2036 ఒలింపిక్స్ ఆతిథ్య పోటీలో భారత్!
Olympics 2036 India: 2036లో జరిగే ఒలింపిక్స్ నిర్వహించడానికి భారత్ ఆసక్తితో ఉందని, ఆతిథ్యమివ్వటానికి పోటీ పడాలని భావిస్తోందని కేంద్ర క్రీడాశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ అధికారికంగా ప్రకటించారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రీడాసంబరం ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వాలని భారత్ భావిస్తోంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో భారత్ పోటీపడుతుందని కేంద్రక్రీడాశాఖ మంత్రి ప్రకటించారు....
ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశంగా ఉన్నభారత్ ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ ను నిర్వహించాలని ఉవ్విళూరుతోంది. ఇప్పటికే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ ను విజయవంతంగా నిర్వహించిన అనుభవం భారత్ కు ఉంది.
గతంలో అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన అనుభవంతో ఒలింపిక్స్ ను సైతం నిర్వహించగలమన్న ధీమా భారత్ లో కనిపిస్తోంది. 2036లో జరిగే ఒలింపిక్స్ నిర్వహించడానికి భారత్ ఆసక్తితో ఉందని, ఆతిథ్యమివ్వటానికి పోటీ పడాలని భావిస్తోందని కేంద్ర క్రీడాశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ అధికారికంగా ప్రకటించారు.
గుజరాత్ వేదికగా ఒలింపిక్స్ ?
ఇటీవలే జరిగిన జీ-20 ప్రెసిడెన్సీ శిఖరాగ్ర సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించిన భారత్ ..ఒలింపిక్స్ ను మాత్రం ఎందుకు నిర్వహించలేదని కేంద్ర క్రీడామంత్రి ప్రశ్నిస్తున్నారు.
2032 వరకూ ఒలింపిక్స్ వేదికలు ఖరారు కావడంతో...2036 ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యమివ్వాలని భావిస్తోందని, అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం భారత్ వైపు మొగ్గుచూపితే గుజరాత్ వేదికగా ప్రపంచ క్రీడల పండుగ నిర్వహిస్తామని అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వటానికి జరిగే పోటీలో పాల్గొనటానికి పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.
గతంలో ఎన్నడూలేని విధంగా క్రీడలకు భారత్ ప్రాధాన్యమిస్తోందని, ఒలింపిక్స్ ను సైతం నిర్వహించడానికి సిద్ధంగా ఉందన్న వాస్తవాన్ని ప్రపంచ దేశాలు గమనించాలని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.
ఇప్పటికే..గుజరాత్ పలుమార్లు ఒలింపిక్స్ నిర్వహించడానికి తన సంసిద్ధతను తెలిపిందని, ఒలింపిక్స్ కు అవసరమైన క్రీడాసముదాయాలు, విమానాశ్రయాలు, స్టార్ హోటళ్లు, హాస్టల్సు లాంటి మౌలిక సదుపాయాలు గుజరాత్ లో ఉన్నట్లు తెలిపారు.
ఉట్టికెగరలేనమ్మ.....
మరోవైపు..ఒలింపిక్స్ లాంటి భారీఖర్చుతో కూడిన అంతర్జాతీయ క్రీడోత్సవాన్ని నిర్వహించే సత్తా భారత్ కు ఉందా అంటే..లేదని క్రీడాపండితులు అంటున్నారు. తమ రాష్ట్ర్రప్రభుత్వ ఉద్యోగులకే సకాలంలో జీతాలు చెల్లించలేక సతమతమవుతున్న గుజరాత్ ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని ప్రకటించడాన్ని మించిన జోకు మరొకటి లేదని అంటున్నారు.
పైగా..గత ఏడుసంవత్సరాలుగా భారత ప్రభుత్వం అప్పులకుప్పగా మారిపోయింది. కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ లోక్ సభకు అందించిన వివరాల ప్రకారం..రోజుకు 3వేల 24 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం పలురూపాలలో అప్పులు చేస్తూ వస్తోంది.
నెలకు 90వేల 720 కోట్లు, సంవత్సరానికి 10. 88 లక్షల కోట్ల వంతున గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో కేంద్రప్రభుత్వం 92లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. భారత పౌరులను లక్షాధికారులు చేయటం సంగతేమో కానీ..ఇప్పటికీ తలసరి అప్పును లక్షల మేరకు దాటించింది.
గతంలో ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వడం ద్వారా గ్రీస్, బ్రెజిల్ లాంటి దేశాలు ఆర్థికంగా దివాళాతీశాయి. జపాన్, ఇంగ్లండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వటాన్ని ఓ దుస్సాహసంగా పరిగణిస్తున్నాయి.
గతంలో 72 దేశాలు తలపడిన కామన్వెల్తే గేమ్స్ కు ఆతిథ్యమివ్వటానికే నానాపాట్లు పడిన భారత్ 204 దేశాలు పోటీపడే ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తామనడాన్ని మించిన హాస్యాస్పదం మరొకటి ఉండదని విమర్శకులు చెబుతున్నారు.
ఒలింపిక్స్ నిర్వహించడం సంగతి అటుంచి...ఆతిథ్యమివ్వటానికి జరిగే పోటీలో భారత్ విజేతగా నిలిస్తే అదే గొప్పఘనకార్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒలింపిక్స్ పతకాల పట్టిక మొదటి 40 స్థానాలలో నిలవడమే గగనంగా మారిన భారత్ ... ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తామనడం..ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరడం లాంటిదే. అందులో ఏమాత్రం సందేహం లేదు.