'స్పిన్నర్ల అడ్డా' లో నేడు భారత్- ఇంగ్లండ్ పోరు!

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆతిథ్య భారత్ వరుసగా ఆరో విజయానికి గురిపెట్టింది. లక్నో వేదికగా ఈరోజు జరిగే ఆరోరౌండ్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో తలపడనుంది.

Advertisement
Update:2023-10-29 08:03 IST

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆతిథ్య భారత్ వరుసగా ఆరో విజయానికి గురిపెట్టింది. లక్నో వేదికగా ఈరోజు జరిగే ఆరోరౌండ్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో తలపడనుంది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత్, ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి దిగ్గజ జట్లు వరుస విజయాలతో నాకౌట్ రౌండ్ కు చేరువవుతుంటే...ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నెదర్లాండ్స్, అప్ఘనిస్థాన్ లాంటి చిన్నజట్లు మాత్రం సెమీస్ చేరే అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నా సంచలన విజయాలతో ప్రపంచ మేటి జట్ల నాకౌట్ రౌండ్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి.

రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఐదురౌండ్లలో ఐదు విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచిన టాప్ ర్యాంకర్ భారత్ , ఐదురౌండ్లలో నాలుగు పరాజయాలతో లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్ల నడుమ ఈ రోజు ఆసక్తికరమైన పోరు జరుగనుంది.

హోరాహోరీనా...ఏకపక్షమేనా?

మొదటి ఐదురౌండ్లలో భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటతీరు, జోరును బట్టి చూస్తే..హోరాహోరీగా పోరు జరిగే అవకాశాలు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి. భీకరమైన ఫామ్ లో ఉన్న మాజీ చాంపియన్ భారత్ కు ఇంగ్లండ్ గట్టి పోటీ ఇవ్వడం అనుమానమే.

మొదటి ఐదురౌండ్లలో కేవలం ఒకే ఒక్క గెలుపుతో 2 పాయింట్లు మాత్రమే సాధించిన ఇంగ్లండ్ మిగిలిన నాలుగురౌండ్లలో భారీవిజయాలు సాధించగలిగితేనే సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరుకోగలుగుతుంది. ఈ నేపథ్యంలో పవర్ ఫుల్ భారత్ తో జరిగే పోరులో ఇంగ్లండ్ ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.

మరోవైపు..ఐదుకు ఐదు విజయాల ద్వారా 10 పాయింట్లతో సెమీస్ కు గెలుపు దూరంలో నిలిచిన భారత్ వరుసగా ఆరో విజయంతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉంది.

హార్థిక్ పాండ్యా గాయంతో గందరగోళం!

వైస్ కెప్టెన్ కమ్ పేస్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం భారతజట్టులో సమతౌల్యాన్ని దెబ్బతీసింది. ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ కు సైతం పాండ్యా అందుబాటులో లేకపోడంతో తుదిజట్టులో అదనపు పేసర్ లేదా స్పిన్నర్ లేదా అదనపు బ్యాటర్ ను తీసుకోవాలో తెలియక భారత టీమ్ మేనేజ్ మెంట్ ఉక్కిరిబిక్కిరవుతోంది.

అయితే.. స్లోబౌలర్లతో పాటు స్పిన్నర్లకు అనువుగా ఉంటే లక్నో స్టేడియం పిచ్ పైన భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ముప్పేటదాడికి దిగనుంది.

గత రెండుమాసాలుగా వరుసగా అంతర్జాతీయమ్యాచ్ లు ఆడేస్తూ వస్తున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు విశ్రాంతి నిచ్చి..జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను భారత్ తుదిజట్టులోకి తీసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

మిడిలార్డర్లో సూర్యకుమార్...

భారతజట్టు ఇద్దరు పేసర్లు ( బుమ్రా, షమీ), ముగ్గురు ( కుల్దీప్ , జడేజా, అశ్విన్ ) స్పిన్నర్ల వ్యూహంతో పోటీకి దిగుతోంది. బ్యాటింగ్ ఆర్డర్ 6వ నంబర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించనున్నారు.

ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ , వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండో డౌన్ శ్రేయస్ అయ్యర్, మూడో డౌన్ రాహుల్, నాలుగో డౌన్ సూర్యకుమార్, 5వ డౌన్లో రవీంద్ర జడేజా, ఆరవ డౌన్లో అశ్విన్ లతో భారత బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

మందకొడి లక్నో వికెట్ పైన 260 కి పైగా పరుగుల స్కోరు సాధించినా అది మ్యాచ్ విన్నింగ్‌ స్కోరే కానుంది. టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని భారీస్కోరుతో ప్రత్యర్థిని చేజింగ్ లో ఒత్తిడికి గురిచేసే అవకాశాలున్నాయి.

ఆత్మవిశ్వాసం లోపించిన ఇంగ్లండ్...

రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లోనే న్యూజిలాండ్ చేతిలో కంగు తిన్న ఇంగ్లండ్..రెండోరౌండ్లో బంగ్లాను అధిగమించినా..ఆ తర్వాత అప్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకజట్ల చేతిలో పరాజయాలతో డీలా పడిపోయింది. ఆత్మస్థైర్యం కోల్పోయింది. బ్యాటింగ్ లో మాత్రమే కాదు..బౌలింగ్ లోనూ వరుస వైఫల్యాలతో విలవిలలాడుతోంది.

భారత్ ప్రత్యర్థిగా ఇంగ్లండ్ స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే సెమీస్ రేస్ లో తన పోరాటం కొనసాగించగలుగుతుంది. ఓపెనింగ్ జోడీ బెయిర్ స్టో- మలన్, కెప్టెన్ బట్లర్, సూపర్ హిట్టర్లు బెన్ స్టోక్స్, లివింగ్ స్టోన్, మాజీ కెప్టెన్ జో రూట్ లలో కనీసం ముగ్గురైనా భారీస్కోర్లు సాధించగలిగితేనే భారత్ కు గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది.

బౌలింగ్ లో విల్లే, మార్క్ వుడ్, సామ్ కరెన్ లతో పాటు స్పిన్ త్రయం మోయిన్ అలీ, అదిల్ రషీద్, లివింగ్ స్టోన్ కీలకం కానున్నారు.

ప్రపంచకప్ లో ఈ రెండుజట్లూ ఎనిమిదిసార్లు తలపడితే ఇంగ్లండ్ 4 విజయాలు, భారత్ 3 విజయాలు సాధించాయి. మరోమ్యాచ్ సూపర్ టైగా ముగిసింది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సూపర్ సండే ఫైట్..హోరాహోరీగా సాగుతుందా? లేక ఏకపక్షంగా ముగిసిపోతుందా? తెలుసు కోవాలంటే కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News