గుజరాత్‌ జోరు..ఢిల్లీ బేజారు!

ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా రెండో గెలుపుతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

Advertisement
Update:2023-04-05 13:51 IST

ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా రెండో గెలుపుతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ కు గురిపెట్టింది. గత సీజన్లో అరంగేట్రం చేయటమే కాదు..తొలిసారే టైటిల్ నెగ్గడం ద్వారా సంచలనం సృష్టించిన గుజరాత్ ప్రస్తుత సీజన్ లో సైతం అదే దూకుడు కొనసాగిస్తోంది.

ఢిల్లీపై 6 వికెట్ల విజయం...

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన సీజన్ 7వ మ్యాచ్ లో ఆతిథ్య డిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ తనదైన శైలిలో విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ గుజరాత్ జోడీ మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ 162 పరుగుల స్కోరుకే కట్టడి చేశారు.

ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (37; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (30), అభిషేక్‌ పొరెల్‌ (20) రెండంకెల స్కోర్లు సాధించగలిగారు.

ఢిల్లీకి వరుసగా రెండోమ్యాచ్ లోనూ శుభారంభం దక్కలేదు. యువ ఓపెనర్‌ పృథ్వీషా (7) మూడో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరగా.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన మిషెల్‌ మార్ష్‌ (4) సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు షమీ ఖాతాలో చేరాయి. ఈ దశలో సర్ఫరాజ్‌ ఖాన్‌ అండతో కెప్టెన్‌ వార్నర్‌ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో పరుగుల రాక మందగించింది.

వార్నర్‌ అడపా దడపా బౌండ్రీలు కొట్టినా.. సర్ఫరాజ్‌ రన్స్‌ రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇక కుదురుకున్నట్లే అనుకుంటున్న దశలో అల్జారీ జోసెఫ్‌ ఢిల్లీని దెబ్బతీశాడు. వరుస బంతుల్లో వార్నర్‌తో పాటు రొసో (0)ను ఔట్‌ చేశాడు. వార్నర్ క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. రాహుల్‌ తెవాటియా పట్టిన కండ్లు చెదిరే క్యాచ్‌కు రొసో పెవిలియన్‌ బాటపట్టాడు. మిడిల్‌ ఓవర్స్‌లో రషీద్‌ ఖాన్‌ ధాటికి ఢిల్లీ కుదేలైపోయింది.

ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 22 బంతుల్లో 2 బౌండ్రీలు 3 సిక్సర్లతో 36 పరుగులు సాధించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయగలిగింది.

గుజరాత్‌ బౌలర్లలో మహమ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా. ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌ రెండు వికెట్లు సాధించాడు.

సుదర్శన్ , మిల్లర్ షో...

అనంతరం 163 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన గుజరాత్ ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్లు సాహా, గిల్, కెప్టెన్ పాండ్యా వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

అయితే..సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ కీలక భాగస్వామ్యంతో అజేయంగా నిలవడంతో గుజరాత్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులతో 6 వికెట్ల విజయం నమోదు చేయగలిగింది.

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సాయి సుదర్శన్‌ కుదురైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగిన విజయ్‌ శంకర్‌తో కలిసి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. టార్గెట్‌ పెద్దది కాకపోవడంతో ఈ జోడీ ఒక్కో పరుగు జోడిస్తూ ముందుకుసాగింది. కొన్ని షాట్లు ఆడిన విజయ్‌ శంకర్‌ వెనుదిరిగినా.. డేవిడ్‌ మిల్లర్‌ రాకతో మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. అప్పటి వరకు కాస్త కష్టంగా కనిపించిన లక్ష్యాన్ని మిల్లర్‌ తన వీరబాదుడుతో సునాయాసం చేసేశాడు. ఈ క్రమంలో సుదర్శన్‌ 44 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో వీరిద్దరూ విజృంభించడంతో గుజరాత్‌ గెలుపు తీరాలకు చేరింది.

సాయి సుదర్శన్‌ (48 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఢిల్లీ బౌలర్లలో నోర్జే 2 వికెట్లు పడగొట్టాడు. సుదర్శన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఈరోజు జరిగే పోరులో కింగ్స్ పంజాబ్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.

Tags:    
Advertisement

Similar News