ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు కోటి నజరానా!

పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించే భారత అథ్లెట్లకు గతంలో ఎన్నడూలేనంతగా భారీనజరానా దక్కనుంది.

Advertisement
Update:2024-06-26 13:03 IST

పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించే భారత అథ్లెట్లకు గతంలో ఎన్నడూలేనంతగా భారీనజరానా దక్కనుంది.

పారిస్ వేదికగా మరికొద్దివారాలలో ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ, సన్నాహాల కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన భారత ఒలింపిక్‌ సంఘం..గతంలో ఎన్నడూ లేనంతగా ప్రోత్సాహక నగదు బహుమతుల మొత్తాన్ని సైతం పెంచింది.

125మంది అథ్లెట్లతో భారత్ పతకాల వేట...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడల పండుగ ఒలింపిక్స్ లో 204 దేశాలకు చెందిన 10 వేల మంది అథ్లెట్లు తలపడబోతున్నారు. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే ఈ క్రీడాసంరంభంలో 125మంది అథ్లెట్ల భారీబృందం పతకాలవేటకు దిగుతోంది.

టీమ్, వ్యక్తిగత విభాగాలలో ఇప్పటికే వందమందికి పైగా భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించారు. రానున్న కొద్దిరోజుల్లో మరికొంతమంది అధ్లెట్లు అర్హత సాధించే అవకాశం ఉంది.

గత ఒలింపిక్స్ లో ఓ స్వర్ణం, రెండురజతాలు, నాలుగు కాంస్యాలు సాధించిన భారత్..ప్రస్తుత ఒలింపిక్స్ లో మరింత మెరుగై ప్రదర్శన చేయాలన్న పట్టుదలతో ఉంది.

భారీగా పెరిగిన ఒలింపిక్స్ నజారానా....

ఒలింపిక్స్ పతక విజేతలకు గతంలో కంటే మరింత ఎక్కువ నగదు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు భారత ఒలింపిక్స్ సంఘం ప్రకటించింది. బంగారు పతకం నెగ్గిన విజేతలకు కోటి రూపాయలు, రజత పతకం సాధించిన వారికి 50 లక్షల రూపాయలు, కాంస్య విజేతలకు 30 లక్షల రూపాయల చొప్పున అందచేయనున్నారు.

2018 ఆసియాక్రీడల నుంచే భారత ఒలింపిక్స్ సంఘం పతక విజేతలుగా నగదు ప్రోత్సాహక బహుమతులు అందచేస్తూ వస్తోంది.

ఆసియాక్రీడల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించినవారికి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తూ వస్తున్నారు.

75 లక్షల నుంచి కోటి రూపాయలు...

2021 టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలకు భారత ఒలింపిక్స్ సంఘం 75 లక్షలు, 45 లక్షలు, 25 లక్షల రూపాయల చొప్పున అందచేసింది. ఆ మొత్తాన్ని ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ నాటికి దాదాపుగా రెట్టింపు చేసింది.

2024 ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు తొలిసారిగా రెండంకెల సంఖ్యలో పతకాలు సాధించే అవకాశం ఉందని, పతకవిజేతలకు నజరానాగా 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లు..భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు.

హాకీజట్టుకు 2 కోట్ల నజరానా...

టీమ్ విభాగంలో బంగారు పతకం సాధించిన భారత హాకీజట్టు సభ్యులు..స్వర్ణం సాధిస్తే 2 కోట్ల రూపాయలు నగదు బహుమతిగా అందచేయనున్నారు. రజత పతకం సాధిస్తే కోటి రూపాయలు, కాంస్యం నెగ్గితే 75 లక్షల రూపాయలు చెల్లించనున్నారు.

ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్లకు 42 లక్షల ( 50 వేల డాలర్లు ) రూపాయలు చొప్పున ఇస్తామని ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది.

రోజుకు 50 డాలర్లు.......

ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు రోజుకు 50 డాలర్లు చొప్పున దినసరి భత్యంగా అందచేయాలని భారత ఒలింపిక్స్ సంఘం నిర్ణయించింది. మొత్తం 195 మంది సభ్యుల కోసం అలవెన్సులను సిద్ధం చేసింది.

అథ్లెట్లకు 2 లక్షల రూపాయల నగదు మొత్తాన్ని, కోచింగ్ స్టాఫ్ కు లక్ష రూపాయల చొప్పున గ్రాంట్ ను తొలిసారిగా అందచేసింది. నలుగురు సభ్యుల గోల్ఫ్ బృందానికి అవసరమైన గోల్ఫ్ బ్యాగుల కోసం 4 లక్షల 40వేల రూపాయలు కేటాయించింది. అశ్వక్రీడల కోసం ప్రత్యేకంగా 9 లక్షల రూపాయలు అందుబాటులో ఉంచింది.

Tags:    
Advertisement

Similar News