సూర్య హోరు, తిలక్ జోరుతో భారత్ టాప్ గేర్!

వెస్టిండీస్ తో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ మూడోమ్యాచ్ లో భారత్ కీలక విజయం సాధించింది. సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.

Advertisement
Update:2023-08-09 10:00 IST

సూర్య హోరు, తిలక్ జోరుతో భారత్ టాప్ గేర్!

వెస్టిండీస్ తో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ మూడోమ్యాచ్ లో భారత్ కీలక విజయం సాధించింది. సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.

వెస్టిండీస్ తో టీ-20 సిరీస్ లో వరుస పరాజయాలతో డీలా పడిన భారత్ కీలక మూడోమ్యాచ్ లో కళ్లు చెదిరే విజయం సాధించింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ గెలుపు ఆశల్నిసజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈ పోరులో 17.5 ఓవర్లలోనే భారత్ విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది.

గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ముగిసిన పోరులో టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ కు దిగిన భారత్ ..ప్రత్యర్థిజట్టును 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగుల స్కోరుకే పరిమితం చేయగలిగింది.

కరీబియన్ టాపార్డర్ కు కుల్దీప్ పగ్గాలు...

గయానా స్లో పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న కరీబియన్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్- కీల్ మేయర్స్ జోడీ మొదటి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అయితే...భారత స్పిన్ జోడీ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌల్ చేసి నాలుగు కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా పగ్గాలు వేయగలిగారు.

ఓపెనర్లు బ్రెండన్ కింగ్ 42, మేయర్స్ 25, వన్ డౌన్ చార్లెస్ 12, డేంజర్ మ్యాన్ నికోలస్ పూరన్ 20 పరుగుల స్కోర్లకే అవుటైనా...కెప్టెన్ రోవ్ మన్ పావెల్ చివర్లో మెరుపులు మెరిపించాడు.

భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 19 బంతుల్లోనే ఓ ఫోరు, మూడు భారీసిక్సర్లతో 40 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో విండీస్ 159 పరుగుల స్కోరు సాధించగలిగింది.

భారత బౌలర్లలో లెఫ్టామ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.

సూర్య సునామీ బ్యాటింగ్...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 160 పరుగుల స్కోరు సాధించాల్సిన భారత్..ప్రారంభ ఓవర్లలోనే ఓపెనింగ్ జోడీ యశస్వి జైశ్వాల్- శుభ్ మన్ గిల్ ల వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. టీ-20 అరంగేట్రం మ్యాచ్ లో యశస్వి ఒకే ఒక్క పరుగుకే అవుట్ కాగా..శుభ్ మన్ గిల్ 11 బంతుల్లో 6 పరుగుల స్కోరుకు వెనుదిరగడంతో భారత్ 4.2 ఓవర్లలో 34 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. అయితే వన్ డౌన్ సూర్యకుమార్ యాదవ్, రెండో డౌన్ తిలక్ వర్మ...వచ్చీ రావడంతోనే రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు. భారీషాట్లతో విరుచుకు పడ్డారు.

పవర్ ప్లే ఓవర్లలో భారత్ 2 వికెట్లకు 60 పరుగుల స్కోరుతో పుంజుకోగలిగింది. మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ ఓ వైపు నుంచి గ్రౌండ్ నలుమూలలకూ ఫోర్లు, సిక్సర్ షాట్లు బాదుతుంటే..యువబ్యాటర్ తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ..అదను దొరికిన ప్రతిసారీ బౌండ్రీ షాట్లు కొడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు

23 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ..

భారత వైస్ కెప్టెన్, టీ-20 ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ కేవలం 23 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడు.

తన టీ-20 కెరియర్ లో మూడో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేయగలిగాడు.

తిలక్ వర్మతో కలసి మూడో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో పాటు..సూర్యకుమార్ 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగుల స్కోరు సాధించాడు. శతకానికి 17 పరుగుల దూరంలో అవుటయ్యాడు.

సూర్యస్థానంలో వచ్చిన కెప్టెన్ హార్థిక్ పాండ్యా 15 బంతుల్లో ఒక్కో ఫోరు, సిక్సర్ తో 20 పరుగుల స్కోరుతోనూ , తిలక్ వర్మ 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 49 పరుగుల నాటౌట్ గాను నిలిచారు.

హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ప్రస్తుత సిరీస్ లోని మూడుకు మూడు మ్యాచ్ ల్లోనూ 39, 51, 49 నాటౌట్ స్కోర్లతో సత్తా చాటుకోగలిగాడు.

భారత్ 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి..7 వికెట్ల విజయంతో బోణీ కొట్టింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ లు ముగిసే సమయానికి కరీబియన్ టీమ్ 2-1 ఆధిక్యంతో ఉంది. అమెరికాలోని ఫ్లారిడా వేదికగా జరిగే ఆఖరి రెండు వన్డేలలో భారత్ నెగ్గితేనే సిరీస్ విజేతగా నిలువగలుగుతుంది. సిరీస్ లోని నాలుగో వన్డే ఆగస్టు 12న లాడర్ హిల్ వేదికగా జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News