గుజరాత్ టాప్..పంజాబ్ ఫ్లాప్!

ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ 4వ రౌండ్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల విజయంతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

Advertisement
Update:2023-04-14 14:07 IST

ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ 4వ రౌండ్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల విజయంతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది..

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ లో గతేడాది విన్నర్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది. 10 జట్లు..70 మ్యాచ్ ల లీగ్ 4వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి గుజరాత్, రాజస్థాన్ చెరో మూడు విజయాలు, 6 పాయింట్లతో లీగ్ టేబుల్ సంయుక్త అగ్రస్థానంలో నిలిచాయి.

పంజాబ్ కు దెబ్బ మీద దెబ్బ....

లీగ్ మొదటి రెండుమ్యాచ్ ల్లో సంచలన విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ కు ఆ తర్వాతి రెండురౌండ్లలో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ వేదికగా ముగిసిన మూడోరౌండ్లో సన్ రైజర్స్ చేతిలో కంగు తిన్న పంజాబ్ కు...హోంగ్రౌండ్ మొహాలీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన నాలుగోరౌండ్ పోరులో సైతం 6 వికెట్ల పరాజయం తప్పలేదు.

టాపార్డర్ టపటపా.....

ఈ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు గుజరాత్ టైటాన్స్ పగ్గాలు వేసింది. టాపార్డర్ లో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ డకౌట్ కాగా..కెప్టెన్ శిఖర్ ధావన్ 8 పరుగులకే అవుట్ కావడంతో పంజాబ్ తేరుకోలేకపోయింది. మ్యాచ్ తొలి ఓవర్లోనే గుజరాత్ ఓపెనింగ్ బౌలర్ ష‌మీ వికెట్ పడగొట్టాడు. రెండో బంతికే ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్(0)ను బౌల్డ్ చేశాడు. గ‌త మ్యాచ్‌లో 99 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన శిఖ‌ర్ ధావ‌న్ కేవలం 8 పరుగుల స్కోరుకే చిక్కాడు.

దీంతో ఎదురీత మొదలు పెట్టిన పంజాబ్‌ను మాథ్యూ షార్ట్(36), భానుక రాజ‌ప‌క్సే(20) కొంతమేరకు ఆదుకున్నారు.

ప‌వ‌ర్ ప్లేలో పంజాబ్ రెండు వికెట్ల న‌ష్టానికి 52 పరుగులతో చేసింది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 25 పరుగులు జత చేశారు. అయితే జోరు మీదున్న షార్ట్ ను లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ సూపర్ గుగ్లీతో పెవీలియన్ దారి పట్టించాడు.

మిడిలార్డర్ ఆటగాడు జితేశ్ శ‌ర్మ 25 పరుగులకు అవుట్ కావడంతో ..డెత్ ఓవర్లలో సామ్ క‌ర‌న్‌, షారుక్ ధాటిగా ఆడారు.జోష్ లిటిల్ వేసిన 20వ ఓవ‌ర్‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్(8) చెల‌రేగాడు. లాంగాన్‌లో 89 మీట‌ర్ల‌ సిక్స్ కొట్టాడు. షారుక్ ఖాన్(22) రెండో ప‌రుగుకు ప్ర‌య‌త్నించి ర‌నౌట‌య్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల న‌ష్టానికి 153 పరుగుల స్కోరు నమోదు చేసింది.

పంజాబ్ బ్యాట‌ర్లలో మాథ్యూ షార్ట్(36), జితేశ్ శ‌ర్మ‌(25), సామ్ క‌ర‌న్(22),షారుక్ ఖాన్(22) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగలిగారు.

గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌లో మోహిత్ శ‌ర్మ రెండు, అల్జారీ జోసెఫ్‌ ష‌మీ, ర‌షీద్ ఖాన్, జోష్ లిటిల్ త‌లా ఒక వికెట్‌ పడగొట్టారు.

శుభ్ మన్ గిల్ జోరుతో గుజరాత్ గెలుపు..

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 154 పరుగులు చేయాల్సిన గుజరాత్‌ టైటాన్స్‌ ఆఖరి ఓవర్ విజయం సాధించింది. 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులతో విజేతగా నిలిచింది.

ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(67), వృద్ధిమాన్ సాహా(30), తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సాహాను రబడ పడగొట్టడంతో గుజరాత్ తొలివికెట్ నష్టపోయింది. వన్ డౌన్ బ్యాటర్ సుద‌ర్శ‌న్(19)తో క‌లిసి గిల్‌ రెండో వికెట్ కు జోరుగా పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్లో అర్ష్‌దీప్ సింగ్ వికెట్ తీసి గుజరాత్ కు పగ్గాలు వేశాడు. అయితే శుభ్ మన్ గిల్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడి 40 బంతుల్లో 6 ఫోర్ల‌తో అర్థశతకం పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 8 పరుగులకే వెనుదిరిగాడు.

సామ్ క‌ర‌న్ వేసిన 20వ ఓవ‌ర్లో ఏడు ప‌రుగులు చేయాల్సిన స్థితిలో రెండో బంతికే శుభ్‌మ‌న్ గిల్ 67 పరుగుల స్కోరుకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, స్టేడియం హోరెత్తిపోయింది. రాహుల్ తెవాటియా కీలక బౌండ్రీతో గుజ‌రాత్‌ విజయాన్ని కైవసం చేసుకోగలిగింది. డేవిడ్ మిల్ల‌ర్ 17 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు.

పంజాబ్ బౌల‌ర్ల‌లో క‌గిసో ర‌బాడ‌, హ‌ర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, సామ్ క‌ర‌న్ తలో వికెట్ పడగొట్టారు. వికెట్ తీశారు.

మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ బరిలోకి దిగిన మోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

మొదటి నాలుగు మ్యాచ్ ల్లో గుజరాత్ కు ఇది మూడో గెలుపు కాగా..పంజాబ్ రెండు విజయాలు, రెండు పరాజయాల రికార్డుతో మిగిలింది.

రౌండ్ రాబిన్ లీగ్‌లో భాగంగా ఈరోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7-30కి జరిగే పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతుంది.

Tags:    
Advertisement

Similar News