భారత కుర్రఓపెనర్ల జోరు..వెస్టిండీస్ బేజారు!

వెస్టిండీస్ తో నాలుగో టీ-20లో భారత్ అలవోక విజయం సాధించింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ ను 2-2తో సమం చేసి ట్రోఫీ ఆశల్నిసజీవంగా నిలుపుకొంది.

Advertisement
Update:2023-08-13 13:15 IST

వెస్టిండీస్ తో నాలుగో టీ-20లో భారత్ అలవోక విజయం సాధించింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ ను 2-2తో సమం చేసి ట్రోఫీ ఆశల్నిసజీవంగా నిలుపుకొంది.

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్- వెస్టిండీస్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ పతాకస్థాయికి చేరింది. నెగ్గితీరాల్సిన నాలుగోమ్యాచ్ లో భారత్ 9 వికెట్ల అలవోక విజయం సాధించడం ద్వారా సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.

ఫ్లారిడా లోని లౌడర్ హిల్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన కీలక పోరులో భారత ఓపెనింగ్ జోడీ యశస్వి జైశ్వాల్- శుభ్ మన్ గిల్ మొదటి వికెట్ కు 165 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో పోరును ఏకపక్షంగా ముగించారు.

నీకు రెండు..నాకు రెండు...!

రోవ్ మన్ పావెల్ నాయకత్వంలోని వెస్టిండీస్, హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలోని భారత జట్ల ఈ ఐదుమ్యాచ్ ల సిరీస్ నీకు రెండు, నాకు రెండు అన్నట్లుగా సాగుతూ వస్తోంది.

ట్రినిడాడ్ , గయానా వేదికలుగా జరిగిన మొదటి రెండుమ్యాచ్ ల్లో కరీబియన్ జట్టు 4 పరుగులు, 2 వికెట్ల విజయాలతో 2-0తో పైచేయి సాధించగా..గయానా వేదికగానే ముగిసిన మూడోమ్యాచ్ లో భారత్ 7 వికెట్ల గెలుపుతో సిరీస్ అవకాశాలను నిలబెట్టుకొంది.

అమెరికా అంచెలో భాగంగా ఫ్లారిడాలోని లౌడర్ హిల్ వేదికగా జరిగే ఆఖరి రెండుమ్యాచ్ ల్లోని తొలిపోరులో పరుగుల మోత మోగినా..భారతజట్టే విజేతగా నిలిచింది.

విండీస్ కు కుల్దీప్, అర్షదీప్ పగ్గాలు...

సిరీస్ కే కీలకంగా మారిన ఈ నాలుగో టీ-20 పోరులో నెగ్గితే వెస్టిండీస్ 2016 తర్వాత భారత్ పై తొలి సిరీస్ సాధించి ఉండేది. అదే భారత్ మాత్రం ఈమ్యాచ్ లో నెగ్గితీరితేనే సిరీస్ గెలుపు ఆశల్ని సజీవంగా నిలుబెట్టుకోగలుగుతుంది. ఈ నేపథ్యంలో జరిగిన మ్యాచ్ లో భారత్ మార్పులేవీ లేకుండానే పోటీకి దిగితే..కరీబియన్ జట్టు మాత్రం మూడుమార్పులతో బరిలో నిలిచింది.

లౌడర్ హిల్ గ్రౌండ్స్ లో ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్నజట్లకే అత్యధిక విజయాల రికార్డు ఉండడంతో...వెస్టిండీస్ కీలక టాస్ నెగ్గి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొంది.

పవర్ ప్లే ఓవర్లలో పేసర్ అర్షదీప్ సింగ్, మిడిల్ ఓవర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో వెస్టిండీస్ 57 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

ఓపెనర్లు కైల్ మేయర్స్ 17, బ్రెండన్ కింగ్ 18, డేంజర్ మ్యాన్ నికోలస్ పూరన్, కెప్టెన్ రోవమన్ పావెల్ ఒక్కో పరుగు స్కోర్లకు వెనుదిరిగారు. వన్ డౌన్ బ్యాటర్ షాయ్ హోప్ 29 బంతుల్లోనే 3 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 45, హేట్ మేయర్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 16 పరుగులు, లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఓడియన్ స్మిత్ 12 బంతుల్లో 15 పరుగులు చేయడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 స్కోరు సాధించగలిగింది.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, యజువేంద్ర చహాల్ తలో వికెట్ పడగొట్టారు.

గిల్- యశస్వి సరికొత్త రికార్డు...

మ్యాచ్ నెగ్గాలంటే 179 పరుగుల భారీలక్ష్యం సాధించాల్సిన భారత్ కు యువఓపెనింగ్ జోడీ యశస్వి జైశ్వాల్- శుభ్ మన్ గిల్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.

వికెట్ బ్యాటింగ్ కు అనువుగా ఉండడంతో చెలరేగిపోయారు. 15.3 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో పోటీ ఏకపక్షంగా మారిపోయింది.

మొదటి మూడు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమైన శుభ్ మన్ గిల్ ఈ కీలక పోరులో రెచ్చిపోయి ఆడాడు. కేవలం 47 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 77 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

మరోవైపు..తన కెరియర్ లో కేవలం రెండో టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న యశస్వి జైశ్వాల్ సైతం స్వేచ్ఛంగా బ్యాటు ఝళిపించాడు. అరంగేట్రం మ్యాచ్ లో ఒక్క పరుగుకే అవుటైన నిరాశ నుంచి బయట పడి భారీషాట్లతో విరుచుకు పడ్డాడు.

యశస్వి 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ 7 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ 17 ఓవర్లలోనే 179 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకోగలిగింది.

టీ-20ల్లో భారత్ తరపున గతంలో శ్రీలంక ప్రత్యర్థిగా 2017 లో రోహిత్ శర్మ- కెఎల్ రాహుల్ మొదటి వికెట్ కు నమోదు చేసిన 165 పరుగుల రికార్డును గిల్- యశస్వి జోడీ సమం చేయగలిగారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యశస్వి జైశ్వాల్ కు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరిపోరు లౌడర్ హిల్ వేదికగానే..సూపర్ సండే ఫైట్ గా జరుగనుంది.

ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరాటలో విజేతగా నిలిచిన జట్టే సిరీస్ ట్రోఫీని అందుకోగలుగుతుంది.

Tags:    
Advertisement

Similar News