భారత దిగ్గజాలకు టెన్నిస్ హాల్- ఆఫ్- ఫేమ్!

భారత టెన్నిస్ దిగ్గజ జోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దొరికింది.

Advertisement
Update:2024-07-21 16:42 IST

భారత టెన్నిస్ దిగ్గజ జోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దొరికింది.

భారత, అంతర్జాతీయ టెన్నిస్ కు అసమాన గౌరవం తెచ్చిన భారత జోడీ విజయ్ అమృత్ రాజ్, లియాండర్ పేస్ లకు అంతర్జాతీయ టెన్నిస్ 'హాల్ ఆఫ్ ఫేమ్' పురస్కారం దక్కింది.

అమెరికాలోని రోడ్ ఐలాండ్ లోని న్యూపోర్ట్ లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ వేడుకల్లో పలువురు విశ్వవిఖ్యాత టెన్నిస్ క్రీడాకారులతో పాటు భారతజోడీ విజయ్ అమృత్ రాజ్, లియాండర్ పేస్ లను హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారంతో గౌరవించారు.

1970 సూపర్ స్టార్ విజయ్ అమృత్ రాజ్...

1970 దశకంలో భారత టెన్నిస్ సూపర్ స్టార్ గా వెలుగొందిన విజయ్ అమృత్ రాజ్ గురించి నేటితరానికి తెలిసింది అంతంత మాత్రమే. ప్రపంచ టెన్నిస్ గ్రేట్లు జిమ్మీ కానర్స్, జోర్న్ బోర్గ్ లతో సమానంగా గుర్తింపు పొందిన విజయ్ తన సోదరుడు ఆనంద్ అమృత్ రాజ్ తో కలసి భారత టెన్నిస్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం కావించాడు.

1970 నుంచి 1993 వరకూ అంతర్జాతయ టెన్నిస్ లో కొనసాగిన విజయ్ కు 15 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ సాధించడంతో పాటు..399 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది.

తన కెరియర్ లో అత్యుత్తమంగా ప్రపంచ 18వ ర్యాంక్ లో నిలిచిన విజయ్ ప్రతిభ కారణంగానే భారత్ 1974, 1987 డేవిస్ కప్ టోర్నీల ఫైనల్స్ చేరడంతో పాటు రన్నరప్ స్థానాలు సాధించగలిగింది.

రిటైర్మెంట్ తరువాత గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీల వ్యాఖ్యాతగా గుర్తింపు పొందిన విజయ్ కు జేమ్స్ బాండ్, స్టార్ ట్రెక్ సిరీస్ ల్లో నటించిన ఘనత కూడా ఉంది.

డబ్లుటిఏ, ఏటీపీ లకు తనవంతుగా పలు చిరస్మరణీయ సేవలు అందించిన విజయ్ ను అంతర్జాతీయ టెన్నిస్ సంఘం..హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారంతో సత్కరించింది.

ఇంతటి అసాధారణ గౌరవం, గుర్తింపు కేవలం తనకు టెన్నిస్ క్రీడద్వారానే దక్కిందని, తన జన్మధన్యమైందని 70 సంవత్సరాల విజయ్ పొంగిపోతూ చెప్పాడు.

విజయ్ సరసన శిష్యుడు లియాండర్ పేస్...

విజయ్ అమృత్ రాజ్ నెలకొల్పిన శిక్షణ సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చిన లియాండర్ పేస్ కు సైతం హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కింది. భారత్ తరపున ఏడు ఒలింపిక్స్ల్ లో పాల్గొని ఓ కాంస్య పతకం సాధించిన ఘనత లియాండర్ పేస్ కు మాత్రమే సొంతం.

డేవిస్ కప్ టోర్నీలలో భారత్ కు ఘనవిజయాలు అందించడంతో పాటు డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు సాధించిన అరుదైన రికార్డు కూడా ఉంది.

51 సంవత్సరాల వయసులో తనకు అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కడం గర్వకారణమని పేస్ తెలిపాడు.

ఫుట్ బాల్, హాకీలతో తన క్రీడాజీవితాన్ని ప్రారంభించిన పేస్ ఆ తరువాత టెన్నిస్ లో అడుగుపెట్టి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నాడు. రెండుదశాబ్దాలపాటు భారత టెన్నిస్ కు చిరునామాగా నిలిచాడు.

తన కెరియర్ లో 18 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన లియాండర్ పేస్ రికార్డుస్థాయిలో ఏడుసార్లు ఒలింపిక్స్ లో పాల్గొనడమే కాదు...పురుషుల సింగిల్స్ లో కాంస్య విజేతగా నిలిచాడు.

ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించిన తొలి ఆసియా క్రీడాకారుడు విజయ్ అమృత్ రాజ్ కాగా..రెండో ఆటగాడు లియాండర్ పేస్ మాత్రమే.

విజయ్, పేస్ ల పుణ్యమా అంటూ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకొన్న 27వ దేశంగా భారత్ నిలిచింది.

Tags:    
Advertisement

Similar News