భారత టీటీ జట్ల సంచలనం, తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత!

భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త అంకానికి తెరలేచింది. పురుషుల, మహిళల జట్లు తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత సాధించాయి.

Advertisement
Update:2024-03-05 16:12 IST

భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త అంకానికి తెరలేచింది. పురుషుల, మహిళల జట్లు తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత సాధించాయి.

అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ లో గత కొద్ది సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తున్న భారత టేబుల్ టెన్నిస్ జట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఒలింపిక్స్ టీమ్ విభాగంలో తలపడటానికి అర్హత సంపాదించాయి.

పారిస్ వేదికగా మరికొద్ది మాసాలలో జరిగే 2024 ఒలింపిక్స్ పురుషుల, మహిళల టీమ్ విభాగాలలో తలపడే జట్ల వివరాలను అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సంఘం అధికారికంగా ప్రకటించింది.

మహిళలకు 13, పురుషులకు 15 ర్యాంకులు....

తాజా ర్యాంకింగ్స్ ప్రకారం టీమ్ విభాగంలో భారత మహిళలజట్టు 13, పురుషులజట్టు 15 ర్యాంకులు సాధించాయి. పురుషుల, మహిళల టీమ్ విభాగాలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం మొత్తం 16 దేశాలజట్లుకు మాత్రమే తలపడే అవకాశం ఉంటుంది. ర్యాంకింగ్స్ ప్రకారమే జట్లకు ఒలింపిక్స్ బెర్త్ లు కేటాయిస్తారు.

మహిళల విభాగంలో 13, పురుషుల విభాగంలో 15 ర్యాంకులు సంపాదించడం ద్వారా భారతజట్టు తొలిసారిగా ఒలింపిక్స్ టీమ్ విభాగంలో తలపడటానికి అర్హత సంపాదించాయి.

మహిళల విభాగంలో భారత్ తో పాటు 11వ ర్యాంక్ థాయ్ లాండ్, 12వ ర్యాంక్ పోలాండ్, 15వ ర్యాంక్ స్వీడెన్ ఒలింపిక్స్ బెర్త్ లు సాధించగలిగాయి.

పురుషుల విభాగంలో 12వ ర్యాంక్ క్రొయేషియా, 11వ ర్యాంక్ స్లొవేనియాతో పాటు 15వ ర్యాంకర్ భారత్ సైతం అర్హత సంపాదించగలిగింది.

ప్రపంచ టీటీలో విఫలమైనా అర్హత...

2024 ప్రపంచ టేబుల్ టెన్నిస్ పోటీల క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించిన జట్లకు నేరుగా ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ..భారతజట్లు క్వార్టర్ ఫైనల్‌ చేరుకోడంలో విఫలమైనా తమ ర్యాంకింగ్స్ ఆధారంగా కోటా బెర్త్ లు సంపాదించాయి.

పారిస్ ఒలింపిక్స్ టీమ్ విభాగం పోటీలు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ దశ నుంచి ప్రారంభంకానున్నాయి.

పురుషుల జట్టులో తెలుగుతేజం...

ఒలింపిక్స్ టీమ్ విభాగంలో తలపడే నలుగురు సభ్యుల భారత పురుషులజట్టులో తెలుగుతేజం, దిగ్గజ ఆటగాడు ఆచంట శరత్ కమల్ కు చోటు దక్కింది. జట్టులోని ఇతర సభ్యుల్లో సత్యన్ జ్ఞానశేఖరన్, సుత్రిత ముఖర్జీ, మనీకా బాత్రా ఉన్నారు.

టీమ్ విభాగంలోపురుషుల, మహిళల సింగిల్స్ తో పాటు మిక్సిడ్ డబుల్స్ మ్యాచ్ లు మాత్రమే నిర్వహిస్తారు.

వ్యక్తిగత విభాగంలో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్ అంశాలలో మాత్రం స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీ ఉంటుంది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగాలలో చైనా, కొరియా, జపాన్, జర్మనీ, స్వీడన్ జట్ల ఆధిపత్యమే కొనసాగుతోంది.

Tags:    
Advertisement

Similar News