నేటినుంచే ఐపీఎల్ -17 సందడి!

భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ 17వ సీజన్ సందడి చెన్నై చెపాక్ స్టేడియంలో ఈరోజు నుంచి ప్రారంభంకానుంది.

Advertisement
Update:2024-03-22 06:01 IST

భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ 17వ సీజన్ సందడి చెన్నై చెపాక్ స్టేడియంలో ఈరోజు నుంచి ప్రారంభంకానుంది. పదిజట్ల ఈ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోరు దేశంలోని వివిధ వేదికల్లో 50 రోజులపాటు జరుగనుంది.

ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందుతున్న క్రికెట్ లీగ్ ఐపీఎల్..సీజన్ సీజన్ కూ కొత్తపుంతలు తొక్కుతోంది. గత 16 సంవత్సరాలుగా అభిమానులను అలరిస్తూ ..ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ సమరానికి చెన్నైలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ రోజు జరిగే ప్రారంభమ్యాచ్ లో ఐదుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ తో రెండుసార్లు రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

పదిజట్ల హోరాహోరీ సమరం....

లీగ్ లో తలపడుతున్న మొత్తం పదిజట్లు కొత్త హంగులు, సరికొత్త వ్యూహాలు, అంచనాలకు అందని తుదిజట్ల కూర్పుతో సమరానికి సై అంటున్నాయి.

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్, ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్, గత 16సీజన్లలో కనీసం ఒక్కసారీ విజేతగా నిలువలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతో పాటు..మరో మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్, కింగ్స్ పంజాబ్, మూడుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్, తొలి టోర్నీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు..రెండుమాసాలపాటు సాగే పోరుకు సై అంటే సై అంటున్నాయి

లీగ్ దశలో 14 మ్యాచ్ లు...

ఏడువారాలపాటు సుదీర్ఘంగా సాగే ఈ లీగ్ లో మొత్తం 10 జట్లు హోంగ్రౌండ్లో 7 మ్యాచ్ లు, ప్రత్యర్థిజట్ల గ్రౌండ్లలో 7 మ్యాచ్ లు చొప్పున..మొత్తం 14 మ్యాచ్‌ల్లో పోటీపడనున్నాయి.

ఈ రోజు రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే సీజన్ ఈ తొలిసమరం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇటు చెన్నై, అటు బెంగళూరు జట్లు ప్రత్యర్థులుగా ఉండడంతో మ్యాచ్ రసపట్టుగా సాగే అవకాశం ఉంది.

ఎవర్ గ్రీన్ చెన్నైకి అసలు పరీక్ష...

గత 16 సీజన్లలో ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై..ప్రస్తుత 17వ సీజన్ లో ప్రత్యర్థి జట్ల నుంచి అసలుసిసలు సవాలు ఎదుర్కోనుంది. ధోనీ నాయకత్వంలోని చెన్నైకి బెన్ స్టోక్స్ సూపర్ పవర్ అదనపు బలంకానుంది. డేవిడ్ కాన్వె, రితురాజ్ గయక్వాడ్ లతో పాటు స్పిన్ ఆల్ రౌండర్లు మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, పేస్ ఆల్ రౌండర్ దీపక్ చహార్ లతో సమతూకంతో కనిపిస్తోంది.

43 సంవత్సరాల లేటు వయసులో చెన్నైజట్టుకు మరోసారి పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన పోరాటయోధుడు ధోనీ తన అపారఅనుభవాన్ని ఉపయోగించి మరోసారి తనజట్టును విజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు.

గత సీజన్‌ నుంచి ఐపీఎల్‌ నిబంధనల్లో పలు వినూత్న మార్పులు చోటు చేసుకోగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌, టాస్‌ తర్వాత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ప్రకటించడం వంటి అంశాలను వివిధ జట్ల కెప్టెన్లు ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్...

అరంగేట్రం సీజన్లోనే విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ను సూపర్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా విడిచి పెట్టడంతో యువఓపెనర్ శుభ్ మన్ గిల్ నాయకత్వంలో టైటాన్స్ పోటీకి దిగుతోంది.

స్పిన్ జాదూ రషీద్ ఖాన్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీల గాయాలు గుజరాత్ ను అయోమయంలో పడవేశాయి., యువపేసర్ శివమ్ మావీ, కేన్ విలియమ్స్ సన్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో గుజరాత్ భీకరంగా కనిపిస్తోంది.

