నరేంద్ర మోడీ స్టేడియం చుట్టూ తిరుగుతున్న భారత క్రికెట్ !

భారత క్రికెట్ చిరునామా ఒక్కసారిగా మారిపోయింది. ముంబై వాంఖడే స్టేడియం, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ పోయి..ఇప్పుడు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం తెరమీదకు వచ్చింది.

Advertisement
Update:2023-06-30 17:45 IST

నరేంద్ర మోడీ స్టేడియం చుట్టూ తిరుగుతున్న భారత క్రికెట్ !

భారత క్రికెట్ చిరునామా ఒక్కసారిగా మారిపోయింది. ముంబై వాంఖడే స్టేడియం, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ పోయి..ఇప్పుడు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం తెరమీదకు వచ్చింది.

అహ్మదాబాద్ లోని మోతేరాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియాన్ని పడగొట్టి నరేంద్ర మోడీ పేరుతో సరికొత్తగా నిర్మించడంతోనే గుజరాత్ క్రికెట్ సంఘం తలరాత ఒక్కసారిగా మారిపోయింది. భారత క్రికెట్ సంఘం కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి తనయుడు జై షా బాధ్యతలు చేపట్టడంతోనే..ఇప్పుడు భారత క్రికెట్ నరేంద్ర మోడీ స్టేడియం చుట్టూ పరిభమణం చేస్తోంది.

అంతర్జాతీయ సిరీస్ లు, దేశవాళీ, ఐపీఎల్...టోర్నీ ఏదైనా ప్రారంభమ్యాచ్, ఫైనల్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చే స్థాయికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఎదిగిపోయింది.


జే షా ..నమో మంత్రం!

భారత క్రికెట్ అంటే కొద్ది సంవత్సరాల క్రితం వరకూ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్, ముంబై వాంఖడే స్టేడియం, చెన్నై చెపాక్ స్టేడియం పేర్లతో పాటు..మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం పేర్లు మాత్రమే వినిపించేవి.

అయితే..గత ఏడుసంవత్సరాలుగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియానికి నరేంద్ర మోడీ పేరు పెట్టడం, భారత క్రికెట్ సంఘం కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి తనయుడు జే షా పగ్గాలు చేపట్టడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

కోల్ కతా, మొహాలీ, చెన్నై లాంటి ప్రధాన క్రికెట్ వేదికల ప్రాభవం తగ్గి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ప్రభ వెలిగిపోతూ వస్తోంది. 700కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంలో అదానీ ఎండ్, అంబానీ ఎండ్ తో పాటు లక్షా 13వేల సీటింగ్ కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా గుర్తింపు తెచ్చుకొంది. దానికితోడు..వరుసగా ఏడు అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వడం ద్వారా నరేంద్ర మోడీ స్టేడియం వెలుగులోకి వచ్చింది. 2022, 2023 ఐపీఎల్ ఫైనల్స్ కు ఆతిథ్యమివ్వడంతో పాటు టెస్టులు, వన్డేలు, టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లకు ఎడాపెడా ఆతిథ్యమిస్తూ వస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే..గుజరాత్ క్రికెట్ సంఘానికి వద్దంటే డబ్బు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లోనూ సింహభాగం!

భారత్ వేదికగా అక్టోబర్- నవంబర్ మాసాలలో జరుగనున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ల్లో సింహభాగం నరేంద్ర మోడీ స్టేడియానికే దక్కాయి. ఫైనల్ తో సహా మొత్తం ఐదుమ్యాచ్ లకు అహ్మదాబాద్ స్టేడియం వేదిక కానుంది.

కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్, ఆయన సోదరుడు, బీసీసీఐ కోశాధికారి, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ లకు చెందిన ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియానికి సైతం భారీగా అంతర్జాతీయమ్యాచ్ లు నిర్వహించే అవకాశం అయాచితంగా వచ్చి పడుతోంది.ధర్మశాల, పుణె, లక్నో స్టేడియాలకు పెద్దపీట వేసిన బోర్డు...

మొహాలీ, రాజ్‌కోట్‌, ఇండోర్‌ స్టేడియాలను గాలికి వదిలేసింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి భారత్ పాల్గొనని మూడుమ్యాచ్ లను కేటాయించి మమ అనిపించింది.

భారత్ వేదికగా నాలుగోసారి వన్డే ప్రపంచకప్!

భారత్ వేదికగా పుష్కర కాలం విరామం తర్వాత జరుగనున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు బీసీసీఐ నాలుగోసారి ఆతిథ్యమిస్తోంది. ఈ మెగాటోర్నీకి మరో 98 రోజులుమాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ప్రపంచకప్ లీగ్ కమ్ నాకౌట్ మ్యాచ్ ల నిర్వహణ కోసం మొత్తం పది ప్రధాన వేదికలను ఎంపిక చేశారు. ఈటోర్నీలో కీలకమైన మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌కు కేటాయిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోడం విమర్శలకు తావిచ్చింది.

