వరుస విజయాలలో భారత్ ప్రపంచకప్ రికార్డు!

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ ను ఆతిథ్య భారత్ ప్రపంచ రికార్డుతో అజేయంగా ముగించింది....

Advertisement
Update:2023-11-13 09:18 IST

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ ను ఆతిథ్య భారత్ ప్రపంచ రికార్డుతో అజేయంగా ముగించింది....

ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ దశను ఆల్ విన్ రికార్డుతో ముగించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా తొమ్మిదో విజయంతో అజేయంగా నిలిచింది.

లీగ్ దశలో ఎదురేలేని భారత్!

రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో జరుగుతున్న ప్రస్తుత 2023-వన్డే ప్రపంచకప్ తొలిదశను భారత్ అత్యంత విజయవంతంగా ముగించింది. చెన్నై వేదికగా ఆస్ట్ర్రేలియాతో ఆడిన ప్రారంభమ్యాచ్ నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన 9వ రౌండ్ మ్యాచ్ వరకూ తొమ్మిదికి తొమ్మిదిరౌండ్లలోనూ విజేతగా నిలిచింది.

ఎదురులేని విజయాలతో.....

ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా, అప్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లను ఓడించడం చేయడం ద్వారా సెమీస్ చేరిన తొలిజట్టుగా నిలిచిన భారత్...ఆఖరి ( 9వ ) రౌండ్ మ్యాచ్ లో పసికూన నెదర్లాండ్స్ ను 160 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సరికొత్త ప్రపంచ రికార్డుతో లీగ్ దశను ముగించింది.

ప్రపంచకప్ లీగ్ దశలో వరుసగా 9 విజయాలు సాధించిన తొలి, ఏకైకజట్టుగా భారత్ నిలిచింది. 1996 ప్రపంచకప్ లో శ్రీలంక, 2003 ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియాజట్లు సాధించిన 8 వరుస విజయాలను భారత్ అధిగమించింది.

శ్రేయస్ అయ్యర్- రాహుల్ సెంచరీల మోత!

పరుగుల అడ్డా చిన్నస్వామి స్టేడియం వేదికగా..దీపావళి రోజునే జరిగిన ఆఖరిరౌండ్ పోరులో టాస్ నెగ్గిన భారతజట్టు మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంది.

ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ మొదటి వికెట్ కు 11.5 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యంతో భారీస్కోరుకు పునాది వేశారు. గిల్ 51, కెప్టెన్ రోహిత్ 61, వన్ డౌన్ విరాట్ కొహ్లీ 51 పరుగుల స్కోర్లకు అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన మిడిలార్డర్ జోడీ శ్రేయస్ అయ్యర్- కెఎల్ రాహుల్ 4వ వికెట్ కు రికార్డు భాగస్వామ్యంతో పండుగ చేసుకొన్నారు.

ఇటు అయ్యర్, అటు రాహుల్ దీపావళి పటాకా షాట్లతో చెలరేగిపోయారు. 208 పరుగుల మెరుపు భాగస్వామ్యంతో డచ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

గాయాల నుంచి పూర్తిగా కోలుకొని ప్రపంచకప్ ద్వారా రీ-ఎంట్రీ చేసిన అయ్యర్, రాహుల్ వీరవిహారం చేశారు.

శ్రేయస్ అయ్యర్ కేవలం 94 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 128 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిస్తే ..రాహుల్ మాత్రం 64 బంతుల్లోనే 11 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 102 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

ఈ భారతజోడీ ఆఖరి 10 ఓవర్లలోనే 107 పరుగులు దండుకోడం విశేషం. భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా..పసికూన నెదర్లాండ్స్ ఎదుట 411 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

9మంది బౌలర్లతో ప్రయోగం....

మ్యాచ్ నెగ్గాలంటే 411 పరుగులు చేయాల్సిన నెదర్లాండ్స్ ను భారత కెప్టెన్ తన పార్ట్ టైమ్ బౌలర్లతోనే 250 పరుగులకే కుప్పకూల్చడంలో సఫలమయ్యాడు.

ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సిరాజ్ తొలి వికెట్ పడగొడితే..ఆ తరువాత స్పిన్ జాదూ కుల్దీప్ కీలక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత నుంచి విరాట్ కొహ్లీ, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ లను సైతం కెప్టెన్ రోహిత్ బౌలింగ్ కు దించాడు. చివరకు తాను సైతం ఓ ఓవర్ వేసి ఆఖరి వికెట్ తో మ్యాచ్ కు ముగింపు పలికాడు

డచ్ పరువు దక్కించిన తెలుగు కుర్రాడు...

నెదర్లాండ్స్ తరపున 7వ నంబర్ బ్యాటర్ గా క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు తేజా నిడమానూరు 39 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా తనజట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

హైదరాబాద్ లో జన్మించిన కృష్ణాజిల్లా యువకుడు తేజ 6 సిక్సర్లు, ఓ బౌండ్రీతో 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ ను 18 పాయింట్లతో ముగించిన భారత్ బుధవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగే తొలిసమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది.

Tags:    
Advertisement

Similar News