భారత విలువిద్య జట్టు సంచలనం, 14 ఏళ్ళ తరువాత స్వర్ణం!
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత విలువిద్యజట్టు అదరగొట్టింది. 14 ఏళ్ళ విరామం తరువాత టీమ్ రికర్వ్ బంగారు పతకం గెలుచుకొంది.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత విలువిద్యజట్టు అదరగొట్టింది. 14 ఏళ్ళ విరామం తరువాత టీమ్ రికర్వ్ బంగారు పతకం గెలుచుకొంది...
పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహకంగా జరుగుతున్న 2024- ప్రపంచ విలువిద్య పోటీల కాంపౌండ్, రికర్వ్ విభాగాలలో భారత క్రీడాకారులు అందరగొట్టారు.
పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాలతో పాటు..టీమ్ విభాగాలలో సైతం పతకాల పంట పండించారు.
రికర్వ్ ఫైనల్లో సంచలనం...
ఒలింపిక్స్ లో ప్రధాన క్రీడాంశంగా ఉన్న పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారతజట్టు 14 సంవత్సరాల విరామం తరువాత బంగారు పతకం గెలుచుకొని సంచలనం సృష్టించింది.
చైనాలో షాంఘైవేదికగా జరుగుతున్న ఈ పోటీల కాంపౌండ్ విభాగంలో బంగారు పంట పండించుకొన్న భారత్..రికర్వ్ పురుషుల విభాగంలో మాత్రమే అంచనాలకు మించి రాణించగలిగింది.
ధీరజ్ బొమ్మదేవర, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ లతో కూడిన భారతజట్టు టైటిల్ పోరులో ప్రపంచ చాంపియన్ దక్షిణ కొరియాజట్టుపైన 5-1తో అరుదైన విజయం సాధించింది. ఈ విజయంతో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కు భారతజట్టు మరింత చేరువ కాగలిగింది.
ప్రపంచ విలువిద్య రికర్వ్ విభాగంలో తిరుగులేని జట్టుగా పేరుపొందిన కొరియాను కంగు తినిపించడం భారత విలువిద్య జట్టు ప్రతిష్టను మరింత పెంచింది.
తరుణ్ దీప్ అరుదైన ఘనత...
2010 ప్రపంచ విలువిద్య రికర్వ్ విభాగంలో బంగారు పతకం సాధించిన భారతజట్టులోని కీలక సభ్యుడు తరుణ్ దీప్ రాయ్..ప్రస్తుత 2024 జట్టులోనూ సభ్యుడిగా స్వర్ణ పతకం అందుకోడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.
2010 ప్రపంచ ఫైనల్లో జపాన్ ను ఓడించిన భారతజట్టు..2024 ఫైనల్లో నంబర్ వన్ దక్షిణ కొరియాజట్టునే చిత్తు చేయడం విశేషం.
రెండు ప్రపంచ మేటి జట్ల నడుమ జరిగిన ఈ పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. భారతజట్టు 57-57, 57-55, 55-53 పాయింట్ల తేడాతో టైటిల్ ఖాయం చేసుకోగలిగింది.
మిక్సిడ్ టీమ్ విభాగంలో కాంస్యం...
మిక్సిడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారతజోడీ అంకిత బకాత్- ధీరజ్ 6-0 ( 35-31, 38-35, 39-37 ) తో మెక్సికో జంట అలెజాండ్రా వాలెన్షియా- మతయాస్ గ్రాండీలను చిత్తు చేశారు.
కాంపౌండ్, రికర్వ్ విభాగాలలో భారత్ ఇప్పటి వరకూ 5 స్వర్ణ, ఒక్కో రజత, కాంస్య పతకాలు సాధించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మాజీనంబర్ వన్ దీపిక కుమారీ సైతం పతకం వేటలో ఉంది.
ధీరజ్ కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్...
ఇప్పటి వరకూ భారత్..పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీలో కేవలం ఒక్క బెర్త్ మాత్రమే సంపాదించింది. రికర్వ్ విభాగం పురుషుల వ్యక్తిగత పోటీలలో పాల్గొనటానికి భారత స్టార్ ఆర్చర్ ధీరజ్ అర్హత సంపాదించాడు.
జూన్ 18 నుంచి 23 వరకూ టర్కీలోని అంటాలియా వేదికగా జరిగే ప్రపంచ స్టేజ్-3 పోటీల ఫలితాల ఆధారంగా భారత జట్ల ఒలింపిక్స్ అర్హత ఖరారు కానుంది.
ప్రస్తుత ప్రపంచ విలువిద్య టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ 231 పాయింట్లతో మూడో అత్యుత్తమజట్టుగా కొనసాగుతోంది.
241 పాయింట్లతో చైనా నంబర్ వన్ ర్యాంకులో ఉంటే, 340 పాయింట్లతో దక్షిణ కొరియా రెండోర్యాంక్ లో నిలిచింది.
కాంపౌండ్ విభాగంలో భారత్ గోల్డెన్ స్వీప్..
ఒలింపిక్స్ లో పతకం అంశంగా లేని కాంపౌండ్ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ కు ఎదురేలేకపోయింది. పురుషుల, మహిళల టీమ్ బంగారు పతకాలతో పాటు..మిక్సిడ్ టీమ్ స్వర్ణ పతకం సైతం భారత్ కే దక్కింది.
మహిళల వ్యక్తిగత విభాగంలో ఆసియాక్రీడల గోల్డ్ మెడలిస్ట్ జ్యోతి సురేఖ ప్రపంచ పోటీల వ్యక్తిగత విభాగంలో సైతం విజేతగా బంగారు పతకం అందుకొంది. ప్రస్తుత ప్రపంచ విలువిద్య పోటీలలో భారత్ కు సురేఖ నాలుగో బంగారు పతకం అందించింది.
అంతకుముందు జరిగిన పురుషుల, మహిళల టీమ్ విభాగాలతో పాటు..మిక్సిడ్ టీమ్ విభాగంలో సైతం భారత్ స్వర్ణాలు కైవసం చేసుకొంది.