హార్థిక్ పాండ్యాకు భారత చీఫ్ కోచ్ షరతు!

భారత టీ-20 మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాను కష్టాలు ఒకదాని వెంట ఒకటిగా చుట్టుముడుతున్నాయి. భారత వన్డేజట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement
Update:2024-07-21 18:48 IST

భారత టీ-20 మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాను కష్టాలు ఒకదాని వెంట ఒకటిగా చుట్టుముడుతున్నాయి. భారత వన్డేజట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది.

భారత డాషింగ్ ఆల్ రౌండర్, మాజీ టీ-20 కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు నయాకోచ్ గౌతం గంభీర్ షరతు విధించాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారతజట్టులో చోటు దక్కాలంటే ఫిట్ నెస్ నిరూపించుకోడం అనివార్యమని హెచ్చరించాడు.

టీ-20 కెప్టెన్సీ హుష్ కాకి.....

ఇటీవలే ముగిసిన ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలపడంలో జట్టు వైస్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా తనవంతు పాత్ర నిర్వర్తించాడు. టీ-20 ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారతజట్టుకు హార్థిక్ పాండ్యానే పూర్తిస్థాయి నాయకుడు అనుకొనే లోపే కెప్టెన్సీ చేజారిపోయింది.

భారతజట్టు చీఫ్ కోచ్ గా గౌతం గంభీర్ పగ్గాలు చేపట్టడంతోనే హార్థిక్ పాండ్యాకు కష్టాలు మొదలయ్యాయి. వచ్చీరావడంతోనే హార్థిక్ పాండ్యా ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించి మరీ హుకుం జారీ చేశాడు.

ఐసీసీ మినీ ప్రపంచకప్ ( చాంపియన్స్ ట్రోఫీ)లో పాల్గొనే భారతజట్టులో పాండ్యాకు చోటు దొరకాలంటే ముందుగా ఫిట్ నెస్ నిరూపించుకోవాలని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు.

వన్డే మ్యాచ్ లు ఆడటంతో పాటు 10 ఓవర్లపాటు బౌలింగ్ చేసి తీరాల్సిందేనని పాండ్యాను గంభీర్ కోరాడు.

కెప్టెన్సీ చేజారటానికి అదేకారణం...

టీ-20 ఫార్మాట్లో రోహిత్ శర్మ వారసుడిగా భారతజట్టు పగ్గాలు చేపట్టాల్సిన హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించడం ద్వారా హార్థిక్ పాండ్యాకు కొత్తకోచ్ గంభీర్ షాకిచ్చాడు. అదీ చాలదన్నట్లు త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారతజట్టులో చోటు ఇవ్వాలంటే పూర్తి ఫిట్ నెస్ తో 10 ఓవర్లూ బౌలింగ్ చేయాలని పట్టుబట్టాడు.

ఓ వైపు విడాకుల షాక్ లో ఉన్న 30 సంవత్సరాల పాండ్యా కు ప్రపంచకప్ సాధించిన ఆనందమే లేకుండా పోయింది. భారత టీ-20 జట్టు కెప్టెన్సీ కూడా చేజారిపోయింది. వన్డే జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారడంతో పాండ్యా పీకలోతు కష్టాలలో కూరుకుపోయాడు.

దేశవాళీ క్రికెట్లో ఆడితీరాల్సిందే...

హార్థిక్ పాండ్యా తన ఫిట్ నెస్ ను మెరుగుపరచుకోడమే కాదు..నిరూపించుకోడానికి దేశవాళీ ( విజయ్ హజారే ట్రోఫీ ) క్రికెట్ టో్ర్నీలో పాల్గొని తీరాలని గంభీర్ పట్టుబడుతున్నాడు. పాండ్యాతో పాటు మిగిలిన సీనియర్ క్రికెటర్లు సైతం దేశవాళీ టోర్నీలు ఆడటం తప్పనిసరని బీసీసీఐ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

పాండ్యా తన బౌలింగ్ ఫిట్ నెస్ సాధించాలంటే విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరపున పాల్గొని 10 ఓవర్లూ బౌల్ చేయాల్సి ఉంది.

టీ-20 ఫార్మాట్లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కే పరిమితమైన పాండ్యా..వన్డేల్లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేయకతప్పని పరిస్థితి నెలకొని ఉంది.

స్పిన్ ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లతో పాటు ఆంధ్ర యువఆల్ రౌండర్ నితీశ్ రెడ్డిని సైతం చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంచేలా టీమ్ మేనేజ్ మెంట్ చర్యలు తీసుకొంది.

ముగ్గురు యువఆల్ రౌండర్లు అందుబాటులో ఉండడంతో చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారతజట్టులో పాండ్యాచోటుకు గ్యారెంటీ లేకుండా పోయింది. మినీ ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు దక్కించుకోవాలంటే..డిసెంబర్ 20 నుంచి జనవరి 18 వరకూ జరిగే 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడం ద్వారా ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.

2025 ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ( మినీ ప్రపంచకప్ ) ప్రారంభంకానుంది.

2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పొందిన సమయంలో పాండ్యా బౌలర్ గా తన కోటా 10 ఓవర్లలో 53 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.

బ్యాటర్ గా పాండ్యా 43 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 76 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Tags:    
Advertisement

Similar News