భారత మహిళా ఆర్చర్ల 'గోల్డెన్ హ్యాట్రిక్'!

ప్రపంచ విలువిద్య మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది. భారతజట్టు వరుసగా మూడో బంగారు పతకంతో తనకు తానే సాటిగా నిలిచింది.

Advertisement
Update:2024-05-25 19:02 IST

ప్రపంచ విలువిద్య మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది. భారతజట్టు వరుసగా మూడో బంగారు పతకంతో తనకు తానే సాటిగా నిలిచింది.

2024- ప్రపంచ మహిళా విలువిద్య కాంపౌండ్ విభాగంలో భారతజట్టు బంగారు మోత మోగిస్తోంది. తెలుగుతేజం జ్యోతీ సురేఖ వెన్నం, పర్నీత్ కౌర్, ఆదితి స్వామిలతో కూడిన భారతజట్టు గత నెలరోజుల వ్యవధిలో వరుసగా రెండవ, ఓవరాల్ గా మూడో టీమ్ బంగారు పతకం గెలుచుకొంది.

ప్రపంచ స్టేజ్-2లోనూ అదేజోరు....

ప్రపంచ విలువిద్య సమాఖ్య..పురుషుల, మహిళల విభాగాలలో ప్రపంచ పోటీలను నాలుగు అంచెలు( స్టేజీలు)గా నిర్వహిస్తోంది. ప్రస్తుత 2024 సీజన్ తొలి అంచె పోటీలలో అలవోకగా మహిళల కాంపౌండ్ టీమ్ బంగారు పతకం నెగ్గిన భారతజట్టు...దక్షిణ కొరియాలోని యోచియోన్ వేదికగా జరుగుతున్న స్టేజ్ -2 పోటీలలో సైతం స్వర్ణపతకం సాధించింది.

టర్కీ జట్టుతో బంగారు పతకం కోసం జరిగిన పోరులో భారత్ కు తగిన పోటీనే లేకుండా పోయింది. భారతజట్టు 232- 226 పాయింట్ల తేడాతో విజేతగా నిలవడం ద్వారా స్వర్ణపతకం సొంతం చేసుకొంది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా ఉన్న భారతజట్టు స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా ఆధిక్యం నిరూపించుకొంది. హజుల్ బురున్, బెరా సుజెర్, బెగం యువాలతో కూడిన టర్కీ జట్టుపై భారత త్రయం 6 పాయింట్ల తేడాతో విజేతలుగా నిలిచారు.

జ్యోతీ, పర్నీత్, అదితిలతో కూడిన భారతజట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో బంగారు పతకం సాధించడం ఇది మూడోసారి. షాంఘై వేదికగా ముగిసిన స్టేజ్-1 ఫైనల్లో ఇటలీని, పారిస్ వేదికగా గతేడాది ముగిసిన స్టేజీ-4 పోరులో సైతం స్వర్ణపతకాలు నెగ్గిన భారతజట్టు..ప్రస్తుత సీజన్ స్టేజీ -2లో సైతం విజేతలుగా కాగలిగారు.

మిక్సిడ్ విభాగంలోనూ గోల్డెన్ చాన్స్...

కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో సైతం భారత జోడీ జ్యోతీ, ప్రియాంశ్ ఫైనల్స్ చేరడం ద్వారా బంగారుపతకానికి గురిపెట్టారు. ప్రపంచ రెండోర్యాంక్ జోడీగా గుర్తింపు పొందిన జ్యోతీ- ప్రియాంశ్ సెమీఫైనల్లో కొరియాజోడీ హాన్ సింగ్ యోన్- యాంగ్ జే వాన్ లపై 158- 157 పాయింట్ల తేడాతో విజేతలుగా నిలిచారు.

బంగారు పతకం పోరులో అమెరికా జోడీ ఒలీవియా డీన్- స్వేయర్ సులివాన్ తో తలపడనున్నారు.

మహిళల రికర్వ్ విభాగంలో భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి సెమీఫైనల్స్ చేరడం ద్వారా పతకం ఆశలు రేపుతోంది. తొలిరౌండ్లో స్లొవేనియా ఆర్చర్ టింకారాను షూట్ ఆఫ్ రౌండ్లో 3-1తో అధిగమించిన దీపిక..ఆ తర్వాతి మూడురౌండ్లలోనూ వియత్నాంకు చెందిన లాక్ థి డావోపై 6-2, ఫ్రెంచ్ ఆర్చర్ లిసాపై 6-0తోనూ, టర్కీకి చెందిన ఎలిఫ్ బెర్రా గోక్కిర్ పై 6-4తోనూ అలవోక విజయాలతో సెమీస్ రౌండ్లో అడుగుపెట్టింది. సెమీస్ పోరులో కొరియా ఆర్చర్ లిమ్ సియోన్ తో దీపిక తలపడాల్సి ఉంది.

పురుషుల వ్యక్తిగత పోటీల సెమీస్ కు యువఆర్చర్ ప్రతమేశ్ చేరుకొన్నాడు. తొలిరౌండ్ లో వియత్నాం ఆర్చర్ పై 159- 152 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచాడు.

రికర్వ్ పురుషుల టీమ్, వ్యక్తిగత విభాగాలతో పాటు మిక్సిడ్ టీమ్ విభాగంలో సైతం భారత్ కు చుక్కెదురయ్యింది.

Tags:    
Advertisement

Similar News