దేశంలో మిగిలిన ప్రధాన వేదికలు ముంబై, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరుకు అంతగా ప్రాధాన్యం లేని మ్యాచ్‌లు కేటాయించడం ద్వారా బీసీసీఐ కమ్ జే షా చేతులు దులుపుకొన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌కు...వడ్డించేవాడు మనవాడైతే..అన్నతీరుగా ప్రధానమ్యాచ్ లన్నీ కేటాయించింది.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తనయుడు, బోర్డు కార్యదర్శి జై షా ఈ మ్యాచ్ ల కేటాయింపు వెనుక ఉన్నట్లుగా ప్రచారం ఊపందుకొంది. ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ తో పాటు‌, ఫైనల్‌కు సైతం మోడీ స్టేడియం వేదికగా ఎంపికయ్యింది. అదీ చాలదన్నట్లు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగే రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ కు సైతం అహ్మదాబాద్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

మొత్తం 5 కీలక మ్యాచ్ లను అహ్మదాబాద్ స్టేడియం తన్నుకుపోయింది. మిగిలిన తొమ్మిది వేదికలకు కంటితుడుపు మ్యాచ్ లను కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.

మ్యాచ్ ల కేటాయింపులో వివక్ష....

ప్రపంచకప్‌ షెడ్యూల్‌ తో పాటు మ్యాచ్ లను కేటాయించిన తీరును క్రికెట్ విశ్లేషకులు, విమర్శకులు తప్పు పట్టారు. బోర్డు వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని,

బీజేపీ డబుల్ ఇంజిన్ రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రకు ఎక్కడలేని ప్రాధాన్యమిచ్చిన బోర్డు...ప్రతిపక్షపార్టీలు అధికారంలో ఉన్న మొహాలీ(పంజాబ్‌), రాంచీ (జార్ఖండ్‌)కి మొండిచేయి చూపించింది.

10 జట్ల లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ జరిగే మొత్తం 48 మ్యాచ్ ల్లో..అహ్మదాబాద్‌, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, ఢిల్లీ, ధర్మశాల, కోల్‌కతా, లక్నో స్టేడియాలకు ఐదేసి మ్యాచ్‌లు, హైదరాబాద్‌కు 3 మ్యాచ్‌లు మాత్రమే కేటాయించారు.

హైదరాబాద్‌ అంటే అంత అలుసా?

దేశానికి గొప్పగొప్ప క్రికెటర్లను అందించిన ఘనత, ఘనమైన వారసత్వం కలిగిన హైదరాబాద్ ను బోర్డు పెద్దలు చిన్నచూపు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

జై షా కార్యదర్శిగా హైదరాబాద్‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. కారణాలు ఏవైనా మూడంటే మూడు మ్యాచ్‌లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. భారత్‌ ఆడే మ్యాచ్‌లు కాకుండా..పాకిస్థాన్ జట్టు ఆడాల్సిన రెండుమ్యాచ్ లను హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. సౌకర్యాల పరంగా ఏ స్టేడియానికి తీసిపోని హైదరాబాద్‌ ను పక్కన పెట్టి.. ధర్మశాల, పుణె, లక్నోలకు అమిత ప్రాధాన్యం ఇచ్చినతీరు చర్చనీయాంశంగా మారింది.

హతవిధీ..మొహాలీ...

గత ప్రపంచకప్ టోర్నీలలో పలు చరిత్రాత్మక మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన మొహాలీ(పంజాబ్‌)కి కనీసం ఒక్కమ్యాచ్ కేటాయించకుండా బోర్డు పక్కన పెట్టింది. అంతర్జాతీయస్థాయిలో సౌకర్యాలు లేవన్న నెపంతో ఆతిథ్య వేదికల జాబితా నుంచి మొహాలీని తప్పించారు.

మొహాలీతో పాటు ఇండోర్‌, రాజ్‌కోట్‌, రాంచీ, నాగ్‌పూర్‌లకు సైతం మొండి చేయి చూపారు. రాజకీయ కక్షతోనే బోర్డు ఇలాంటి చర్యలకు పాల్పడిందని పంజాబ్‌ క్రీడామంత్రి గుర్మీత్‌సింగ్‌ మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ సైతం తిరువనంతపురానికి కనీసం ఒక్క ప్రపంచకప్ మ్యాచ్ ను ఇవ్వకపోడాన్ని తప్పు పట్టారు. బీసీసీఐని ట్విట్టర్‌ ద్వారా నిలదీశారు.

మొత్తం మీద ప్రపంచకప్ మ్యాచ్ ల కేటాయింపు ను రాజకీయకారణాలు తీవ్రంగా ప్రభావితం చేసినట్లుగా విమర్శకులు అంటున్నారు. నిధులు గుజరాత్ కే...క్రికెట్ మ్యాచ్ లూ గుజరాత్ కే అనేవారూ లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News