కొత్త కెప్టెన్ తో ముంబై ఇండియన్స్...

ఐపీఎల్ 16 సీజన్లలో చరిత్రలోనే ఐదుసార్లు విజేతగా నిలిచిన తొలిజట్టుగా చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్..ప్రస్తుత సీజన్లో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వంలో తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

గత 10 సీజన్లలో ముంబైని ఐదుసార్లు విజేతగా నిలిపిన సారథి రోహిత్ శర్మ ప్రస్తుత సీజన్ నుంచి కేవలం స్పెషలిస్ట్ ఓపెనర్ గా మాత్రమే బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ కు బీసీసీఐ అనుమతి ఇవ్వకపోడంతో ప్రారంభమ్యాచ్ ను..సూర్య లేకుండానే ముంబై ఆడనుంది.

గత సీజన్ లో దారుణంగా విఫలమైన ముంబై జట్టు ఎక్కువమంది యువఆటగాళ్లతో ఈసారి తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

బెంగళూరు ఈసారైనా...?

గొప్పగొప్ప ఆటగాళ్లున్నా..గత 16 సీజన్లలో కనీసం ఒక్కసారీ విజేతగా నిలువలేకపోయిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఈసారైనా విజేతగా నిలుస్తుందా? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి మేటి బ్యాటర్లున్నా బెంగళూరు బోల్తా కొడుతూనే వస్తోంది. ఐపీఎల్‌ ప్రారంభసీజన్ నుంచి ఒకే జట్టుకు ఆడుతూ వస్తున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన విరాట్‌ కోహ్లీ ఏ స్థాయిలో రాణించగలడన్న అంశం పైనే బెంగళూరు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్‌ డుప్లెసిస్‌తో పాటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌, రజత్ పాటిదార్, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, స్పిన్ వండర్ వనిందు హసరంగ, సూపర్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ప్రధానపాత్ర పోషించనున్నారు.

సన్ రైజర్స్ కు కమిన్స్ పవర్...

ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్ రైజర్స్ ప్రస్తుత సీజన్లో తన అదృష్టం పరీక్షించుకొంటోంది. ప్రతిభావంతులైన పలువురు ప్రపంచ మేటి టీ-20 స్టార్లతో సన్ రైజర్స్ డార్క్ హార్స్ హోదాలో టైటిల్ వేటకు దిగుతోంది.

దక్షిణాఫ్రికా టీ-20 లీగ్‌లో తన జట్టుకు టైటిల్‌ సాధించిపెట్టిన మర్కరమ్ ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. గత మూడు సీజన్లుగా ఐపీఎల్లో హైదరాబాద్‌ ప్రదర్శన దారుణంగా ఉంది. 2021లో పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన రైజర్స్‌.. 2022 సీజన్లో పది జట్లలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 2016లో టైటిల్‌ నెగ్గిన అనంతరం హైదరాబాద్‌ ఆ స్థాయి ఆటతీరు కనబర్చలేకపోతోంది.

ఆల్ రౌండ్ పవర్ తో రాజస్థాన్ రాయల్స్...

డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ మరోసారి హాట్ ఫేవరెట్ గా టైటిల్ రేసులో నిలువనుంది.

రాజస్థాన్ జట్టులో సూపర్ హిట్టర్ జోస్ బట్లర్, యంగ్ గన్ యశస్వి జైశ్వాల్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్ లాంటి సూపర్ బ్యాటర్లు, స్పిన్ జోడీ యజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్ ల బలంతో రాయల్స్ ఉరకలేస్తోంది.

అయోమయంలో కోల్ కతా నైట్ రైడర్స్...

భారత మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ వెన్నెముక గాయంతో దూరం కావడంతో గత సీజన్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పగ్గాలను నితీష్ రాణా చేపట్టాడు. అయితే తెరవెనుక మంత్రాంగం నడిపేందుకు న్యూజిలాండ్‌ గ్రేట్‌ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ ఉండటం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. నిరుడు సంచలన ప్రదర్శన చేసిన ఉమేశ్‌ యాదవ్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అదే తరహా ఆటతీరు ఆశిస్తుండగా.. విండీస్‌ విధ్వంసక వీరుడు ఆండ్రీ రస్సెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తి, టిమ్‌ సౌథీ, షకీబ్‌, లోకీ ఫెర్గూసన్‌ వంటి నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటం కేకేఆర్‌కు కలసి రానుంది.

