ఐపీఎల్ -16లో కుర్రాళ్లు బ్యాటింగ్ లో, పెద్దోళ్లు బౌలింగ్ లో 'హిట్'!
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ -16వ సీజన్ సరికొత్త ఒరవడికి తెరతీసింది. నవతరం ఆటగాళ్లు బ్యాటింగ్ లో దంచికొడితే, అపారఅనుభవం కలిగిన గత తరం ఆటగాళ్లు బౌలింగ్ లో చెలరేగిపోయారు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ -16వ సీజన్ సరికొత్త ఒరవడికి తెరతీసింది. నవతరం ఆటగాళ్లు బ్యాటింగ్ లో దంచికొడితే, అపారఅనుభవం కలిగిన గత తరం ఆటగాళ్లు బౌలింగ్ లో చెలరేగిపోయారు...
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ సీజన్ సీజన్ కూ తన నడకను మార్చుకొంటోంది. అహ్మదాబాద్ వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన 16వ సీజన్ లీగ్ సరికొత్త ఒరవడికి తెరతీసింది.
మొత్తం 10 జట్ల నడుమ 74 మ్యాచ్ లుగా సాగిన ఈ సుదీర్ఘలీగ్ లో పలు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. కోట్లు కుమ్మరించి కొన్న విదేశీ సూపర్ స్టార్ క్రికెటర్లు స్థాయికి తగ్గట్టుగా ఆడలేక చతికిలపడితే..లక్షలు విదిలించి కొన్న ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించడం ద్వారా వారేవ్వా! అనిపించుకొన్నారు.
బ్యాటింగ్ లో కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు!
బౌండ్రీలు, సిక్సర్లతో హోరెత్తిపోయే బ్యాటింగ్ లో సీనియర్ల కంటే నవతరం బ్యాటర్లే అత్యుత్తమంగా రాణించారు. అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక బౌండ్రీలు బాదిన రికార్డులను 23 సంవత్సరాల గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ సొంతం చేసుకొన్నాడు.
మొత్తం 17 మ్యాచ్ ల్లో శుభ్ మన్ గిల్ 3 శతకాలతో సహా 890 పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ అందుకొన్నాడు. 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ సొంతం చేసుకొన్నాడు.
గుజరాత్ టైటాన్స్ కే చెందిన మరో బ్యాటర్, 21 ఏళ్ల సాయి సుదర్శన్ 8 మ్యాచ్ లు ఆడి మూడు హాఫ్ సెంచరీలతో సహా 362 పరుగులు సాధించాడు. అంతేకాదు..ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో అత్యధికంగా 96 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
రాజస్థాన్ రాయల్స్ యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ 625 పరుగులు సాధించడం ద్వారా అత్యుత్తమ యువక్రికెటర్ గా 12 లక్షల రూపాయల నజరానా సొంతం చేసుకొన్నాడు.
ముంబై యువబ్యాటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, కామెరూన్ గ్రీన్ అత్యుత్తమంగా రాణించారు. కోల్ కతా నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూసింగ్
అత్యుత్తమ ఫినిషర్ గా, అత్యధిక సిక్సర్లు బాదిన మొనగాడిగా నిలిచాడు.
సీనియర్ బ్యాటర్లలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జోడీ పాఫ్ డూప్లెసీ, విరాట్ కొహ్లీ జోడీ మాత్రమే అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్లుగా నిలిచారు.
బౌలింగ్ లో సీనియర్ స్టార్ల హవా!
ఇక..కీలక బౌలింగ్ లో అనుభవం కలిగిన సీనియర్ స్టార్ బౌలర్లు సత్తా చాటుకొన్నారు. మ్యాచ్ విన్నర్లుగా, అత్యుత్తమంగా రాణించడం ద్వారా ప్రతిభకు వయసుతో ఏమాత్రం పనిలేదని చాటి చెప్పారు.
గుజరాత్ టైటాన్స్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన అపారఅనుభవాన్నంతా ఉపయోగించి..వరుసగా రెండోసారి తనజట్టు ఫైనల్స్ చేరడంలో ప్రధానపాత్ర వహించాడు.
మహ్మద్ షమీ మొత్తం 17 మ్యాచ్ ల్లో 28 వికెట్లు పడగొట్టడం ద్వారా పర్పుల్ క్యాప్ తో పాటు..15 లక్షల రూపాయల అవార్డు సాధించాడు. గుజరాత్ కే చేందిన 34 ఏళ్ల వెటరన్ పేస్ బౌలర్ మోహిత్ శర్మ 15 మ్యాచ్ లో 27 వికెట్లతో రెండోస్థానంలో నిలిచాడు.
ఢిల్లీ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ, ముంబై వెటరన్ లెగ్ స్పిన్నర్ పియూశ్ చావ్లా సైతం అంచనాలకు మించి రాణించడం ద్వారా తమజట్ల కీలక విజయాలలో ప్రధానపాత్ర పోషించారు.
హోరాహోరీగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో విజేతగా నిలవాలంటే బ్యాటర్లను మించి బౌలర్లు రాణించితీరాల్సి ఉంది. బౌలర్లుగా వివిధజట్లకు చెందిన సీనియర్ స్టార్లు చక్కగా రాణించడం ద్వారా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పకనే చెప్పారు.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో భారీస్కోర్లు..
2008 నుంచి ప్రస్తుత 2023 ఐపీఎల్ వరకూ ..గత 16 సీజన్లలో అత్యధిక రికార్డులు నమోదైన టోర్నీగా ప్రస్తుత 16వ సీజన్ నిలిచింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలిసారిగా ప్రవేశపెట్టడంతో ఐపీఎల్ స్వరూపమే ఒక్కసారిగా మారిపోయింది.
గతంలో ఎన్నడూలేనంతగా వివిధజట్లు మొత్తం 37సార్లు 200కు పైగా స్కోర్లు సాధించగలిగాయి. మొత్తం 74 మ్యాచ్ ల్లో సగటున తొలిఇన్నింగ్స్ లో 183 పరుగుల స్కోర్లు నమోదయ్యాయి. 8.99 రన్ రేట్ నమోదైన తొలి టోర్నీ ఇదే కావడం మరో విశేషం. వివిధజట్ల బ్యాటర్లు 153 హాఫ్ సెంచరీలు, 11 సెంచరీలు సాధించడం మరో రికార్డుగా మిగిలిపోతుంది.
200కు పైగా విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన జట్లు ఆరుసార్లు విజేతగా నిలువగలిగాయి. ముంబైజట్టే అత్యధిక 200 స్కోర్లు సాధించడం తోపాటు..అత్యధిక 200కు పైగా చేజింగ్ విజయాలను సైతం నమోదు చేయగలిగింది.
చెన్నై ఫీల్డర్ రుతురాజ్ గయక్వాడ్ 16 మ్యాచ్ ల్లో 17 క్యాచ్ లు పట్టి..అత్యధిక క్యాచ్ లు అందుకొన్న ఫీల్డర్ గా నిలిచాడు. విరాట్ కొహ్లీ 14 మ్యాచ్ ల్లో 13 క్యాచ్ లతో రెండోస్థానంలో నిలిచాడు. హైదరాబాద్ కెప్టెన్ మర్కరమ్ 13 మ్యాచ్ ల్లో 11 క్యాచ్ లతో మూడోస్థానం సాధించాడు.