీఎల్ -16వ సీజన్ లో ట్రెండ్ మారింది. మొదటి 25 మ్యాచ్ ల వరకూ భారీస్కోరింగ్ మ్యాచ్ లతో పరుగుల మోత మోగించిన జట్లు..ఆ తర్వాత నుంచి లోస్కోరింగ్ వార్ లో చతికిలబడిపోతున్నాయి.
జైపూర్ వేదికగా జరిగిన పోరులో లక్నో చేతిలో 10 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడితే..కోల్ కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల విజయం సాధించిన కొద్ది గంటల్లోనే ముగిసిన మరో లోస్కోరింగ్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 7 పరుగులతో లక్నో సూపర్ జెయింట్స్ పై సంచలన విజయం సాధించింది.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా జరిగిన మరో లోస్కోరింగ్ థ్రిల్లర్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 135 పరుగులకే పరిమితమైతే ..సమాధానంగా ఆతిథ్య..లక్నో 128 పరుగులకే కుప్పకూలింది.
గుజరాత్ కు ఊపిరి పోసిన పాండ్యా...
అంతకు ముందు టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటన్స్ భారీ స్కోర్ సాధించలేకపోయింది. స్లో వికెట్ పై లక్నో బౌలర్ల ధాటికి 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా అర్థ శతకంలో రాణించగా..ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(47) పరుగులతో జట్టు పరువు దక్కించాడు. యువఓపెనర్ శుభ్ మన్ గిల్ డకౌట్ గా వెనుదిరిగాడు. సాహా (47, 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (66, 4 సిక్సులు, 2 ఫోర్లు) గుజరాత్ టాపర్లుగా నిలిచారు.
మిగతా బ్యాటర్లలో విజయ్ శంకర్ (10, ఒక ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. గిల్ పరుగుల ఖాతా తెరుకుండానే ఔటయ్యాడు. అభినవ్ మనోహర్ (3), డేవిడ్ మిల్లర్ (6), రాహుల్ తెవాటియా (2) పూర్తిగా విఫలమయ్యారు.
లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా, స్టోయినిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
రాహుల్ రాణించినా లక్నో చిత్తు...
136 పరుగుల స్వల్పలక్ష్యంతో చేజింగ్ కు దిగిన లక్నో చక్కటి ఆరంభాన్ని చేసినా..మిడిల్ ఓవర్లలో దారుణంగా విఫలమయ్యింది. కెప్టెన్ రాహుల్ ( 68), ఓపెనర్ కీల్ మేయర్స్ 24, వన్ డౌన్ కృణాల్ పాండ్యా 23 మినహా మిగిలిన బ్యాటర్లంతా రెండంకెల స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు.
కెఎల్ రాహుల్ 61 బంతుల్లో 8 బౌండ్రీలతో 68 పరుగులు సాధించినా తనజట్టును విజేతగా నిలుపలేకపోయాడు.
పవర్ ప్లే తర్వాత తొలి బంతికే సూపర్ హిట్టర్ కైల్ మేయర్స్(24)ను లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో, 55 పరుగుల స్కోరుకు లక్నో తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత రాహుల్, కృనాల్ పాండ్యా(23)తో కెప్టెన్ రాహుల్ కలసి 50 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు చిగురింప చేశాడు. లక్నో విజయం ఖాయమనుకొన్న దశలో గుజరాత్ బౌలర్లు కట్టడి చేశారు. డాట్ బాల్స్ తో ఒత్తిడి పెంచారు. మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఔట్ చేసి లక్నోపై ఒత్తిడి పెంచారు.
ఆఖరి ఓవర్లో మోహిత్ మ్యాజిక్....
ఇన్నింగ్స్ 19వ ఓవర్ ను సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గొప్పగా ముగించడంతో..ఆఖరి ఓవర్ ను వేసే బాధ్యత మీడియం పేసర్ మోహిత్ శర్మ పైన పడింది. అప్పటికే విజయానికి చేరువైన లక్నోను మోహిత్ దెబ్బ మీద దెబ్బ కొట్టి 7 పరుగుల పరాజయంతో కంగు తినిపించాడు.
మోహిత్ శర్మ వేసిన 20 ఓవర్‌లో రెండో బంతికే కేఎల్ రాహుల్(68) క్యాచ్ ఔటయ్యాడు. తర్వాత బంతికే ఆల్ రౌండర్ స్టోయినిస్ డకౌటయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగుల కోసం ప్రయత్నించి ఆయుష్ బదౌని(8) రనౌటయ్యాడు. ఐదో బంతికి దీపక్ హుడా సైతం రనౌట్ గా చిక్కాడు. మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి బంతికి 8 పరుగులు చేయాల్సిన లక్నో ఒక్క పరుగూ రాబట్టలేకపోయింది. లక్నో బౌలర్లలో మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ చెరో రెండువికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
3 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన మోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
లక్నోసూపర్ జెయింట్స్ కు 7 మ్యాచ్ ల్లో ఇది మూడో ఓటమి కాగా..గుజరాత్ టైటాన్స్ కు 6 మ్యాచ్ ల్లో ఇది నాలుగో గెలుపు కావడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారానే లక్నో కెప్టెన్ రాహుల్ అత్యంత వేగంగా 7వేల పరుగుల మైలురాయిని చేరిన ఐపీఎల్ తొలి బ్యాటర్ గా సరికొత్తరికార్డు నెలకొల్పాడు.