శిఖర్ ధావన్ కెప్టెన్సీలో పంజాబ్...

గత సీజన్లో మయాంక్‌ అగర్వాల్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన పంజాబ్‌ కింగ్స్‌ ఈ సారి సారథితో పాటు కోచింగ్‌ సిబ్బందిని సైతం మార్చింది. 2019లో ఇంగ్లండ్‌కు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ అందించిన ప్రముఖ కోచ్ ట్రేవర్‌ బేలీస్‌ కు జట్టును అప్పజెప్పింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌పై పంజాబ్‌ భారీ ఆశలు పెట్టుకుంది.

ధవన్‌తో పాటు బెయిర్‌స్టో, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, భానుక రాజపక్స, జితేశ్‌ శర్మ, సామ్‌ కరన్‌, షార్ట్‌, షారుక్‌ ఖాన్‌తో పంజాబ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది.దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడతో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌ పేస్‌ భారం మోయనుండగా.. రాహుల్‌ చాహర్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ స్పీన్‌ బాధ్యతలు చూసుకోనున్నారు.

లక్నో కెప్టెన్ గా రాహుల్ కు సవాల్...

గాయం నుంచి కోలుకొన్నకెఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో క్వింటన్ డికాక్‌, స్టొయినిస్‌, పూరన్‌, మార్క్‌ వుడ్‌, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ హుడా లాంటి మెరుపు బ్యాటర్లున్నారు. గత సీజన్ స్థాయిలో రాణించాలన్న పట్టుదలతో లక్నోజట్టు పోరుకు దిగుతోంది.

రిషభ్ పంత్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు...

కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత 14 మాసాలుగా క్రికెట్ కు దూరమైన డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరోసారి జట్టు పగ్గాలు చేపట్టాడు.

పలుమార్లు శస్త్ర్రచికిత్సలు చేయించుకొని, కఠోరసాధన చేయడం ద్వారా రిషభ్ తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టడమే కాదు..ఢిల్లీ నాయకత్వ బాధ్యతలు సైతం స్వీకరించాడు.

యువఓపెనర్ పృథ్వీ షా, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ల పైనే ఢిల్లీ క్యాపిటల్స్ భారం మోపింది. మిషెల్ మార్ష్, రీలీ రూసో, మనీష్ పాండే, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్ లతో క్యాపిటల్స్ జట్టు పోటీకి సిద్ధమయ్యింది.

గత సీజన్ రికార్డులు బద్దలయ్యేనా?

2008 నుంచి 2023 ఐపీఎల్ వరకూ ..గత 16 సీజన్లలో అత్యధిక రికార్డులు నమోదైన టోర్నీగా 16వ సీజన్ నిలిచిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలిసారిగా ప్రవేశపెట్టడంతో పరుగుల మోత మోగడమే కాదు..రికార్డులు సైతం వెల్లువెత్తాయి.

గతంలో ఎన్నడూలేనంతగా మొత్తం 37సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. మొత్తం 74 మ్యాచ్ ల్లో సగటున తొలిఇన్నింగ్స్ లో 183 పరుగుల స్కోర్లు నమోదయ్యాయి. 8.99 రన్ రేట్ నమోదైన తొలి టోర్నీ ఇదే కావడం మరో విశేషం. వివిధజట్ల బ్యాటర్లు 153 హాఫ్ సెంచరీలు, 11 సెంచరీలు సాధించడం మరో రికార్డుగా మిగిలిపోతుంది.

గత సీజన్ రికార్డులను ప్రస్తుత సీజన్లో తెరమరుగు చేయాలని పలు జట్లు భావిస్తున్నాయి. రానున్న 7వారాలపాటు నిలకడగా రాణించిన జట్టుకే ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకొనే అవకాశాలు ఉంటాయి. మండే ఎండల వాతావరణంలో హాట్ హాట్ గా సాగే లీగ్ మ్యాచ్ లు అభిమానులను ఉర్రూతలూగించనున్నాయి.

Tags:    
Advertisement

Similar News