భారత మహిళలకు నేటినుంచే ఆస్ట్ర్రేలియా 'టెస్ట్'!

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఓ ఆసక్తికరమైన మహిళా టెస్టు మ్యాచ్ సమరానికి ముంబై వాంఖడే స్టేడియంలో తెరలేవనుంది. నేటినుంచే నాలుగురోజులపాటు సాగే ఈపోరులో ఆస్ట్ర్రేలియాకు భారత్ సవాలు విసురుతోంది.

Advertisement
Update:2023-12-21 12:00 IST

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఓ ఆసక్తికరమైన మహిళా టెస్టు మ్యాచ్ సమరానికి ముంబై వాంఖడే స్టేడియంలో తెరలేవనుంది. నేటినుంచే నాలుగురోజులపాటు సాగే ఈపోరులో ఆస్ట్ర్రేలియాకు భారత్ సవాలు విసురుతోంది.

మహిళా టెస్టు క్రికెట్ శిఖరం ఆస్ట్ర్రేలియాతో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు ఢీకొనబోతోంది. గత వారం నవీముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన సింగిల్ టెస్టుమ్యాచ్ లో 357 పరుగుల భారీవిజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాతో సమరానికి భారత్ సై అంటోంది.

2021 తర్వాత తొలిసారిగా టెస్టు సమరం..

భారత్- ఆస్ట్ర్రేలియాజట్లు 2021 తరువాత తొలిసారిగా నాలుగురోజుల టెస్ట్ మ్యాచ్ లో ఢీ కొనబోతున్నాయి. 1977లో ఈ రెండుజట్లు తొలిసారిగా టెస్టుమ్యాచ్ లో తలపడిన నాటినుంచే ఆస్ట్ర్రేలియాజట్టు అజేయంగా నిలుస్తూ వస్తోంది.

1984లో వాంఖడే స్టేడియం వేదికగా..భారతగడ్డపై చివరిసారిగా తలపడిన సమయంలో భారీవిజయం సాధించిన కంగారూజట్టు మరోసారి అదేస్థాయి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

భారత్ ప్రత్యర్థిగా 2021 వరకూ 10 టెస్టులు ఆడిన ఆస్ట్ర్రేలియాకు ఒక్క ఓటమి లేకపోడం విశేషం. అయితే రెండేళ్ల క్రితం కారారా ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ సమఉజ్జీగా నిలవడంతో ప్రస్తుతటెస్టులో గట్టిపోటీ తప్పదని భావిస్తోంది.

గత 10 టెస్టుల్లో భారత్ పై కంగారూజట్టుకు 4 విజయాలు, 6 మ్యాచ్ ల డ్రా రికార్డు ఉంది.

అలీసా హేలీ నాయకత్వంలోని కంగారూ జట్టులో సూపర్ బ్యాటర్లు, మ్యాజిక్ స్పిన్నర్లు, పదునైన పేస్ బౌలర్లు ఉండడంతో భారత్ కు అంతతేలిక కాదని ఆస్ట్ర్రేలియా కోచ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.భారత్ లోని వాతావరణం, స్పిన్ పిచ్ కు అలవాటు పడితే విజయం సాధించడం ఏమంత కష్టంకాబోదని చెబుతున్నారు. భారత మహిళా టెస్టు చరిత్రలో కేవలం వారం రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు జట్లతో టెస్టుమ్యాచ్ లు ఆడటం ఇదే మొదటిసారి.

స్పిన్ బౌలింగే ఆయుధంగా భారత్...

ఇంగ్లండ్ తో కొద్దిరోజుల క్రితమే ముగిసిన నాలుగురోజుల టెస్టు మూడున్నర రోజుల ఆటలోనే స్పిన్ బౌలింగ్ ప్రధాన అస్త్రంగా అతిపెద్ద విజయం సాధించిన భారత్ మరోసారి..స్పిన్ బౌలర్ల బలంతోనే కంగారూల పని పట్టాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

టాస్ నెగ్గే పక్షంలో ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 350కి పైగా పరుగులు సాధించగలిగితే కంగారూలపైన ఒత్తిడి ఉంటుందని భారత కోచ్ అమోల్ మజుందార్ అంటున్నారు.

ఓపెనర్లు స్మృతి మందన, షెఫాలీ వర్మ ఇచ్చే ఆరంభం పైనే భారత జయాపజయాలు ఆధార పడి ఉన్నాయి. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగేజ్, యాస్తికా భాటియా, స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ మరోసారి స్థాయికి తగ్గట్టుగా ఆడితే కంగారూజట్టును నిలువరించే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ తో టెస్టులో శుభ సతీశ్ 69, జెమీమా 68, యాస్తికా భాటియా 66, దీప్తి శర్మ 69, హర్మన్ 49 స్కోర్లు సాధించడంతో భారత్ 428 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది. పైగా ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే కుప్పకూల్చడంతో భారీవిజయానికి మార్గం సుగమమయ్యింది.

స్పిన్నర్లతో ముప్పేట దాడికి రెడీ...

స్పిన్నర్ల త్రయం దీప్తి శర్మ, రాజేశ్వరీ గయక్వాడ్, స్నేహ రాణాలతో కూడిన భారత్ ముప్పేటదాడితో కంగారూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయాలన్న లక్ష్యంతో పోటీకి సిద్ధమయ్యారు. పేస్ జోడీ రేణుకా సింగ్, పూజా వస్త్ర్రకర్ సైతం కీలకం కానున్నారు.

అలీసా హేలీ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియాజట్టులో డార్సీ బ్రౌన్, లారెన్ చీట్లే, హేథర్ గ్రాహం, అష్లీగా గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, లిచ్ ఫీల్డ్, తాహిలా మెక్ గ్రాత్, బెత్ మూనీ, ఎల్సీ పెర్రీ, మేఘాన్ షుట్, అనాబెల్ సదర్లాండ్, జార్జియా వారేహామ్ లాంటి సూపర్ స్టార్లు ఉన్నారు.

తనకంటే ఎన్నో రెట్లు బలమైన కంగారూజట్టును భారత్ స్థానబలానికి స్పిన్ మ్యాజిక్ ను జోడించి బోల్తా కొట్టిస్తుందా...తెలుసుకోవాలంటే మరో నాలుగురోజులపాటు వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News